మీల్స్ ధరకే ధమ్ బిర్యానీ దొరికినట్టు.. చిన్న కారు ధరలో పెద్ద ఎస్‌యూవీ..మరి మనోళ్లు వదులుతారా ?
భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలల కారుగా మారిన టాటా పంచ్ (Tata Punch) ఇప్పుడు మార్కెట్లో తిరుగులేని రారాజుగా నిలిచింది. 2026 మార్చి నెలలో విడుదలైన అమ్మకాల నివేదికలు చూస్తుంటే, ఇతర దిగ్గజ కంపెనీలకు చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మారుతి ఆల్టో లాంటి కార్లు ఏలుతున్న ధరల పరిధిలోకి టాటా పంచ్ తన మైక్రో ఎస్‌యూవీ ఫీచర్లతో దూసుకొచ్చి, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది.
అమ్మకాల్లో ఆరడుగుల బుల్లెట్
టాటా పంచ్ ఇప్పుడు కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 2026 మార్చి నెలలో ఈ కారు ఏకంగా 20,977 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో జరిగిన 17,714 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఇది 18.42 శాతం వృద్ధిని సాధించింది. భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్ల జాబితాలో టాటా పంచ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి స్థానంలో మారుతి డిజైర్ ఉండగా, ఎస్‌యూవీ విభాగంలో మాత్రం పంచ్‌కు సాటి మరేదీ లేదని నిరూపితమైంది.

ధర వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
చాలా మందికి టాటా పంచ్ ఎందుకు అంత ఇష్టమంటే, దీని ధర సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల రేంజ్‌లో ఉండటమే. టాటా పంచ్ పెట్రోల్ (ICE) వెర్షన్ ప్రారంభ ధర కేవలం రూ.5.64 లక్షలు మాత్రమే. మీరు గమనిస్తే, మారుతి సుజుకి ఆల్టో K10 టాప్ వేరియంట్ ధర దాదాపు రూ.5.45 లక్షలు ఉంటుంది. అంటే మరో 20 వేలు పెడితే, మీకు ఆల్టో కంటే పెద్దదైన, సేఫ్టీలో దుమ్ములేపే మైక్రో ఎస్‌యూవీ లభిస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ దగ్గరే టాటా మార్కెట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.
ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ ఎదురులేదు
ఇక పర్యావరణ ప్రేమికుల కోసం టాటా పంచ్ ఈవీ (EV) వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.9.69 లక్షలు కాగా, టాటా ప్రవేశపెట్టిన సరికొత్త BaaS (Battery As A Service) పద్ధతిని ఎంచుకుంటే దీని ధర కేవలం రూ.6.49 లక్షలకే తగ్గుతుంది. ఈ పద్ధతిలో కారును తక్కువ ధరకు కొని, కిలోమీటరుకు రూ.2.6 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 40 kWh బ్యాటరీ ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 468 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. సిటీ ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్స్ కు ఇది ఒక పర్ఫెక్ట్ ఈవీ అని చెప్పవచ్చు.

ఫీచర్ల ఖజానా..లగ్జరీ ప్రయాణం
టాటా పంచ్ లోపలికి వెళ్తే ఇది చిన్న కారు అనే భావన అస్సలు కలగదు. ఇందులో 26.03 సెంటీమీటర్ల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ కూడా అందించారు. సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ రాజీ పడదు.. అందుకే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ప్రామాణికంగా వస్తాయి.
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల మ్యాజిక్
ఈ భారీ అమ్మకాలకు కారణం టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ అని చెప్పాలి. 2026 జనవరిలో ఐసీఈ వెర్షన్, ఫిబ్రవరిలో ఈవీ వెర్షన్ సరికొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఆధునిక డిజైన్, మెరుగైన టెక్నాలజీతో ఉన్న ఈ కొత్త మోడల్స్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లకు టాటా పంచ్ గట్టి పోటీని ఇస్తూ, మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతోంది.


Click it and Unblock the Notifications








