8 మంది కూర్చోవచ్చు.. అవసరమైతే హాయిగా పడుకుని వెళ్లొచ్చు! పెద్ద ఫ్యామిలీల కోసం సుజుకి పెద్ద కారు
ప్రపంచంలోని ప్రతి దేశానికి తనదైన ఆటోమొబైల్ సంస్కృతి ఉంటుంది. వినియోగదారుల జీవనశైలి, రహదారి పరిస్థితులు, కుటుంబ అవసరాలు, ప్రయాణ విధానాలను బట్టి అక్కడి వాహన మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. ఈ విషయంలో జపాన్ ఆటోమొబైల్ మార్కెట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. అక్కడ ఎక్కువ మంది వినియోగదారులు కేవలం స్టైలిష్‌గా కనిపించే కార్లకంటే, రోజువారీ జీవితంలో ఎక్కువ ఉపయోగపడే వాహనాలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే జపాన్‌లో మినీవ్యాన్‌లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. విశాలమైన క్యాబిన్, ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యం, కుటుంబ అవసరాలకు అనుకూలమైన డిజైన్ కారణంగా మినీవ్యాన్‌లు అక్కడి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా మారాయి. కుటుంబ ప్రయాణాలు, వ్యాపార అవసరాలు, రోజువారీ వినియోగం.. ఇలా ఎన్నో అవసరాలకు ఒకే వాహనం సరిపోవడం వీటి ప్రత్యేకత.
అందుకే జపాన్‌లో అనేక కంపెనీలు ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సుజుకి తన ప్రముఖ ల్యాండీ మినీవ్యాన్ (landy-minivan)ను 2026 మోడల్ సంవత్సరానికి అప్‌డేట్ చేసి జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2007లో తొలిసారి మార్కెట్లోకి వచ్చిన ల్యాండీ, గత రెండు దశాబ్దాలుగా కుటుంబ వినియోగదారుల మధ్య మంచి ఆదరణ పొందుతోంది. తాజా అప్‌డేట్‌తో ఈ మోడల్ మరింత ఆధునిక ఫీచర్లు, సౌకర్యాలతో కస్టమర్ల ముందుకు వచ్చింది.

కొత్త 2026 సుజుకి ల్యాండీ డిజైన్, ఫీచర్లు, ప్రాక్టికాలిటీ పరంగా గత మోడల్‌తో పోలిస్తే మరింత మెరుగుపడింది. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మినీవ్యాన్‌లో కంపెనీ పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా సీటింగ్ లేఅవుట్‌లో చేసిన అప్‌డేట్ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించనుంది. ఇప్పటి వరకు 7-సీటర్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ల్యాండీ, ఇప్పుడు 8-సీటర్ కాన్ఫిగరేషన్‌తో కూడా లభించనుంది.
దీంతో పెద్ద కుటుంబాలు లేదా ఎక్కువ మంది ప్రయాణించే వారికి ఇది మరింత ఉపయోగకరంగా మారింది. అంతేకాకుండా, రెండో, మూడో వరుస సీట్లను పూర్తిగా మడిచి బెడ్‌లా మార్చుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది. దీని వల్ల దూర ప్రయాణాలు, క్యాంపింగ్ లేదా విశ్రాంతి అవసరాల సమయంలో అదనపు సౌకర్యం లభిస్తుంది. ఇంజన్ పరంగా కూడా కంపెనీ చాలా పెద్ద అప్‌డేట్ చేసింది.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 2026 ల్యాండీ 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన హైబ్రిడ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ హైబ్రిడ్ సెటప్ గరిష్టంగా 138 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పనితీరు మాత్రమే కాకుండా ఇంధన సామర్థ్యంపైనా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సుజుకి ప్రకారం, ఈ మినీవ్యాన్ లీటరుకు 23.2 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించగలదు. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్(FWD) రూపంలో అందుబాటులో ఉంటుంది.
అయితే మెరుగైన ట్రాక్షన్, అన్ని రకాల రోడ్లపై ప్రయాణ సౌకర్యం కోరుకునే కస్టమర్ల కోసం E-Four పేరుతో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ధరల విషయానికి వస్తే, జపాన్ మార్కెట్లో 2026 సుజుకి ల్యాండీ ఫ్రంట్-వీల్ డ్రైవ్ వెర్షన్ ప్రారంభ ధర భారత కరెన్సీలో సుమారు రూ.23 లక్షలుగా నిర్ణయించబడింది. ఇక E-Four ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర సుమారు రూ.24.71 లక్షల వరకు ఉంటుంది.

దీనిని మినీవ్యాన్‌గా వర్గీకరించినప్పటికీ, పరిమాణం పరంగా చూస్తే ఇది మన దేశంలో అమ్ముడవుతున్న అనేక 7-సీటర్ కార్లతో సమానంగా ఉంటుంది. అందువల్ల "వ్యాన్" అనే పేరు విన్నంత మాత్రాన ఇది చాలా పెద్ద కమర్షియల్ వాహనం అని భావించాల్సిన అవసరం లేదు. ఉపయోగకరత, సీటింగ్ సామర్థ్యం, కుటుంబ ప్రయాణ సౌకర్యం పరంగా చూస్తే, ఇది ఒక ఆధునిక 7 లేదా 8-సీటర్ ఫ్యామిలీ కారుగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications