సిటీ డ్రైవింగుకు పర్ఫెక్ట్.. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల (EVs) హవా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఈవీ కార్లు కేవలం ధనవంతులకే పరిమితం అనుకునే రోజులు పోయి.. ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కస్టమర్లు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం, బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు కంపెనీలు బడ్జెట్ ధరలోనే కార్లను లాంచ్ చేయడం ఇందుకు ముఖ్య కారణం. ప్రస్తుతం మన దేశంలో సామాన్యుడి బడ్జెట్‌కు అందుబాటులో ఉన్న టాప్-5 అతి తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాను, వాటి ప్రత్యేకతలను చూద్దాం.
1. టాటా టియాగో EV (Tata Tiago EV)
భారత్‌లో లభించే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ఈవీ మొదటి స్థానంలో నిలిచింది. నిజానికి కొద్ది నెలల క్రితం వరకు ఇది రెండో స్థానంలో ఉండేది, కానీ టాటా మోటార్స్ తన వ్యూహాత్మక నిర్ణయంతో దీని బేస్ వేరియంట్ ధరను ఏకంగా రూ.1 లక్ష వరకు తగ్గించి దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ కారుగా మార్చేసింది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.99 లక్షల వరకు ఉంది. ఈ కారు ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 285 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 75 హెచ్‌పీ పవర్, 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ మోటార్‌ను కలిగి ఉంది.

2. ఎంజీ కామెట్ EV (MG Comet EV)
గతంలో దేశంలోనే అత్యంత చౌకైన కారుగా పేరొంది, ప్రస్తుతం టియాగో ఈవీ రేట్ తగ్గడం వల్ల రెండో స్థానానికి చేరిన కారు ఎంజీ కామెట్ ఈవీ. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో ప్రయాణించే వారిని మనస్సులో ఉంచుకుని ఎంజీ మోటార్స్ ఈ చిరు బుజ్జి కారును డిజైన్ చేసింది. ఇది చూడటానికి చాలా చిన్నగా, కేవలం 3 డోర్లతో ఉన్నప్పటికీ లోపల నలుగురు వ్యక్తులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.63 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని మోటార్ 42 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
3. టాటా పంచ్ EV (Tata Punch EV)
మన దేశంలో తక్కువ ధరలో లభించే టాప్ 5 ఈవీలలో మూడు కార్లు టాటా కంపెనీవే కావడం విశేషం. అందులో రెండోది, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నది టాటా పంచ్ ఈవీ. ఈ ఏడాది ప్రారంభంలోనే టాటా మోటార్స్ ఈ మైక్రో ఎస్‌యూవీని సరికొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి తెచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.69 లక్షల నుంచి రూ.12.59 లక్షల వరకు ఉంది. ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ కారు ఒకే ఛార్జ్‌పై ఏకంగా 468 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. సిటీ దాటి లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారికి, ఎలాంటి రేంజ్ భయం లేకుండా ప్రయాణించడానికి 129 హెచ్‌పీ పవర్ గల ఈ పంచ్ ఈవీ బెస్ట్ ఆప్షన్.

4. సిట్రోయెన్ ఈసీ3 (Citroen eC3)
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ అయిన సిట్రోయెన్ నుంచి భారత మార్కెట్లో లభిస్తున్న ఏకైక, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు eC3. ఈ కారు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 320 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని మోటార్ 57 హెచ్‌పీ పవర్, 143 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. క్లాసిక్ లుక్, మంచి క్యాబిన్ స్పేస్ ఉన్న ఈ కారును కస్టమర్లు రూ.11.99 లక్షల నుంచి రూ.13.26 లక్షల ఎక్స్-షోరూమ్ ధరల వద్ద మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు.
5. టాటా టిగోర్ EV (Tata Tigor EV)
ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది టాటా కంపెనీకి చెందిన టిగోర్ ఈవీ. టాటా మోటార్స్ తన పాపులర్ పెట్రోల్ సెడాన్ కారు అయిన టిగోర్ మోడల్‌ను ఎలక్ట్రిక్ రూపంలోకి మార్చి దీనిని విక్రయిస్తోంది. భారత మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా రన్ అవుతూ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న బెస్ట్ ఈవీ కార్లలో ఇది ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.75 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 26 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 315 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వడంతో పాటు, 75 హెచ్‌పీ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎలక్ట్రిక్ కార్లలో వాడే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌ల తయారీ ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం వల్లే మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే ఈవీ కార్ల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫీచర్లు, మంచి రేంజ్ కలిగిన ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ.15 లక్షలకు పైమాటే ఉన్నాయి. అయినప్పటికీ, పైన పేర్కొన్న ఐదు కార్లు మాత్రం తక్కువ బడ్జెట్ లోనే కస్టమర్లకు ఇంధన ఖర్చులను ఆదా చేస్తూ.. అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications