చూడటానికి బుజ్జి కారే కానీ.. కొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీతో మారుతి జిమ్నీ రెండు కొత్త వేరియంట్స్
ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ లవర్లకు సుజుకి తీపి కబురు అందించింది. తన పాపులర్ మోడల్ జిమ్నీలో ఆల్‌గ్రిప్ ప్లస్ (Allgrip Plus), రైనో ప్లస్ (Rhino Plus) అనే రెండు సరికొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వీటిని 3-డోర్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. స్టైలింగ్, ఫీచర్లు, ముఖ్యంగా సేఫ్టీ విషయంలో ఈ కొత్త వేరియంట్లు పాత వాటి కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. సుజుకి ఈ కార్లను మలేషియాలో లాంచ్ చేసినప్పటికీ, వీటి ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిమ్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సుజుకి జిమ్నీ ఆల్‌గ్రిప్ ప్లస్
ఆల్‌గ్రిప్ ప్లస్ వేరియంట్‌ను కంపెనీ మరింత ప్రీమియం ఫీచర్లతో ముస్తాబు చేసింది. ఇందులో పవర్-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు (ORVMs), హీటింగ్ ఫంక్షన్‌తో వస్తున్నాయి. కారు లోపల 9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అదనంగా ఆటోమేటిక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, హెడ్‌ల్యాంప్ వాషర్లు, 50:50 స్ప్లిట్ రియర్ సీట్లు వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీలో భారీ అప్‌గ్రేడ్స్
జిమ్నీ ఆల్‌గ్రిప్ ప్లస్‌లో సేఫ్టీకి పెద్ద పీట వేశారు. ఇందులో ఎంఎండబ్ల్యూవే (mmWave) రాడార్, మోనోక్యులర్ కెమెరా, రివర్స్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు జోడించారు. డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్ II, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ హై బీమ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి. జపాన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఈ మోడల్ ధర మలేషియాలో దాదాపు రూ. 37.28 లక్షలుగా ఉంది.
సుజుకి జిమ్నీ రైనో ప్లస్: ఐకానిక్ స్టైలింగ్
ఇక రైనో ప్లస్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది పాత తరం జిమ్నీ వారసత్వాన్ని గుర్తుకు తెచ్చేలా డిజైన్ చేయబడింది. దీని స్పేర్ వీల్ కవర్‌పై ఐకానిక్ రైనో లోగో ఉంటుంది. కారు బాడీపై రెడ్, గ్రే, బ్లాక్ కలర్ డెకల్స్ రియల్ ఆఫ్-రోడర్ బ్రాండింగ్‌తో ఆకట్టుకుంటాయి. రెడ్ కలర్ మడ్ ఫ్లాప్స్, ఫ్రంట్-సైడ్ బంపర్ గార్నిష్ ఈ వేరియంట్‌కు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి. సేఫ్టీ పరంగా ఇందులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీని ధర భారత కరెన్సీలో సుమారు రూ.40.80 లక్షలుగా ఉంది.

ఇంజన్, పర్ఫామెన్స్
మెకానికల్ పరంగా ఈ కొత్త వేరియంట్లలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో పాత 1.5-లీటర్ K15B నేచురల్లీ ఆస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది 101 హార్స్‌పవర్, 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు. అలాగే ఆఫ్-రోడింగ్ కోసం పవర్ ఫుల్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కొనసాగించారు.
ఇండియాలో డిమాండ్ లేనట్లే!
అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఈ సరికొత్త ప్రీమియం అప్‌గ్రేడ్లతో జిమ్నీ ఎంత హల్‌చల్ చేసినప్పటికీ, భారత మార్కెట్లో మాత్రం ఈ కొత్త వేరియంట్లకు పెద్దగా డిమాండ్ ఉండే అవకాశం లేదు. ఇప్పటికే ఇండియాలో లాంచ్ అయిన 5-డోర్ జిమ్నీ ఆశించిన స్థాయిలో అమ్మకాలను నమోదు చేయలేక చతికిలపడింది.

మన దేశీ కస్టమర్లు ఈ ధరలో పెద్ద సైజ్ ఎస్‌యూవీల వైపో లేదా రోడ్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండే ప్రత్యామ్నాయ మోడల్స్ వైపో మొగ్గు చూపుతుండటంతో, ప్రస్తుతానికి ఈ కొత్త జిమ్నీ వేరియంట్లకు ఇండియాలో ఎలాంటి డిమాండ్ లేదనే చెప్పాలి.


Click it and Unblock the Notifications