పాత పంచ్ వర్సెస్ కొత్త పంచ్ ఈవీ.. హైటెక్ ఫీచర్లు, 5-స్టార్ రేటింగ్.. రెండింటిలో ఏది మొనగాడు
టాటా మోటార్స్ ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఇప్పుడు కొత్త హంగులతో, అదిరిపోయే ఫీచర్లతో 2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) రూపంలో మన ముందుకు వచ్చింది. కేవలం లుక్ మాత్రమే కాదు, ఈసారి రేంజ్ విషయంలోనూ టాటా గట్టి దెబ్బే కొట్టింది. పాత మోడల్ కంటే ఏకంగా 103 కిలోమీటర్ల అదనపు రేంజ్ ఇస్తూనే, ధరను భారీగా తగ్గించి సామాన్యుడి ఎలక్ట్రిక్ కారు కలని నిజం చేస్తోంది. అసలు ఈ కొత్త పంచ్ ఈవీ పాత దానికంటే ఎందుకు మెరుగైనది? ఇందులో మారిన ఫీచర్లు ఏంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డిజైన్‌లో వచ్చిన కీలక మార్పులు
కొత్త పంచ్ ఈవీని చూడగానే ముందుగా మన కంటికి ఆకట్టుకునేది దాని ఫ్రంట్ డిజైన్. పాత మోడల్‌లో బంపర్ దగ్గర నల్లటి ప్లాస్టిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేవి, కానీ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో కారు బాడీ కలర్‌లోనే బంపర్ ఫినిషింగ్ ఇచ్చారు. దీనివల్ల కారు మరింత ప్రీమియం లుక్‌ను సంతతం చేసుకుంది. అలాగే ముందు భాగంలో కొత్తగా సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను జోడించారు, ఇది కారుకు ఒక షార్ప్, అగ్రెసివ్ ఎస్‌యూవీ లుక్ ఇస్తోంది.

పాత మోడల్‌లో గ్రిల్ మొత్తం కవర్ చేస్తూ ఎల్‌ఈడీ స్ట్రిప్ ఉండేది, కానీ ఇప్పుడు దాని స్థానంలో Y ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు వచ్చాయి. ఇక వెనుక భాగంలో కూడా మార్పులు జరిగాయి. పాత ట్రై-ఆరో టెయిల్ లాంప్స్ స్థానంలో ఇప్పుడు స్టైలిష్ హారిజంటల్ స్లాట్ లైట్లు వచ్చాయి. ఇది కారు వెడల్పుగా, రోడ్డుపై గంభీరంగా కనిపించేలా చేస్తోంది.
బ్యాటరీ, అన్‌స్టాపబుల్ రేంజ్
ఎలక్ట్రిక్ కారు అంటేనే అందరూ ముందుగా అడిగే ప్రశ్న ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? అని. ఈ విషయంలో టాటా కస్టమర్ల మనసు గెలుచుకుంది. పాత పంచ్ ఈవీలో 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉండేవి. ఇప్పుడు వాటిని అప్‌గ్రేడ్ చేసి 30 kWh, 40 kWh బ్యాటరీలను అందించారు. దీనివల్ల రేంజ్ అమాంతం పెరిగింది.
పాత బేస్ మోడల్ 315 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే, కొత్త 30 kWh మోడల్ 375 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అంటే ఏకంగా 110 కిలోమీటర్లు ఎక్కువ. ఇక టాప్ ఎండ్ 40 kWh మోడల్ అయితే ఏకంగా 468 కిలోమీటర్ల మైలేజీని (రేంజ్) ఇస్తుందని కంపెనీ చెబుతోంది. పాత 35 kWh మోడల్‌తో పోలిస్తే ఇది 103 కిలోమీటర్లు అదనం. ఇది లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి ఒక గొప్ప వరం అని చెప్పాలి.

పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్
బ్యాటరీ సైజు పెరిగితే కారు బరువు పెరుగుతుంది, దానివల్ల వేగం తగ్గుతుందేమో అని అనుమానం అక్కర్లేదు. టాటా మోటార్స్ ఇందులో కొత్త మోటార్‌ను ఉపయోగించింది. ఇది బరువును బ్యాలెన్స్ చేస్తూనే పవర్‌ను కూడా పెంచింది. బేస్ వేరియంట్ ఇప్పుడు 88 hp పవర్‌ను, లాంగ్ రేంజ్ వేరియంట్ 129 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.
పాత మోడల్‌లో ఇవి వరుసగా 81 hp, 122 hp మాత్రమే ఉండేవి. అయితే టార్క్ విషయంలో మాత్రం 35 Nm మేర తగ్గించారు. అయినప్పటికీ కారు వేగం అందుకోవడంలో కానీ, సిటీ ట్రాఫిక్‌లో దూసుకుపోవడంలో కానీ ఎక్కడా వెనకబడదు. ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉండటం వల్ల మన అవసరానికి తగ్గట్టుగా కారును నడుపుకోవచ్చు.
ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు
కారు లోపలికి వెళ్తే లగ్జరీ అనుభూతి కలుగుతుంది. డ్యూయల్ టోన్ లెదరెట్ సీట్లు కారుకు రిచ్ లుక్ ఇస్తున్నాయి. ఇందులో 10.25 ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాయిస్ కమాండ్ సిస్టమ్ ఇప్పుడు ఆరు భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది, అంటే మీరు మీకు నచ్చిన భాషలో కారు ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

దీనితో పాటు వెంటిలేటెడ్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని సుఖవంతం చేస్తాయి. కొత్త విండో స్విచ్‌లు మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో వచ్చే నేవిగేషన్ డిస్‌ప్లే డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.
సేఫ్టీలో మళ్ళీ 5-స్టార్ రేటింగ్
టాటా అంటేనే సేఫ్టీ.. పంచ్ ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ (ESP), ఏబీఎస్ (ABS) వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా ఉన్నాయి. వీటికి తోడు 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా 'హై బీమ్ అలర్ట్' అనే ఫీచర్‌ను చేర్చారు.
రాత్రిపూట నగర వీధుల్లో వెళ్తున్నప్పుడు మీరు హై బీమ్ లైట్లు వేస్తే, ఎదురుగా వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా లైట్లు డిమ్ చేయమని ఈ సిస్టమ్ మీకు గుర్తు చేస్తుంది. భారత్ NCAP లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం దాదాపు ఖాయం, కాబట్టి మీ కుటుంబంతో కలిసి నిశ్చింతగా ప్రయాణించవచ్చు.
అందరికీ అందుబాటులో ధర.. బాస్ ప్లాన్
సాధారణంగా ఫేస్‌లిఫ్ట్ మోడల్ వస్తే ధర పెరుగుతుంది. కానీ టాటా ఇక్కడ రివర్స్ గేర్ వేసింది. పాత పంచ్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుంచి ఉండగా, కొత్త మోడల్ కేవలం రూ. 9.69 లక్షలకే (ఎక్స్-షోరూమ్) అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ (BaaS) ప్లాన్ కింద ఈ కారును కేవలం రూ.6.49 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు.
అంటే పెట్రోల్ కారు కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు లభిస్తోంది. కేవలం వాడిన కిలోమీటర్లకు రూ. 2.6 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభదాయకమైన విషయం.


Click it and Unblock the Notifications








