అదిరిపోయే డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, 500 కిమీ రేంజ్.. ఇండియన్ మార్కెట్లోకి టాప్-3 పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల (eSUV) విభాగం చాలా వేగంగా విస్తరిస్తోంది. పర్యావరణ హితంతో పాటు తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ప్రయాణించేందుకు కస్టమర్లు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను మరింతగా వాడుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన టాటా మోటార్స్, కియా ఇండియా, హోండా కార్స్ సరికొత్త ప్లాన్‌లతో ముందుకొచ్చాయి. రాబోయే కొద్ది నెలల వ్యవధిలోనే మన దేశీయ రోడ్లపై మూడు మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు సందడి చేయనున్నాయి.
మళ్లీ వస్తోంది లెజెండరీ టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)
టాటా కార్ల అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక మోడల్ 'టాటా సియెర్రా ఈవీ' ఈ నెలాఖరున అంటే జూన్ 30న అధికారికంగా లాంచ్ కాబోతోంది. దాదాపు 4.3 మీటర్ల పొడవుతో వచ్చే ఈ లగ్జరీ ఎస్‌యూవీ.. రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా BE6 కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ కారులో పనోరమిక్ రియర్ గ్లాస్ ఏరియా, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, క్లామ్‌షెల్ తరహా టెయిల్‌గేట్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 65kWh నుంచి 75kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను వాడే అవకాశం ఉంది. ఇది సింగిల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లతో లభించనుంది. దీని ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు.
మధ్యతరగతి బడ్జెట్‌లో కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)
భారతదేశంలో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేలా కియా కంపెనీ తన మొదటి అఫర్డబుల్ (తక్కువ ధర) మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారు కియా సైరోస్ ఈవీని సిద్ధం చేస్తోంది. ఆగస్టు 2026 లో లాంచ్ కానున్న ఈ కారు.. ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీలతో తలపడనుంది.

ఈ కారును కియా ప్రసిద్ధ K1 ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేశారు. ఇందులో 42 kWh, 49 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇవ్వనున్నారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వచ్చే ఈ సరికొత్త ఈవీ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) బడ్జెట్ పరిధిలో అందుబాటులోకి రానుంది.
500 కిలోమీటర్ల మైలేజ్‌తో హోండా జీరో ఆల్ఫా (Honda Zero Alpha)
ప్రముఖ జపనీస్ కార్ల సంస్థ హోండా.. సరికొత్త ఈవీ ఆర్కిటెక్చర్‌పై సరికొత్తగా డిజైన్ చేసిన జీరో ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కారు లుక్స్ పరంగా సరికొత్త విప్లవాన్ని సృష్టించబోతోంది. కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs), 19-ఇంచుల భారీ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో దీని ఎక్స్‌టీరియర్ చాలా యునిక్‌గా ఉంటుంది.

ఇందులో 65kWh, 75kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 500 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కారు లోపల ఫ్లాట్ ఫ్లోర్ కేబిన్, హెక్సాగోనల్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ.17 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications