పెట్రోల్ కొట్టించే బాధలేదు.. క్లచ్ నొక్కే పనేలేదు.. మైలేజ్ ఆశించే మధ్య తరగతి వాళ్ల కోసం టాటా అద్భతమైన కారు
భారత కార్ల మార్కెట్లో ప్రస్తుతం సీఎన్జీ కార్ల(CNG Cars)కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగస్థులు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో టాటా మోటార్స్(tata motors) తన ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ(altroz icng) కారును ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకొచ్చి మార్కెట్లో కొత్త చర్చకు తెరలేపింది.
టాటా మోటార్స్ తాజాగా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ(altroz icng) ఏఎంటీ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.8.70 లక్షలుగా నిర్ణయించారు. ముఖ్యంగా రోజూ నగరాల్లో ట్రాఫిక్‌లో ఇబ్బంది పడే ఉద్యోగస్థులను టార్గెట్ చేస్తూ ఈ కారును తీసుకొచ్చినట్టు ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు సీఎన్‌జీ కార్లు(cng cars) అంటే మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రావడంతో డ్రైవింగ్ మరింత సులభంగా మారనుంది. క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండా సిటీ ట్రాఫిక్‌లో కూడా సౌకర్యంగా డ్రైవ్ చేయొచ్చు.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ(tata altroz icng) ఏఎంటీ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ఎస్, అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్లలో ఈ కారు లభించనుంది. టాప్ వేరియంట్ ధర రూ.10.77 లక్షల వరకు ఉంది.
ఈ సెగ్మెంట్‌లో సీఎన్‌జీతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందిస్తున్న తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్(altroz) నిలవడం విశేషం. మారుతి బాలెనో(maruti baleno), టయోటా గ్లాంజా(toyota glanza) వంటి ప్రత్యర్థి కార్లలో సీఎన్‌జీ ఆప్షన్ ఉన్నప్పటికీ.. అవి కేవలం లోయర్ వేరియంట్లకే పరిమితమయ్యాయి.

ఈ కారులో 1.2 లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను టాటా అందిస్తోంది. సీఎన్‌జీ మోడ్‌లో 73.5 హెచ్‌పీ పవర్, 103 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 88 హెచ్‌పీ పవర్ లభిస్తుంది.
ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, డైలీ ఆఫీస్ వెళ్లేవారు, క్యాబ్ వినియోగదారులు ఈ కారుపై ఆసక్తి చూపే అవకాశం కనిపిస్తోంది. తక్కువ రన్నింగ్ ఖర్చుతో పాటు ఆటోమేటిక్ సౌకర్యం ఉండటం దీని ప్రధాన ప్లస్ పాయింట్‌గా మారింది.
టాప్ వేరియంట్‌లో టాటా అదిరిపోయే ఫీచర్లను అందిస్తోంది. పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, అంబియంట్ లైటింగ్, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, కొత్తగా కారు కొనాలనుకునే ఫ్యామిలీలను ఈ కారు బాగా ఆకట్టుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సీఎన్‌జీ సిలిండర్లు బూట్‌లో అమర్చడం వల్ల బూట్ స్పేస్ కొంత తగ్గింది. సాధారణ పెట్రోల్ మోడల్‌లో 345 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా.. సీఎన్‌జీ మోడల్‌లో అది 210 లీటర్లకు తగ్గింది. అయితే టాటా ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల సామాను పెట్టుకునే స్థలం పూర్తిగా తగ్గిపోలేదని కంపెనీ చెబుతోంది.
భారతదేశంలో సీఎన్‌జీ కార్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు, రోజువారీ ప్రయాణ ఖర్చులు పెరుగుతుండటంతో ఇప్పుడు ఎక్కువ మంది సీఎన్‌జీ వాహనాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా తీసుకొచ్చిన ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ ఏఎంటీ మార్కెట్లో మంచి స్పందన తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications