15 ఏళ్లు టెన్షన్ ఫ్రీ.. 502 కిమీ రేంజ్.. టాటా కర్వ్ EV కొత్త వేరియంట్లు లాంచ్
ఎలక్ట్రిక్ కార్ కొనాలంటే బ్యాటరీ భయం పెద్ద సమస్య... కానీ ఇప్పుడు టాటా దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్, తన కస్టమర్ల కోసం మరో అదిరిపోయే అప్డేట్ మోసుకొచ్చింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ అయిన కర్వ్ ఈవీ (Curvv.ev)లో సరికొత్తగా SeriesX శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఈ కొత్త సిరీస్‌లో భాగంగా Accomplished X 55, Empowered X 55 అనే రెండు వేరియంట్లను లాంచ్ చేసింది. కేవలం లాంచ్ చేయడమే కాకుండా, ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు ఉన్న అతిపెద్ద భయం బ్యాటరీ లైఫ్ విషయంలో కంపెనీ ఏకంగా 15 ఏళ్ల వారంటీ ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

టాటా మోటార్స్ తన కర్వ్ ఈవీ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ ఈ SeriesXను తెచ్చింది. ఇందులో Accomplished X 55 వేరియంట్ ధర రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది కంఫర్ట్, టెక్నాలజీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
ఇక మరింత ప్రీమియం అనుభవం కావాలనుకునే వారి కోసం Empowered X 55 వేరియంట్‌ను రూ.19.19 లక్షల ధరతో లాంచ్ చేశారు. వీటితో పాటు స్పెషల్ గా Dark Edition లవర్స్ కోసం Empowered X 55 లో డార్క్ ఎడిషన్ ను రూ.19.49 లక్షల వద్ద అందుబాటులోకి తెచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం, రేంజ్:
ఈ కొత్త వేరియంట్ల ప్రధాన ఆకర్షణ ఇందులోని 55 kWh బ్యాటరీ ప్యాక్. ఇది ARAI సర్టిఫైడ్ ప్రకారం ఏకంగా 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి మళ్ళీ వెనక్కి రావడానికి ఒక్క ఛార్జింగ్ దాదాపు సరిపోతుంది.
రియల్ వరల్డ్ కండిషన్స్ లో కూడా ఇది సుమారు 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ ధీమాగా చెబుతోంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 167 హార్స్‌పవర్, 215 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల కారు వేగం అందుకోవడంలో ఏమాత్రం వెనకాడదు.
15 ఏళ్ల వారంటీ
ఎలక్ట్రిక్ కారు అనగానే బ్యాటరీ ఎన్నాళ్లు వస్తుంది? పాడైతే లక్షల్లో ఖర్చవుతుందా? అనే అనుమానాలు అందరిలో ఉంటాయి. వీటన్నిటికీ సమాధానంగా టాటా మోటార్స్ ఈ కొత్త సిరీస్ పై 15 ఏళ్ల హై-వోల్టేజ్ బ్యాటరీ వారంటీని (మొదటి యజమానికి మాత్రమే) ప్రకటించింది.

భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక ఎలక్ట్రిక్ కారు బ్యాటరీకి ఇంత సుదీర్ఘకాలం వారంటీ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది కస్టమర్లలో ఈవీల పట్ల నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు.
ఫీచర్లు, లగ్జరీ
కారు లోపలి ఫీచర్లు విమానాన్ని తలపిస్తాయి. పనోరమిక్ సన్ రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు.
ఇక Empowered X 55 వేరియంట్ లో అయితే Level 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) తో పాటు 9-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా నైట్రో క్రిమ్సన్ అనే కలర్ ఆప్షన్ కూడా కస్టమర్లను ఊరిస్తోంది.
మున్ముందు మరిన్ని ఈవీలు
టాటా మోటార్స్ ఇక్కడితో ఆగడం లేదు. కర్వ్ ఈవీ తర్వాత కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న సఫారి ఈవీ (Safari EV) టెస్టింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. దీనిని రాబోయే పండుగ సీజన్ (Festive Season 2026) నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఇది టాటా నుంచి వస్తున్న మొట్టమొదటి 3-రో (త్రీ-రో) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది. ఇందులో కూడా పెద్ద బ్యాటరీ ప్యాక్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా తన ఆధిపత్యాన్ని మరింత గట్టిగా చాటుకుంటోంది.


Click it and Unblock the Notifications