రూ.5.59 లక్షల కారుకు దేశమంతా బ్రహ్మరథం.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన టాటా చౌక కారు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ (Sub-Compact SUV)ల మధ్య పోటీ రసవత్తరంగా మారిపోయింది. గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కార్లను వెనక్కి నెట్టి.. టాటా మోటార్స్ కి చెందిన చిన్న కారు సరికొత్త సంచలనం సృష్టించింది.
మధ్యతరగతి ప్రజల బడ్జెట్ ఎస్‌యూవీగా పేరొందిన టాటా పంచ్(Tata Punch) అమ్మకాల్లో మరోసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధర, ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటంతో కస్టమర్లు ఈ కారును కొనడానికి ఎగబడుతున్నారు. పోటీదారులైన మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి మోడళ్లు దీని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి.

ఏప్రిల్ నెల సేల్స్ లో టాటా పంచ్ సరికొత్త రికార్డు
ఇటీవల విడుదలైన దేశీయ ఆటోమొబైల్ విక్రయాల గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026 నెలలో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో టాటా పంచ్ (పెట్రోల్, ఈవీ కలిపి) ఏకంగా 19,107 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
గత ఏడాది ఇదే ఏప్రిల్ 2025 నెలలో ఈ కారు కేవలం 12,496 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే ఈసారి ఏకంగా 6,611 కార్స్ అదనంగా అమ్ముడై, ఏడాది ప్రాతిపదికన (YoY) 52.91 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ విభాగంలో మొత్తం మార్కెట్ వాటాలో 16.04 శాతాన్ని పంచ్ ఒక్కటే సొంతం చేసుకోవడం విశేషం.

రెండో స్థానంలో మారుతి ఫ్రాంక్స్.. మూడో స్థానంలో టాటా నెక్సాన్
ఈ అమ్మకాల రేసులో ఎవరూ ఊహించని విధంగా మారుతి సుజుకికి చెందిన స్టైలిష్ క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఏప్రిల్ నెలలో 18,829 యూనిట్లను విక్రయించి, టాటా పంచ్ కు గట్టి పోటీ ఇచ్చింది.
గత ఏడాది కంటే ఇది 31.26 శాతం వృద్ధి సాధించింది. అయితే, గత కొన్ని నెలలుగా మార్కెట్ టాపర్‌గా ఉన్న టాటా నెక్సాన్ (Tata Nexon) ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఏప్రిల్ లో నెగ్సాన్ 18,126 యూనిట్ల అమ్మకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ గత ఏడాది కంటే నెగ్సాన్ 17.27 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారీగా తగ్గిన మారుతి బ్రెజ్జా సేల్స్.. రేసులో వెనకబడ్డ మహీంద్రా, కియా
ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీల రాజుగా వెలిగిన మారుతి బ్రెజ్జా (Maruti Brezza) విక్రయాలు ఈసారి గణనీయంగా క్షీణించాయి. ఏప్రిల్ నెలలో బ్రెజ్జా కేవలం 14,124 యూనిట్లు మాత్రమే అమ్ముడై నాలుగో స్థానానికి పరిమితమైంది. గత ఏడాది విక్రయించిన 16,971 యూనిట్లతో పోలిస్తే ఇది మైనస్ 16.78 శాతం డిగ్రోత్‌ను చవిచూసింది.
ఇక ఐదు, ఆరు స్థానాల్లో హ్యుందాయ్ వెన్యూ 12,420 యూనిట్లు, కియా సోనెట్ 10,537 యూనిట్ల విక్రయాలతో నిలిచాయి. హ్యుందాయ్ వెన్యూ ఏకంగా 56.17 శాతం భారీ వృద్ధిని అందుకోగా, సోనెట్ 30.6 శాతం గ్రోత్ సాధించింది.

ఎక్స్టర్, ఎక్స్‌యూవీ 3XO ల పరిస్థితి ఏంటి?
ఈ లిస్టులో హ్యుందాయ్ కి చెందిన చిన్న ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్టర్ 8,096 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్థానంలో నిలిచింది. సరికొత్త లుక్ తో వచ్చిన మహీంద్రా XUV3XO (గతంలో XUV300) 7,517 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానాన్ని పొందింది.
ఆ తర్వాతి స్థానాల్లో కొత్తగా వచ్చిన స్కోడా కైలక్ 4,089 యూనిట్లు, టయోటా టైజర్ 2,550 యూనిట్లు, నిస్సాన్ మాగ్నైట్ 1,775 యూనిట్లు, రెనాల్ట్ కైగర్ 727 యూనిట్ల విక్రయాలను సాధించాయి. ఆఫ్‌రోడ్ ప్రియుల కారు మారుతి జిమ్నీ కేవలం 693 యూనిట్ల అమ్మకాలతో చాలా వెనుకబడిపోయింది. ఇక కియా సిరోస్ కేవలం 554 యూనిట్లతో చివరి స్థానంలో నిలిచింది.
మొత్తంగా పెరిగిన కార్ల కొనుగోళ్లు
దేశవ్యాప్తంగా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏప్రిల్ నెలలో ఈ సెగ్మెంట్ లోని టాప్-14 మోడళ్లన్నీ కలిపి మొత్తం 1,19,144 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ 2025 లో జరిగిన 1,02,845 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈసారి 15.85 శాతం మార్కెట్ పెరిగింది.
కస్టమర్లు ఇప్పుడు కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే, గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) టెస్టుల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని టాటా పంచ్ విజయం నిరూపించింది.


Click it and Unblock the Notifications