నాలుగు నెలల్లో రెండోసారి.. ఇన్నోవాను మడతపెట్టిన హైరైడర్.. టయోటా ఇంట్లో సరికొత్త యుద్ధం
భారతదేశంలో టయోటా అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇన్నోవా. దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై రారాజులా వెలుగొందుతున్న ఇన్నోవాకు ఇప్పుడు సొంత ఇంటి నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. టయోటా నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, ఇన్నోవా సింహాసనాన్ని కదిలిస్తోంది. 2026 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలు చూస్తుంటే, టయోటా బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా హైరైడర్ నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. గడచిన నాలుగు నెలల్లో ఇన్నోవాను హైరైడర్ ఓడించడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఆటో పండిట్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత ఫిబ్రవరి నెలలో టయోటా మొత్తం 9,359 హైరైడర్ ఎస్‌యూవీలను విక్రయించింది. 2025 ఫిబ్రవరిలో ఇవి కేవలం 4,314 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది కాలంలో అమ్మకాలు ఏకంగా 117 శాతం పెరిగాయి. అదే సమయంలో, టయోటాగర్వకారణమైన ఇన్నోవా (హైక్రాస్, క్రిస్టా కలిపి) 8,703 యూనిట్ల విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. గతేడాది కంటే ఇన్నోవా అమ్మకాలు కేవలం 3 శాతం మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం టయోటా మొత్తం అమ్మకాల్లో 30 శాతం వాటా ఒక్క హైరైడర్‌దే కావడం దీని క్రేజ్‌ను తెలియజేస్తోంది.

హైరైడర్ ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దాని స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, ఒక లీటరుకు ఏకంగా 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించడం ఈ కారుకు ఉన్న అతిపెద్ద బలం. ఇది డీజిల్ కార్ల అవసరం లేకుండానే అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని కస్టమర్లకు అందిస్తోంది. కేవలం హైబ్రిడ్ మాత్రమే కాకుండా, సాధారణ పెట్రోల్, సిఎన్‌జి (CNG) వేరియంట్లలో కూడా ఇది లభిస్తోంది. అలాగే, ఆఫ్-రోడ్ ప్రియుల కోసం ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సౌకర్యం కూడా ఉండటం దీనికి అదనపు ఆకర్షణ.
విక్రయాలను మరింత పెంచడానికి టయోటా జనవరి నెలలో టెక్ ప్యాకేజ్‌ను ప్రవేశపెట్టింది. అదనంగా రూ.29,499 చెల్లిస్తే అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు, ప్రీమియం పరికరాలను ఈ ప్యాకేజీ ద్వారా పొందవచ్చు. ఈ వ్యూహాత్మక నిర్ణయం ఫిబ్రవరి అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపింది. ప్రస్తుతం మార్కెట్లో 13 వేరియంట్లలో లభిస్తున్న హైరైడర్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజ కార్లతో పోటీ పడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

అమ్మకాల్లో వెనుకబడినప్పటికీ, మొత్తం ఆర్థిక సంవత్సర గణాంకాల్లో ఇన్నోవా ఇంకా ముందంజలోనే ఉంది. ఏప్రిల్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో 1,02,030 ఇన్నోవా కార్లు అమ్ముడవ్వగా, హైరైడర్ 89,684 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే, మారుతున్న కస్టమర్ల అభిరుచుల వల్ల ఇన్నోవాలోని స్పేస్, లగ్జరీని ఇష్టపడే వారు కూడా, మైలేజ్, మోడరన్ ఎస్‌యూవీ లుక్ కోసం హైరైడర్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో హైరైడర్ తన ఆధిపత్యాన్ని ఇంకా పెంచుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








