ఈ కార్లలో వెళితే ప్రాణాలకు ఫుల్ గ్యారెంటీ..మీ ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలంటే వీటి పై ఓ లుక్కేయండి
ఒకప్పుడు కారు కొనుగోలు చేయాలంటే మైలేజీ, ధర మాత్రమే చూసేవారు కస్టమర్లు. కానీ ప్రస్తుతం కాలం మారింది. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యుడు కూడా తన కుటుంబ భద్రతకు పెద్ద పీట వేస్తున్నాడు. కారు చిన్నదైనా, పెద్దదైనా అది ఎంత స్ట్రాంగుగా ఉంది ? ప్రమాదం జరిగితే మన ప్రాణాలను కాపాడుతుందా ? అనే విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్.
ఈ క్రమంలోనే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం(BNCAP) క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ సాధించిన కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. బడ్జెట్ ధరలో లభిస్తూనే, అత్యుత్తమ భద్రను అందించే టాప్ 3 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

మన దేశంలోని రోడ్ల మీద ప్రయాణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోలేం. అందుకే వాహన తయారీ సంస్థలు కూడా ఇప్పుడు సేఫ్టీని ఒక బ్రాండ్ ఇమేజ్‌గా మార్చుకుంటున్నాయి. గతంలో కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, ఇప్పుడు రూ.6లక్షల బడ్జెట్ కార్లలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా టాటా, మహీంద్రా సంస్థలకు పోటీగా మారుతి సుజుకి కూడా తన సేఫ్టీ ప్రమాణాలను పెంచడం గొప్ప మార్పు అనే చెప్పాలి.
1. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch Facelift): ఈ జాబితాలో మొదటిది, అత్యంత ప్రజాదరణ పొందిన కారు టాటా పంచ్. మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో రారాజుగా వెలుగుతున్న పంచ్, భారత్ NCAP టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.59 లక్షలు. ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.
పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం ఇందులో టర్బో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. మైలేజీ విషయానికి వస్తే.. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20 కి.మీ, సీఎన్జీ వెర్షన్ కిలోకు 27 కిమీ వరకు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీతో పాటు 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి. చిన్న కారు అయినా, పెద్ద ఎస్యూవీ లాంటి స్టాన్స్ ఉండడంతో యూత్ దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

2. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire): మారుతి కార్లంటే కేవలం మైలేజ్ మాత్రమే ఉంటుంది సేఫ్టీ అస్సలు ఉండదు అనే విమర్శలకు కొత్త డిజైర్ గట్టిగా సమాధానం చెప్పింది. భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న తొలి మారుతి కారుగా డిజైర్ రికార్డు సృష్టించింది. దీని ప్రారంభ ధర రూ. 6.25 లక్షలు. ఇందులో కొత్తగా Z సిరీస్ ఇంజిన్‌ను వాడారు, ఇది అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.
పెట్రోల్ వెర్షన్ 25 కిమీ మైలేజీ ఇస్తుండగా, సీఎన్జీ వెర్షన్ ఏకంగా 33 కిమీ మైలేజీని ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది వరం. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు స్టాండర్డుగా వస్తున్నాయి. ఫ్యామిలీ సెడాన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

3. మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO): స్ట్రాండ్ బాడీ, అదిరిపోయే పవర్ కావాలనుకునే వారికి మహీంద్రా XUV 3XO సరైన ఛాయిస్. దీని ప్రారంభ ధర రూ.7.28 లక్షలు. ఇది కూడా భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
ముఖ్యంగా దీని డీజిల్ ఇంజిన్ ఇచ్చే టార్క్ (300 Nm) ఈ సెగ్మెంట్లో మరే కారు ఇవ్వలేదు. మైలేజీ కూడా 18 నుంచి 21 కి.మీ మధ్యలో ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో లెవల్-2 ADAS ఫీచర్లు ఉన్నాయి. అంటే కారు దానంతట అదే ప్రమాదాలను పసిగట్టి బ్రేకులు వేయడం లేదా డ్రైవర్‌ను అలర్ట్ చేయడం వంటివి చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
మొత్తానికి చూస్తే.. ప్రస్తుతం మార్కెట్లో సేఫ్టీకి కొదవ లేదు. పైన పేర్కొన్న మూడు కార్లు కూడా వేర్వేరు బడ్జెట్లలో, వేర్వేరు అవసరాలకు సరిపోయేలా ఉన్నాయి. మీకు చిన్న ఎస్యూవీ కావాలంటే పంచ్, మైలేజీ ముఖ్యం అనుకుంటే డిజైర్, పవర్, లగ్జరీ కావాలంటే XUV 3XO ని ఎంచుకోవచ్చు. ఏది కొన్నా, మీ కుటుంబ ప్రాణాలకు మాత్రం 5-స్టార్ భరోసా ఉంటుంది.


Click it and Unblock the Notifications








