100 మందిలో 62 మంది ఈ 2 కంపెనీల EV కార్లే కొంటున్నారు.. మార్కెట్లో 60%కు పైగా వాటా వీళ్లదే!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు భవిష్యత్ టెక్నాలజీగా భావించిన EVలు ఇప్పుడు సాధారణ వినియోగదారుల ఎంపికగా మారుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, పర్యావరణ హిత ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఎలక్ట్రిక్ కార్ల వైపు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవలి నెలల్లో EV మార్కెట్లో పోటీ కూడా గణనీయంగా పెరిగింది. కొత్త మోడళ్ల రాక, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, ఆధునిక ఫీచర్లు వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. ఫలితంగా, ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు కేవలం నగర ప్రయాణాలకే పరిమితం కాకుండా కుటుంబ అవసరాలకు కూడా అనువైన ఎంపికలుగా మారుతున్నాయి.
ఈ పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా మే 2026 నెల అమ్మకాల గణాంకాలు నిలిచాయి. గత నెలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు భారీగా పెరిగి 26,319 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 79 శాతం వృద్ధి. ఇంత భారీ పెరుగుదల భారత EV మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. అంతేకాకుండా, మే లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వాటాలో గణనీయమైన మార్పులు కనిపించాయి.

ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లతో మార్కెట్లో దూసుకురావడం, వినియోగదారులు కూడా సంప్రదాయ ఇంధన వాహనాల నుంచి EVల వైపు అడుగులు వేయడం వల్ల ఈ విభాగం కొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల యుగం మరింత వేగంగా విస్తరిస్తోంది. అమ్మకాలలో నమోదవుతున్న ఈ భారీ వృద్ధి, రాబోయే సంవత్సరాల్లో EVలు దేశ ఆటోమొబైల్ మార్కెట్లో మరింత కీలక పాత్ర పోషించబోతున్నాయనే సంకేతాలను ఇస్తోంది.
మే 2026 నాటికి భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఈ విభాగంలో దాదాపు ఏకపక్ష ఆధిపత్యం చెలాయించిన కంపెనీలు ఇప్పుడు కొత్త పోటీదారుల నుంచి గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్, మహీంద్రా తమ EV పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో మార్కెట్ వాటాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పుల్లో అతిపెద్ద లబ్ధిదారుగా టాటా మోటార్స్ నిలిచింది.

గత ఏడాది మే నెలలో 34.5 శాతంగా ఉన్న కంపెనీ మార్కెట్ వాటా, 2026 మే నాటికి 38.9 శాతానికి పెరిగింది. Nexon EV, Punch ఈవీ వంటి మోడళ్లతో టాటాకు బలం చేకూర్చింది. దేశీయ EV మార్కెట్లో తన అగ్రస్థానాన్ని కంపెనీ మరింత పటిష్టం చేసుకుంది. మహీంద్రా కూడా EVలో వేగంగా ఎదుగుతోంది. గత ఏడాది 19.6 శాతంగా ఉన్న మార్కెట్ వాటా ఇప్పుడు 23.3 శాతానికి చేరుకుంది.
మరోవైపు, గతంలో EV మార్కెట్లో బలమైన ఉనికిని కలిగి ఉన్న MG Motor పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. Windsor EV, Comet EV వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, మొత్తం మార్కెట్ పరిమాణం వేగంగా పెరగడం, ప్రత్యర్థుల దూకుడు కారణంగా కంపెనీ మార్కెట్ వాటా తగ్గింది. 2025 మేలో 31.2 శాతం వాటాను కలిగి ఉన్న MG, 2026 మే నాటికి 18.8 శాతానికి పడిపోయింది.

మే 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, టాటా మోటార్స్, మహీంద్రా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు కంపెనీల మార్కెట్ వాటాలను కలిపి చూస్తే, భారత EV మార్కెట్లో దాదాపు 62 శాతం వాటా వీటి చేతుల్లోనే ఉంది. అంటే దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 100 ఎలక్ట్రిక్ కార్లలో సుమారు 62 కార్లు టాటా లేదా మహీంద్రా బ్రాండ్‌కు చెందినవే అన్నమాట.
ముఖ్యంగా టాటా Nexon EV, Punch EV వంటి మోడళ్లతో భారీ కస్టమర్ బేస్‌ను సంపాదించగా, మహీంద్రా తన కొత్త తరం ఎలక్ట్రిక్ SUVలతో వేగంగా మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. ఫలితంగా ఈ రెండు కంపెనీలు ఇతర ప్రత్యర్థుల కంటే గణనీయమైన ఆధిక్యాన్ని సాధించాయి. మొత్తంగా చూస్తే, భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా చుట్టూనే తిరుగుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications