కిలోకు ఏకంగా 27 కిమీ మైలేజ్.. పెద్ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం 3 బెస్ట్ 7-సీటర్ సిఎన్‌జీ కార్లు
మనదేశంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలలో సభ్యుల సంఖ్య 6 నుంచి 7 వరకు ఉంటుంది. అలాంటి కుటుంబాలకు సాధారణ 5-సీటర్ కార్లు ప్రయాణానికి సరిపోవు. ఇందుకోసం 7-సీటర్ కార్లు కొందామంటే బడ్జెట్, మైలేజ్ భారం పెరిగిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మార్కెట్లోకి ఫ్యాక్టరీ ఫిట్టెడ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన సిఎన్‌జీ కిట్లతో కూడిన 7-సీటర్ కార్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇవి ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండటమే కాకుండా.. జేబుకు చిల్లు పడకుండా బంపర్ మైలేజ్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-3 బడ్జెట్ ఫ్రెండ్లీ 7-సీటర్ సిఎన్‌జీ కార్ల గురించి తెలుసుకుందాం.
1. మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco)
మారుతి సుజుకి ఈకో భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ 7-సీటర్ కారు. దీని బేస్ పెట్రోల్ మోడల్ ప్రారంభ ధర కేవలం రూ.5.21 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా.. దీని సిఎన్‌జీ వేరియంట్ ధర రూ.6.36 లక్షలుగా ఉంది. దేశంలోనే అతి తక్కువ ధరలో దొరుకుతున్న ఏకైక 7-సీటర్ సిఎన్‌జీ కారు ఇదే కావడం విశేషం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ కారు ఒక అద్భుతమైన ఆప్షన్.

మారుతి ఈకో కారులో పవర్‌ఫుల్ కె-సిరీస్ 1.2-లీటర్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 80.76 PS పవర్‌ను, 104.5 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అదే సిఎన్‌జీ మోడ్‌కు మారినప్పుడు దీని పవర్ 71.65 PS, టార్క్ 95 Nm కి తగ్గుతుంది. మైలేజ్ విషయానికి వస్తే.. దీని కమర్షియల్ వేరియంట్ పెట్రోల్‌పై 20.2 కిమీ, సిఎన్‌జీపై ఏకంగా కిలోకు 27.05 కిమీ మైలేజీని ఇస్తుంది. అలాగే సాధారణ ప్యాసింజర్ వేరియంట్ పెట్రోల్ లో లీటరుకు 19.7 కిమీ, సిఎన్‌జీలో 26.78 కిమీ వరకు మైలేజ్ అందిస్తుంది.
కొత్త మారుతి ఈకోలో కంపెనీ సరికొత్త మార్పులను చేసింది. ఇందులో ఇప్పుడు మారుతి సెలెరియో, ఎస్-ప్రెస్సో కార్లలో ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త డిజైన్ స్టీరింగ్ వీల్‌ను అమర్చారు. పాతకాలపు స్లైడింగ్ ఏసీ కంట్రోల్స్ స్థానంలో ఆధునిక రోటరీ ఏసీ యూనిట్‌ను ఇచ్చారు. సేఫ్టీ కోసం ఈ కారులో ఏకంగా 11 సేఫ్టీ ఫీచర్లను చేర్చారు. ఇందులో ఏబీఎస్ విత్ ఈబీడీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంజిన్ ఇమ్మోబిలైజర్, చైల్డ్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

2. మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga)
భారతదేశంలో ఫ్యామిలీ కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మారుతి సుజుకి ఎర్టిగా. ఈ అఫార్డబుల్ ఎమ్‌పీవీ (MPV) ఎక్స్-షోరూమ్ ధరలు రూ.8.80 లక్షల నుంచి రూ.12.94 లక్షల మధ్య ఉన్నాయి. లుక్, స్పేస్ పరంగా ప్రీమియం అనుభూతిని ఇచ్చే ఈ కారులో కూడా కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జీ ఆప్షన్‌ను అందిస్తోంది.
ఎర్టిగా కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 103 PS పవర్‌ను, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు, పెట్రోల్ మోడల్ లీటరుకు 20.51 kmpl మైలేజీని ఇస్తుండగా.. దీని సిఎన్‌జీ వేరియంట్ కిలో సిఎన్‌జీకి 26.11 కిమీ భారీ మైలేజీని అందిస్తుంది. లాంగ్ జర్నీలలో ఎక్కువ మందితో ప్రయాణించేటప్పుడు కూడా ఈ కారు మైలేజ్ పరంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
మారుతి ఎర్టిగాలో అధునాతన 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో టెక్నాలజీతో వస్తుంది. దీని ద్వారా వాయిస్ కమాండ్, వెహికల్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, రిమోట్ ఫంక్షన్లను ఆపరేట్ చేయవచ్చు. అదనంగా ఇందులో 360-డిగ్రీ కెమెరా, ప్యాడల్ షిఫ్టర్లు, ఆటో హెడ్‌లైట్లు, ఆటో ఏసీ, క్రూజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఈ కారు మార్కెట్లో టయోటా రుమియన్, కియా కారెన్స్, మారుతి XL6 వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

3. నిస్సాన్ గ్రెవైట్ సిఎన్‌జీ (Nissan Gravite CNG)
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా (NMIPL) తమ సరికొత్త 7-సీటర్ కారు నిస్సాన్ గ్రావైట్ కోసం ప్రభుత్వం చేత ధృవీకరించబడిన సిఎన్‌జీ రెట్రోఫిట్‌మెంట్ కిట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారులో సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా స్మార్ట్ ట్విన్ సిలిండర్ టెక్నాలజీని పరిచయం చేశారు. దీనివల్ల కారు డిక్సీలో పెద్ద సిలిండర్ లేకుండా రెండు చిన్న సిలిండర్లు అడుగు భాగంలో అమర్చబడి ఉంటాయి. ఫలితంగా 7-సీటర్ స్పేస్, లగేజ్ బూట్ స్పేస్ ఏమాత్రం తగ్గకుండా కారు ఉపయోగం చాలా బాగుంటుంది.
ఈ సరికొత్త నిస్సాన్ గ్రావైట్ సిఎన్‌జీ కిట్‌ను ప్రస్తుతం దేశంలోని 16 ముఖ్యమైన రాష్ట్రాలలో అందుబాటులోకి తెచ్చారు. దీని ప్రారంభ ధర రూ.82,999 గా నిర్ణయించారు. అంటే కారు అసలు ఎక్స్-షోరూమ్ ధరకు ఈ మొత్తాన్ని అదనంగా చెల్లించి కస్టమర్లు అఫీషియల్ సిఎన్‌జీ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని కోరుకునే మధ్యతరగతి వినియోగదారుల కోసం నిస్సాన్ ఈ స్మార్ట్ సొల్యూషన్‌ను తీసుకువచ్చింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్టిఫై చేయబడిన ఈ సిఎన్‌జీ కిట్‌ను ప్రముఖ మోటోజెన్ సంస్థ అభివృద్ధి చేసి, నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసింది. నిస్సాన్ అధికారిక డీలర్ల ద్వారా కస్టమర్లు ఈ కిట్‌ను తమ కార్లలో చాలా సులభంగా ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చు. వినియోగదారుల నమ్మకం కోసం ఈ సిఎన్‌జీ కిట్ కాంపోనెంట్స్ పై థర్డ్-పార్టీ ప్రొవైడర్ ద్వారా 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు అద్భుతమైన వారంటీని కూడా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications