ఇది కారు కాదు మావ.. రోడ్ల మీద తిరిగే అద్భుతం.. టాటా పంచ్ ఈవీ మ్యాజిక్.. ఇక లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీ
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఈవీని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20, 2026న ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అధికారికంగా లాంచ్ కానుంది. కేవలం డిజైన్ మార్పులే కాకుండా, బ్యాటరీ వారంటీ, రేంజ్, ఫీచర్ల పరంగా ఈసారి టాటా మోటార్స్ ఒక పెద్ద గేమ్ ఛేంజర్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈవీ ప్రియులను భయపెట్టే బ్యాటరీ ఖర్చు విషయంలో కంపెనీ లైఫ్ టైమ్ వారంటీ ప్రకటించడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు కొనేవారికి ఉండే అతిపెద్ద భయం బ్యాటరీ లైఫ్. కొన్ని ఏళ్ల తర్వాత బ్యాటరీ పాడైతే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చాలామంది వెనకడుగు వేస్తారు. అయితే, టాటా మోటార్స్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. కొత్త పంచ్ EV కోసం విడుదల చేసిన టీజర్‌లో లైఫ్‌టైమ్ కాన్ఫిడెన్స్ అష్యూర్డ్(Life-time confidence assured) అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించింది. దీని అర్థం కొత్త మోడల్‌లో 45 kWh బ్యాటరీ ప్యాక్‌పై లైఫ్ టైమ్ వారంటీ ఇచ్చే అవకాశం ఉంది.

సాధారణంగా టాటా తన ఈవీలపై మొదటి యజమానికి 15 ఏళ్ల వారంటీ లేదా అపరిమిత కిలోమీటర్ల భరోసా ఇస్తుంది. సెకండ్ ఓనర్ విషయానికి వస్తే ఇది 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్లకు తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా, లైఫ్ టైమ్ వారంటీ అనేది కస్టమర్లలో ఈవీల పట్ల నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పంచ్ EVలో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది 421 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అయితే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో నెక్సాన్ EVలో ఉండే పెద్ద 45 kWh బ్యాటరీ ప్యాక్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది 142 bhp పవర్‌ను, 215 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఈ కొత్త బ్యాటరీతో పంచ్ EV రేంజ్ దాదాపు 500 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు దాదాపుగా వెళ్లొచ్చన్నమాట. ఛార్జింగ్ స్పీడ్ కూడా 50 kW నుంచి 60 kW కి పెరిగే అవకాశం ఉంది, దీనివల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది.

కొత్త పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ డిజైన్ మరింత స్టైలిష్‌గా, క్లీన్‌గా ఉండబోతోంది. ముందు భాగంలో గ్రిల్ మరింత నీట్‌గా మార్చబడింది. పాత మోడల్‌లో హెడ్ ల్యాంప్స్ మధ్య ఉండే బ్లాక్ ట్రిమ్ పీస్, ఎల్‌ఈడీ లైట్ బార్‌ను తొలగించి, మరింత మినిమలిస్టిక్ లుక్ ఇచ్చారు. నెక్సాన్ EV నుంచి స్ఫూర్తి పొందిన కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ కూడా ఈ కారుకు మరింత అందాన్ని ఇస్తాయి. కొత్త రంగుల్లో కూడా ఈ కారు అందుబాటులోకి రానుంది.
ఫీచర్లు పెరిగినప్పటికీ, ధర విషయంలో టాటా మోటార్స్ సామాన్యులకు అందుబాటులోనే ఉండేలా ప్లాన్ చేస్తోంది. ప్రారంభ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్దే కొనసాగే అవకాశం ఉందని సమాచారం. టాటా పంచ్ EV నేరుగా టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3, రాబోయే హ్యుందాయ్ ఇన్స్టర్ EV లతో పోటీ పడనుంది.

తమిళనాడులోని కొత్త ప్లాంట్‌లో టాటా మోటార్స్ లగ్జరీ కార్ల తయారీని కూడా ప్రారంభించింది. దీంతో పాటు పంచ్ ఈవీ వంటి బడ్జెట్ ఈవీలను కూడా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 20న జరిగే లాంచ్ ఈవెంట్‌లో పూర్తి ఫీచర్లు, ధరలు వెల్లడవుతాయి.


Click it and Unblock the Notifications








