బేస్ వేరియంట్లో కూడా లగ్జరీ కారులో ఉండే ఫీచర్లు..ఈ కారు కొనకపోతే చాలా మిస్ అవుతారు
టయోటా తన పాపులర్ ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్(Urban Cruiser Hyryder)లో సరికొత్త టెక్నాలజీని జోడించింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ వంటి కొత్త మోడళ్లకు చెక్ పెట్టేందుకు టయోటా ఒక అదిరిపోయే టెక్ ప్యాకేజీని లాంచ్ చేసింది. బేస్ వేరియంట్ కొన్నవారికి కూడా హై ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉండడం ఈ ప్యాకేజీ స్పెషాలిటీ.
భారతీయ రోడ్ల మీద టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మారుతి గ్రాండ్ విటారాకు తోబుట్టువుగా పిలవబడే ఈ కారు, మైలేజ్, పర్ఫామెన్స్ లో దూసుకుపోతుంది. తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఈ ఎస్యూవీ కోసం టెక్ ప్యాకేజీని ప్రవేశ పెట్టింది.

దీనివల్ల బేస్ వేరియంట్ కొనుగోలు చేసే వారు కూడా కేవలం రూ.29,499 అదనంగా చెల్లించి ప్రీమియం ఫీచర్లను తమ కారులో అమర్చుకోవచ్చు. సాధారణంగా టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే కనిపించే సౌకర్యాలను ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
ఈ కొత్త ప్యాకేజీలో ప్రధానంగా మూడు ఫీచర్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి.
హెడ్స్-అప్ డిస్‌ప్లే : ఇది డ్రైవర్‌కు ఎదురుగా ఉండే గ్లాస్ మీద స్పీడ్, నావిగేషన్ వంటి వివరాలను చూపిస్తుంది. దీనివల్ల డ్రైవర్ రోడ్డు మీద నుంచి చూపు తిప్పాల్సిన అవసరం ఉండదు.
డ్యాష్ క్యామ్: కారు ముందు వైపు ఏం జరుగుతుందో రికార్డ్ చేసేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సేఫ్టీ పరంగా ఇది చాలా ముఖ్యం.

ఆంబియంట్ లైటింగ్: కారు లోపల మూడ్‌ను బట్టి రంగులు మార్చుకునే లైటింగ్ సిస్టమ్ ఇది. వాస్తవానికి టాప్ మోడల్ అయిన V వేరియంట్‌లో ఇవి ఇప్పటికే ఉన్నాయి. కానీ ఇప్పుడు బేస్, మిడ్ వేరియంట్లు కొనేవారు కూడా వీటిని అదనంగా పొందవచ్చు.
ఈ టెక్ ప్యాకేజీని జోడించడం వల్ల హైరైడర్ ధరల్లో స్వల్ప మార్పులు వచ్చాయి. హైరైడర్ పెట్రోల్ మోడల్ ధరలు ఇప్పుడు రూ.11.24 లక్షల నుంచి రూ.20.05 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

సిఎన్‌జీ వెర్షన్ ధరలు రూ.13.62 లక్షల నుంచి రూ.15.58 లక్షల వరకు ఉండగా, ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లు రూ.18.58 లక్షల నుంచి రూ.18.7 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.29 వేలకే ఈ ఫీచర్లు రావడం వల్ల బేస్ వేరియంట్ కొనుగోలుదారులు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది.
టయోటా హైరైడర్ మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 102 bhp పవర్ ఇస్తుంది. ఇక టయోటా స్వయంగా డెవలప్ చేసిన 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఏకంగా 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
సిఎన్జీ మోడల్ కూడా కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి దిగ్గజాలతో పోటీ పడుతున్న హైరైడర్, ఈ కొత్త టెక్ ప్యాకేజీతో మరిన్ని అమ్మకాలను సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








