బస్సులు, రైళ్లు అవసరం లేదు.. రెండు ఫ్యామిలీలకు సరిపోయే పర్ఫెక్ట్ కార్లు రాబోతున్నాయ్
ఒకే కారులో రెండు కుటుంబాలు.. లాంగ్ ట్రిప్స్‌కైనా టెన్షన్ లేదు.. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి భారీ సైజు 7 సీటర్ SUVల వరద రాబోతోంది.పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే అయితే కొద్ది రోజులు ఆగడం మంచిది. ఫార్చ్యూనర్ నుంచి స్కార్పియో వరకు కొత్త అవతారాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ కార్లు పెద్ద కుటుంబాల కలలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి.
భారత కార్ల మార్కెట్‌లో ఇప్పుడు 7 సీటర్ SUVలకు ఊహించని విధంగా భారీ డిమాండ్ కనిపిస్తోంది. పెద్ద కుటుంబాలు, లాంగ్ ట్రిప్స్, రఫ్ రోడ్లపై సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం చాలామంది SUVల వైపు మొగ్గు చూపుతున్నారు. పల్లెటూర్లలో కూడా 7 సీటర్ SUVలకు భారీ డిమాండ్ ఉంది. ఇదే సమయంలో మహీంద్రా, టయోటా, టాటా, నిస్సాన్, రెనాల్ట్ వంటి దిగ్గజ కంపెనీలు వచ్చే ఏడాదిలో భారీ ఫీచర్లతో కొత్త 7 సీటర్ SUVలను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.

కొత్త అవతారంలో టయోటా ఫార్చ్యూనర్
టయోటా కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్చ్యూనర్ మోడల్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త తరహాలో తీసుకురానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్టింగ్స్ ముగిశాయి. ప్రస్తుత మోడల్ కంటే ఇది మరింత శక్తివంతంగా, విలాసవంతంగా ఉండబోతోంది.
ముఖ్యంగా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, అధునాతన ఏసీ సిస్టమ్, డ్రైవర్ సేఫ్టీ కోసం మరిన్ని ఫీచర్లను జోడిస్తున్నారు. భారీ వీల్స్, కొత్త గ్రిల్‌తో దీని లుక్ మరింత మొరటుగా, ఆకర్షణీయంగా మారనుంది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న ఈ SUV ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. హైవే డ్రైవింగ్ ప్రేమికులకు ఇది మరో లెవల్ అనుభూతి ఇవ్వొచ్చని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.

స్కార్పియో సరికొత్తగా..
మహీంద్రా స్కార్పియో-N ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపిస్తోంది. కొత్త గ్రిల్, స్టైలిష్ LED లైట్లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశముంది. అంతేకాదు.. లెవల్-2 డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో స్కార్పియోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ కొత్త మోడల్ భారీ అమ్మకాలు సాధించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
తక్కువ ధరకే ప్రీమియం ఫీల్ ఇచ్చే నిస్సాన్ టెక్టాన్
నిస్సాన్ కూడా భారత మార్కెట్ కోసం కొత్త 7 సీటర్ SUVను సిద్ధం చేస్తోంది. టెక్టాన్ పేరుతో రానున్న ఈ SUVలో ప్రీమియం ఇంటీరియర్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేస్తూ కంపెనీ దీనిని తీసుకురావచ్చని సమాచారం.

7 సీటర్ రూపంలో రీఎంట్రీ ఇస్తున్న డస్టర్
రెనాల్ట్ కొత్త 7 సీటర్ SUVపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కొత్త డస్టర్ ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. బలమైన డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌తో ఈ SUV రానుందని ఆటో రంగంలో చర్చ నడుస్తోంది. పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ టెక్నాలజీ ఉండటం వల్ల మైలేజీ కూడా మెరుగ్గా ఉండే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మంచి ఆదరణ పొందే ఛాన్స్ కనిపిస్తోంది.
పెద్ద ఫ్యామిలీల కోసం టాటా సఫారి EV
టాటా మోటార్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా సఫారి EVను తీసుకురాబోతోంది. ఇది కంపెనీ తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్, లాంగ్ రేంజ్, ఆల్ వీల్ డ్రైవ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం హారియర్ EVపై ఉన్న అంచనాల మాదిరిగానే సఫారి EVపై కూడా భారీ ఆసక్తి కనిపిస్తోంది.

ప్రస్తుతం SUV కొనాలని ఆలోచిస్తున్నవారు కొద్దికాలం వేచి చూస్తే మరిన్ని కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫీచర్లు, సేఫ్టీ, టెక్నాలజీ విషయంలో వచ్చే ఏడాది మార్కెట్ పూర్తిగా మారిపోవచ్చని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications