మార్కెట్లో మొదలైన అసలుసిసలు SUV వార్.. త్వరలో కొత్త కిరాక్ మోడల్స్ ఎంట్రీ
2026 ప్రారంభం భారత ఆటోమొబైల్ రంగానికి ఒక పండగలా మారింది. జనవరి మొదటి పదిహేను రోజుల్లోనే మహీంద్రా, టాటా వంటి దిగ్గజాలు తమ కొత్త మోడళ్లను రోడ్ల మీదకు తెచ్చాయి. మహీంద్రా XUV 7XO, XUV 3XO EVలు ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తుండగా, టాటా మోటార్స్ సఫారి, హారియర్ పెట్రోల్ వెర్షన్లతో పాటు పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా విడుదల చేసింది. అయితే అసలు సిసలైన పోటీ ఈ నెల చివరలో ఉండబోతోంది. మారుతి సుజుకి, టయోటా, రెనాల్ట్ కంపెనీలు తమ పవర్‌ఫుల్ SUVలను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి.
భారతీయ రోడ్లపై ప్రస్తుతం SUVల హవా నడుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల కంపెనీలు ఒకదానికొకటి పోటీగా సరికొత్త ఫీచర్లతో వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా జనవరి 2026 చివరి వారంలో విడుదల కాబోతున్న మూడు SUVలు మార్కెట్ సమీకరణాలను మార్చేయబోతున్నాయి.

1. మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e Vitara): మారుతి సుజుకి నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ఇదే. దీనిని జనవరి 17న అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 17 లక్షల నుండి రూ. 22.50 లక్షల వరకు ఉండవచ్చు.
ఇందులో 49kWh, 61.1kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, సెకండ్ లెవల్ ADAS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించడం విశేషం.

2. టయోటా అర్బన్ క్రూజర్ ఇవి (Toyota Urban Cruiser EV): టయోటా తన మొదటి ఎలక్ట్రిక్ SUVని జనవరి 19 లేదా 20వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ. 18 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ఉండవచ్చు.
ఇది మారుతి ఇ-విటారాకు రీబ్యాడ్జ్ వెర్షన్ అయినప్పటికీ, ఫ్రంట్ డిజైన్, గ్రిల్ విషయంలో టయోటా తనదైన స్టైల్‌ను జోడించింది. ఇది కూడా దాదాపు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇచ్చే బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. లగ్జరీ ఇంటీరియర్, హై-క్వాలిటీ సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

3. రెనాల్ట్ డస్టర్ 2026 (Renault Duster): ఒకప్పుడు ఇండియాలో SUV క్రేజ్‌ను మొదలుపెట్టిన డస్టర్ ఇప్పుడు కొత్త అవతారంలో మళ్లీ వస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీనిని ఆవిష్కరించనున్నారు. దీని ప్రారంభ ధర రూ. 12 లక్షల నుంచి ఉండవచ్చు.
ఇందులో 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇది సరికొత్త CMF-B ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతోంది. 4x4 డ్రైవ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆధునిక ఇంటీరియర్లతో ఇది హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








