భారీగా తగ్గనున్న టెస్లా కార్ల ధరలు..మస్క్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉంది. అయితే, తాజాగా ఎలన్ మస్క్ సారథ్యంలోని ఈ సంస్థ భారతీయ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే వార్తను మోసుకొచ్చింది. తన పాపులర్ మోడల్ అయిన టెస్లా మోడల్ Y(Tesla Model Y) ధరను ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
స్టాక్‌ను క్లియర్ చేయడంతో పాటు భారత మార్కెట్లో ఇతర లగ్జరీ కార్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో టెస్లా అంటే ఒక బ్రాండ్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. భారతదేశంలో టెస్లా కార్లు ఎప్పుడు వస్తాయా అని కొన్ని ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కల గత ఏడాది జూలైలో నెరవేరింది.

ఇండియాలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా, అప్పటి నుంచి అమ్మకాల్లో దూసుకుపోవాలని భావించింది. కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే సీన్ రివర్స్ అయింది. మన దేశంలోకి కార్లను డైరెక్ట్ ఇంపోర్ట్ (పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లు) చేసుకుని అమ్ముతుండటంతో, వీటిపై దిగుమతి సుంకాలు భారీగా ఉన్నాయి. దీనివల్ల కారు ధర సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయింది.
తాజా సమాచారం ప్రకారం..టెస్లా భారత్‌లోకి సుమారు 300 వాహనాలను దిగుమతి చేసుకుంది. అందులో ఇప్పటికీ 100 కార్ల వరకు అమ్ముడుపోకుండా షోరూమ్‌లలోనే మిగిలిపోయాయి. జనవరి 15, 2026 నాటికి అందిన వివరాల ప్రకారం, ఈ పాత స్టాక్‌ను త్వరగా వదిలించుకోవడానికి టెస్లా తన పాపులర్ మోడల్ వై లోని కొన్ని నిర్దిష్ట వేరియంట్లపై (ప్రధానంగా స్టాండర్డ్ రేంజ్ వేరియంట్) రూ.2 లక్షల వరకు తగ్గించింది.

కస్టమర్లను ఆకర్షించడానికి ఇదొక మంచి మార్గమని సంస్థ భావిస్తోంది. ప్రారంభంలో ఉన్న ఉత్సాహం బుకింగ్‌ల దగ్గరకు వచ్చేసరికి తగ్గడానికి ప్రధాన కారణం అధిక ధర మాత్రమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారతదేశంలో టెస్లా కార్లపై ఏకంగా 110 శాతం దిగుమతి సుంకం ఉంది. దీనివల్ల టెస్లా మోడల్ వై ధర ఎక్స్-షోరూమ్ సుమారు రూ.60 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు పలుకుతోంది. అదే ధరకు మన దేశంలో ఇతర లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు మెరుగైన సౌకర్యాలతో లభిస్తున్నాయి. ఉదాహరణకు, బిఎమ్‌డబ్ల్యూ (BMW iX1) కారు మన దేశంలోనే అసెంబుల్ అవుతుండటంతో దాని ధర టెస్లా కంటే తక్కువగా ఉండటమే కాకుండా ఫీచర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.

అలాగే చైనా దిగ్గజం బీవైడీ (BYD) కూడా సీలయన్ 7(Sealion 7) వంటి మోడళ్లతో టెస్లాకు చుక్కలు చూపిస్తోంది. గత ఏడాది (2025) గణాంకాలను చూస్తే.. బిఎమ్‌డబ్ల్యూ ఈవీ విక్రయాలు 200 శాతం పెరగగా, బీవైడీ 88 శాతం వృద్ధితో 5400 వాహనాలను అమ్మగలిగింది. కానీ టెస్లా మాత్రం కేవలం 227 యూనిట్లకు పరిమితమైంది.
భారతీయ కస్టమర్లు చాలా తెలివైనవారు. వారు బ్రాండ్ వాల్యూతో పాటు కారు ఇచ్చే విలువను (Value for Money) కూడా చూస్తారు. టెస్లా బ్రాండ్ క్రేజ్ ఉన్నప్పటికీ, సర్వీస్ సెంటర్లు తక్కువగా ఉండటం, ఇతర బ్రాండ్లు ఇచ్చే లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లు టెస్లా బేసిక్ మోడళ్లలో లేకపోవడం వల్ల చాలామంది వెనకడుగు వేస్తున్నారు.

కేవలం స్టేటస్ సింబల్ కోసం కొనేవారు తప్ప, ప్రాక్టికల్ యూసేజ్ కోసం కొనేవారు ఇతర బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక ఈవీ కార్లు అమ్మే సంస్థగా ఉన్న టెస్లా, ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా రెండో స్థానానికి పడిపోయింది.
టెస్లా గనుక ఇండియాలో తన ప్లాంట్‌ను స్థాపించి ఇక్కడే తయారీని ప్రారంభిస్తే, కార్ల ధరలు 30 నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు టెస్లాకు తిరుగుండదు. కానీ అప్పటివరకు ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్లతోనే నెట్టుకురావాల్సి ఉంటుంది. డ్రైవ్‌స్పార్క్ విశ్లేషణ ప్రకారం, టెస్లా బ్రాండ్ పై భారతీయులకు చాలా నమ్మకం ఉంది.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం ధరలు తగ్గించడమే కాకుండా, ఇక్కడి మౌలిక సదుపాయాలకు (ఛార్జింగ్ స్టేషన్లు వంటివి) అనుగుణంగా కార్లను మార్చడం, ధరలను పోటీకి తగ్గట్టుగా ఉంచడం చాలా అవసరం. ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ముంబై వంటి నగరాల్లోనే ఉన్న షోరూమ్స్, సూపర్ ఛార్జర్లను ఇతర నగరాలకు విస్తరించడం కూడా కంపెనీ ముందున్న పెద్ద సవాల్.


Click it and Unblock the Notifications








