ఈ కార్లను మనసు పెట్టి తయారు చేస్తున్నట్లున్నారు.. అందుకే ఏకంగా 3 లక్షల కార్లు సేల్ అయ్యాయి
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో జపాన్ కార్ల దిగ్గజం టయోటా (Toyota) సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశీయ మార్కెట్లో టయోటాకు చెందిన హైబ్రిడ్ కార్ల (Hybrid Cars) మొత్తం విక్రయాలు ఏకంగా 3 లక్షల యూనిట్ల మైలురాయిని దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు కేవలం మైలేజ్ కోసం డీజిల్ కార్ల వైపు మాత్రమే మొగ్గు చూపిన భారతీయ కస్టమర్లు.. ఇప్పుడు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తూ, అత్యధిక మైలేజీని ఇచ్చే సరికొత్త గ్రీన్ టెక్నాలజీ కార్ల వైపు ఎంత వేగంగా మారుతున్నారో చెప్పడానికి టయోటా సాధించిన ఈ ఘనతే ఒక నిదర్శనం.
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో మధ్యతరగతి, ప్రీమియం శ్రేణి కార్ల కస్టమర్లు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. అయితే పూర్తి ఎలక్ట్రిక్ కార్లు (EV) కొందామంటే చార్జింగ్ మౌలిక వసతుల కొరత, లాంగ్ జర్నీలలో చార్జింగ్ అయిపోతుందనే భయం చాలా మందిని వెనక్కి లాగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే టయోటా తీసుకొచ్చిన హైబ్రిడ్ టెక్నాలజీ ఒక సంజీవనిలా పనిచేసింది.

ఎలక్ట్రిక్ కార్ల లాగా చార్జింగ్ పెట్టే తిప్పలు లేకపోవడం, పెట్రోల్ కార్ల కంటే రెట్టింపు మైలేజ్ రావడంతో కస్టమర్లు షోరూమ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ విజయంతో టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) సంస్థ భారతీయ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త లీడర్‌గా అవతరించింది. భారత మార్కెట్లో టయోటా కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా ప్రైవేట్ కార్ల నుంచి లగ్జరీ వెహికల్స్ వరకు ప్రతీ సెగ్మెంట్‌లోనూ హైబ్రిడ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
ఇందులో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను, యువతను ఆకట్టుకుంటున్న మోడల్ అర్బన్ క్రూజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder). మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోస్ట్ పాపులర్ ఎంపీవీ కార్ ఇనోవా హైక్రాస్ (Innova Hycross) కూడా హైబ్రిడ్ రూపంలో వచ్చి సంచలనాలు సృష్టిస్తోంది.

పెద్ద ఫ్యామిలీలు లాంగ్ ట్రిప్స్ వేయడానికి ఈ కారును ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు. ఇవే కాకుండా ప్రీమియం సెగ్మెంట్‌లో లగ్జరీ ఎగ్జిక్యూటివ్ సెడాన్ టయోటా కామ్రీ(Camry), అల్ట్రా-లగ్జరీ ఎలిట్ ఎంపీవీ టయోటా వెల్‌ఫైర్ (Vellfire) వంటి మోడళ్లు సెలబ్రిటీలు, బిజినెస్ లీడర్ల మనసులు దోచుకుంటున్నాయి.
టయోటా హైబ్రిడ్ కార్లు ఇంతగా క్లిక్ అవ్వడానికి, రికార్డు స్థాయిలో అమ్ముడవడానికి ప్రధాన కారణం వాటిలో ఉపయోగించిన సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ. సాధారణంగా చాలా మంది హైబ్రిడ్ అనగానే ఈవీ కార్ల లాగా ఎక్కడైనా చార్జింగ్ పాయింట్ వెతుక్కుని వైర్లు పెట్టి చార్జ్ చేయాలేమో అనుకుంటారు. దీనికి అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ స్మార్ట్ సిస్టమ్‌లో ఒక పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఒక హై-టెక్ ఎలక్ట్రిక్ మోటార్, ఒక అడ్వాన్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ కలిసి పనిచేస్తాయి.

మనం కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న ఇంటెలిజెంట్ కంప్యూటర్ సిస్టమ్ రోడ్డు పరిస్థితిని బట్టి కారు ఎప్పుడు పెట్రోల్ ఇంజిన్‌పై నడవాలి, ఎప్పుడు బ్యాటరీ పవర్‌పై నడవాలో ఆటోమేటిక్ గా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మనం ట్రాఫిక్‌లో తక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు కారు పెట్రోల్ ఇంజిన్‌ను పూర్తిగా ఆపేసి కేవలం బ్యాటరీ పవర్‌పైనే నడుస్తుంది. దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో పెట్రోల్ అస్సలు ఖర్చు అవ్వదు.
ఇక కారు వేగం పెరిగినప్పుడు పెట్రోల్ ఇంజిన్ ఆన్ అవుతుంది. అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే.. కారు బ్రేకులు వేసినప్పుడు లేదా నార్మల్‌గా వెళ్తున్నప్పుడు ఉత్పత్తయ్యే గతి శక్తిని వాడుకుని కారులోని బ్యాటరీ దానంతట అదే చార్జ్ అయిపోతుంది. అందుకే దీనికి బయట నుంచి చార్జింగ్ పెట్టే అవసరం అస్సలు ఉండదు.

గ్లోబల్ లెవెల్‌లో ఇప్పటివరకు ఏకంగా 19 కోట్ల టన్నుల కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా ఆపగలిగామని టయోటా గర్వంగా ప్రకటించింది. ఒక కారు విజయవంతం అవ్వాలంటే కేవలం ఫీచర్లు ఉంటే సరిపోదు, కస్టమర్లలో నమ్మకం కూడా కలగాలి. హైబ్రిడ్ కార్లు కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు పెద్ద అనుమానం ఉండేది.. పెద్ద బ్యాటరీ పాడైపోతే, దాన్ని మార్చడానికి లక్షల రూపాయలు కావాలి కదా అని. ఆ భయాన్ని టయోటా పోగొట్టింది.
తన హైబ్రిడ్ కార్ల నాణ్యతపై ఉన్న నమ్మకంతో టయోటా కంపెనీ ఈ కార్లలోని హైబ్రిడ్ బ్యాటరీపై ఏకంగా 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు అద్భుతమైన అఫీషియల్ వారంటీని అందిస్తోంది. ఈ సుదీర్ఘమైన వారంటీ భరోసా ఇవ్వడం వల్లే సామాన్య కస్టమర్లు సైతం ఎలాంటి భయం లేకుండా, పూర్తి నమ్మకంతో టయోటా హైబ్రిడ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications