లీటరు పెట్రోల్ తో 28 కిమీ..ఇన్నోవానే మించిన క్రేజ్.. ఈ కారు కోసం షోరూంలకు క్యూ కడుతున్న జనం
భారతీయ వాహన రంగంలో జపాన్ దిగ్గజం టయోటాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు టయోటా వాహనాలను చేరువ చేయడంలో మారుతి సుజుకితో ఉన్న భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. ఈ కలయికలో వచ్చిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) ఇప్పుడు దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.
కేవలం 40 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటి, కంపెనీలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. 2025 డిసంబర్ నాటికి దీని మొత్తం విక్రయాలు 2,03,312 యూనిట్లకు చేరుకున్నాయి. ఒకప్పుడు టయోటా అంటే ఇన్నొవా లేదా ఫార్చ్యూనర్ అనే పేరు ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది.

2025 అక్టోబర్ నెలలో హైరైడర్ ఏకంగా టయోటా ఐకానిక్ మోడల్ అయిన ఇన్నోవా విక్రయాలను కూడా అధిగమించింది. టయోటా మొత్తం విక్రయాల్లో హైరైడర్ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. 2023లో కేవలం 13 శాతంగా ఉన్న దీని వాటా, 2025 నాటికి 26 శాతానికి పెరగడం గమనార్హం. అంటే టయోటా విక్రయించే ప్రతి నాలుగు కార్లలో ఒకటి హైరైడర్ మోడలే అన్నమాట.
భారతీయులు కారు కొనేటప్పుడు మొదట అడిగే ప్రశ్న మైలేజీ ఎంత? అని. ఈ విషయంలో హైరైడర్ తిరుగులేని సమాధానం ఇచ్చింది. ఇందులో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల లీటరుకు 27.97 కిలోమీటర్ల (ARAI) మైలేజీ లభిస్తుంది. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కారు బ్యాటరీ పవర్‌పై నడుస్తుంది, తద్వారా పెట్రోల్ ఖర్చు భారీగా తగ్గుతుంది.

పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో ఇంత మైలేజీ ఇచ్చే ఎస్‌యూవీ ఉండటం సామాన్యులకు పెద్ద ఊరట. హైరైడర్ కేవలం మైలేజీకే పరిమితం కాలేదు. దీని లుక్స్ కూడా అదిరిపోతాయి. క్రిస్టల్ అక్రిలిక్ గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 17 అంగుళాల అలాయ్ వీల్స్ దీనికి ఒక ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. లోపల కంఫర్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.
దీనిలో పనోరమిక్ సన్‌రూఫ్ మీ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది. వెంటిలేటెడ్ సీట్లు వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తాయి. 360-డిగ్రీ కెమెరాతో పార్కింగ్ చేయడం చాలా సులభతరం అవుతుంది. బ్యాటరీపై కంపెనీ ఏకంగా 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది.

భారతదేశంలోనే కాదు, ఇక్కడి నుంచి తయారైన హైరైడర్ కార్లకు విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటివరకు దాదాపు 77,000 యూనిట్లను ఇండియా నుంచి ఎగుమతి చేశారు. మహారాష్ట్రలో తయారవుతున్న ఈ కారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటమే దీనికి కారణం. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజ కార్లకు హైరైడర్ గట్టి పోటీనిస్తోంది. పెట్రోల్, సిఎన్జీ, హైబ్రిడ్.. ఇలా మూడు రకాల ఆప్షన్లలో లభించడం ఈ కారుకు ఉన్న మరో పెద్ద ప్లస్ పాయింట్.
మొత్తానికి టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇండియాలో 2 లక్షల విక్రయాల మైలురాయిని దాటింది. 28 కిమీ మైలేజీ, ఇన్నొవాను మించిన సేల్స్ తో హైరైడర్ దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications








