నెల మొత్తం తిరిగినా ఖర్చు రూ.1000 దాటదు.. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ టాప్ CNG కార్లు ఇవే
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. బండి బయటకు తీయాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో అందరి చూపు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సీఎన్‌జీ (CNG) కార్ల వైపు మళ్లుతోంది. గతంలో సీఎన్‌జీ అంటే కేవలం చిన్న కార్లకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఎస్‌యూవీ (SUV) మోడళ్లలో కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్‌లను అందిస్తున్నాయి.
1. టాటా నెక్సాన్ సీఎన్‌జీ (Tata Nexon CNG):
దేశంలోనే అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా గుర్తింపు పొందిన టాటా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్లో రావడం విశేషం. సాధారణంగా సీఎన్‌జీ కార్లలో పవర్ తక్కువ ఉంటుందనే విమర్శ ఉంటుంది. కానీ నెక్సాన్ సీఎన్‌జీలో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ వాడారు. ఇది సీఎన్‌జీ మోడ్‌లో కూడా 100 హార్స్‌పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. అంటే ఘాట్ రోడ్లలో కూడా ఈ కారు అలవోకగా వెళ్తుంది.

టాటా తన వినూత్నమైన ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టింది. దీనివల్ల బూట్ స్పేస్‌లో రెండు చిన్న సిలిండర్లు అమర్చి, పైన లగేజీ పెట్టుకోవడానికి మంచి స్థలాన్ని కల్పించింది. స్మార్ట్ నుంచి ఫియర్‌లెస్ వరకు అనేక వేరియంట్లలో ఇది లభిస్తోంది. దీని ధర సుమారు రూ.8.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
2. టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG):
టాటా పంచ్ ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటి. ఇది మధ్యతరగతి ప్రజలకు ఒక వరమని చెప్పవచ్చు. పంచ్ సీఎన్‌జీలో కూడా ట్విన్-సిలిండర్ టెక్నాలజీని వాడారు. ఇందులో 1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది 74 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. దీని మైలేజీ లీటరుకు దాదాపు 26.99 కిలోమీటర్లు (ARAI) అని కంపెనీ చెబుతోంది.

పంచ్ కారులో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే, ఇది సీఎన్‌జీ విభాగంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఏకైక కారు. అడ్వెంచర్, అకంప్లిష్డ్ వంటి వేరియంట్లలో సన్‌రూఫ్ ఆప్షన్ కూడా లభిస్తోంది. సుమారు రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో ఇది మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభించే సీఎన్‌జీ ఎస్‌యూవీగా నిలిచింది.
3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ (Maruti Suzuki Fronx CNG):
మారుతి సుజుకి అంటేనే మైలేజీకి పెట్టింది పేరు. ఫ్రాంక్స్ కారు తన అదిరిపోయే లుక్, డిజైన్‌తో యువతను ఆకట్టుకుంటోంది. దీని సీఎన్‌జీ వేరియంట్ లో 1.2 లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 77.5 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఫ్రాంక్స్ సీఎన్‌జీ ప్రధాన ఆకర్షణ దీని మైలేజీ. కేజీ సీఎన్‌జీకి ఏకంగా 28.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

మారుతి తన సిగ్మా, డెల్టా వేరియంట్లలో సీఎన్‌జీ కిట్‌ను ఆఫర్ చేస్తోంది. లోపల మంచి ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, మారుతి సర్వీస్ నెట్‌వర్క్ ఉండటం వల్ల ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది. దీని ధర సుమారు రూ.8.41 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
4. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్‌జీ (Hyundai Exter CNG):
హ్యుందాయ్ నుంచి వచ్చిన అతి చిన్న ఎస్‌యూవీ ఎక్స్టర్. ఇందులో 1.2 లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది 69 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. ఎక్స్టర్ లో కూడా టాటా లాగానే డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు, దీనివల్ల డిక్కీలో స్పేస్ ఆదా అవుతుంది. కేజీకి దాదాపు 27.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఈ బడ్జెట్ ఎస్‌యూవీలో ఉండటం విశేషం. ఎక్స్టర్ సీఎన్‌జీ ధర సుమారు రూ. 8.24 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

5. టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ (Toyota Taisor CNG):
టయోటా టైసర్ కారు మారుతి ఫ్రాంక్స్ పై ఆధారపడి రూపొందించబడింది. టయోటా బ్రాండ్ వాల్యూ, సర్వీస్ కోరుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఇందులో కూడా ఫ్రాంక్స్ లాగే 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది, ఇది 28.51 కిమీ/కేజీ మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం టయోటా తన ఎంట్రీ లెవల్ E వేరియంట్ లో మాత్రమే సీఎన్‌జీని అందిస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రీమియం గా ఉంటుంది, టయోటా వారి 3 ఏళ్ల వారంటీ దీనికి అదనపు బలం. దీని ధర సుమారు రూ.8.71 లక్షల నుంచి మొదలవుతుంది.


Click it and Unblock the Notifications