రూ.6 లక్షల లోపు SUVలో బెస్ట్ ఆప్షన్స్.. టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్‌టర్ కంపారిజన్
ఒకప్పుడు ఇంట్లో బైక్ ఉంటే చాలు అనుకునే రోజులు పోయి ఇప్పుడు కారు ఉండాలనే రోజులు వచ్చాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కాస్త మెరుగ్గా ఉండటంతో తమ కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి బస్సులు, రైళ్లు, ఆటోల కంటే కారు ఉంటే బెటర్ అని కారు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరలో దొరుకుతూ, మంచి పనితీరు, మైలేజ్, సేఫ్టీ అందించే కార్లను బాగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రూ. 6 లక్షల లోపు బడ్జెట్‌లో ఒక కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా పంచ్ (tata punch), హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ప్రస్తుతం హాట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. ఈ రెండు కార్ల బేస్ వేరియంట్లను పోలికలను ఈ కథనంలో చూద్దాం.
ధరల విషయానికి వస్తే, టాటా పంచ్ స్మార్ట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.59 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX వేరియంట్ ధర రూ. 5.64 లక్షలు. ఈ రెండింటి ధర వ్యత్యాసం రూ. 5,000. అయితే ఈ చిన్న తేడాలో కూడా పంచ్ కొంచెం చవకగా లభిస్తోంది. వీటి ఆన్-రోడ్ ధరలు రూ. 7 లక్షల లోపే ఉండటం మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెద్ద ప్లస్ పాయింట్.

ఫీచర్లను పరిశీలిస్తే, పంచ్ స్మార్ట్ వేరియంట్ ఇటీవల వచ్చిన అప్‌డేట్‌ల కారణంగా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. 6 ఎయిర్‌బ్యాగులు, స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి అవసరమైన ఫీచర్లతో పాటు, 10.61 అంగుళాల పెద్ద డిజిటల్ డ్రైవర్ ఇన్ఫో క్లస్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి అందిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో బేస్ వేరియంట్‌కే ఇన్ని ఫీచర్లు ఇవ్వడం పంచ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX వేరియంట్ ఫీచర్ల విషయంలో ఏమాత్రం తక్కువ కాదు. ఇందులో సెంట్రల్ లాకింగ్, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, LED టెయిల్ ల్యాంప్‌లు, డిజిటల్ డ్రైవర్ ఇన్ఫో క్లస్టర్ వంటి ప్రాథమికంగా అవసరమైన అంశాలు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కూడా స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అయితే, పంచ్‌కు తాజాగా వచ్చిన అప్‌డేట్‌ల కారణంగా కొన్ని అదనపు ఫీచర్లు ఎక్స్‌టర్ కంటే పంచ్‌లో కనిపిస్తున్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఎక్స్‌టర్‌లో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. ఇది 82 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. సిటీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. టాటా పంచ్‌లో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 85.4 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. శక్తి పరంగా పంచ్ కొంచెం ముందంజలో ఉంది.
ఇక అత్యంత ముఖ్యమైన అంశం అయిన భద్రత విషయానికి వస్తే, ఇక్కడ టాటా పంచ్ స్పష్టంగా ఒక అడుగు ముందుంది. కొత్త పంచ్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, ESC, TPMS వంటి అనేక ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం పంచ్‌కు పెద్ద బలం. టాటా కార్లకు ఉన్న బలమైన నిర్మాణ నాణ్యత కూడా కుటుంబాల దృష్టిలో విశ్వాసాన్ని పెంచుతుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా భద్రత విషయంలో బాగా ఫోకస్ చేసింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ESC, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్ & అన్‌లాక్, కీలెస్ ఎంట్రీ సహా మొత్తం 26 భద్రతా ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అయితే, ఎక్స్‌టర్ ఇంకా అధికారిక క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ను పొందలేదు. అందుకే మొత్తం భద్రతా అంశాలను కలిపి చూసినప్పుడు, పంచ్ కాస్త ముందుగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








