ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది! ఇన్విక్టో, క్రిస్టా కంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అవుతుందా?
టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ (Toyota Innova Hycross facelift) అధికారిక వీడియో టీజర్లు వచ్చేశాయి. నవంబర్ 14, 15 తేదీల్లో వీటికి సంబంధించిన టీజర్లను విడుదల చేసిన కంపెనీ, భారత మార్కెట్లో ఈ కారును నవంబర్ 25న లాంచ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒకవేళ మీరు మారుతి ఇన్విక్టో (Maruti Invicto) లేదా ఇన్నోవా క్రిస్టా డీజెల్ (Innova Crysta diesel) కొనాలో లేక దీని కోసం ఆగాలా అని ఆలోచిస్తుంటే.. మీ నగరం, ఇంజిన్ ఆప్షన్, వాడకాన్ని బట్టి ఏది సరైనదో తేల్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ముందుగా ప్రస్తుత ఎక్స్‌షోరూమ్ ధరలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్ ధర దాదాపు ₹18.7 లక్షల నుంచి ₹31.8 లక్షల మధ్య ఉంది. మారుతి ఇన్విక్టో ధర వచ్చేసి ₹25.0 లక్షల నుంచి ₹28.7 లక్షల రేంజ్‌లో లభిస్తోంది. ఈ నెలలో ధరల పెంపు తర్వాత ఇన్నోవా క్రిస్టా డీజెల్ వేరియంట్లు ₹19.95 లక్షల నుంచి ₹26.96 లక్షల దాకా ఉన్నాయి. రాష్ట్రాల పన్నులను బట్టి ఆన్-రోడ్ ధరలు మారినప్పటికీ.. ఫేస్‌లిఫ్ట్ వర్షన్ రాకముందు మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడానికి ఈ రేట్లు ఒక స్పష్టతనిస్తాయి.

హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్: ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇవెందుకు కీలకం?
టొయోటా టీజర్లను గమనిస్తే.. కారు ముందు భాగం (నోస్), లైటింగ్, బంపర్ డిజైన్లలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేబిన్‌లోనూ కొన్ని చిన్న చిన్న అప్‌డేట్స్ ఉన్నాయి. కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించకపోయినా.. ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ పైలట్ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, TNGA-C మోనోకోక్ ప్లాట్‌ఫామ్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేఅవుట్, స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌లు యథావిధిగా కొనసాగుతాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో ఇన్ఫోటైన్‌మెంట్, ADAS ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
పవర్‌ట్రెయిన్: భారతీయ రహదారులకు స్ట్రాంగ్-హైబ్రిడ్ బెస్ట్ ప్లానా? క్రిస్టా డీజెల్ బెటరా?
సిటీ డ్రైవింగ్‌లో హైక్రాస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజ్ (ARAI సర్టిఫైడ్) ఇస్తుంది. అయితే కారు నిండుగా ఉండి, హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు మైలేజ్ వ్యత్యాసం కాస్త తగ్గుతుంది. క్రిస్టాలోని 2.4-లీటర్ డీజెల్ ఇంజిన్, రియర్-వీల్ డ్రైవ్ ఛాసిస్ హైవేలపై ప్రశాంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి (క్రిస్టా కేవలం మాన్యువల్‌లోనే లభిస్తుంది). మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో స్టేజ్-III GRAP నిబంధనల వల్ల పాత డీజెల్ కార్లపై ఆంక్షలు ఉంటాయి. పైగా 10 ఏళ్ల రిజిస్ట్రేషన్ గడువు కూడా డీజెల్ వాహనాలకే వర్తిస్తుంది కాబట్టి, హైబ్రిడ్ మోడల్స్ కొంటే ఇలాంటి టెన్షన్లు ఏమీ ఉండవు.
స్పేస్, కంఫర్ట్.. రోజువారీ వాడకానికి ఏది అనుకూలం?
హైక్రాస్‌లో పవర్డ్ ఒట్టోమన్ కెప్టెన్ సీట్లు, ఫ్లాట్ ఫ్లోరింగ్, మూడో వరస సీట్లలోకి సులభంగా వెళ్లే సదుపాయం ఉన్నాయి. మారుతి ఇన్విక్టో కూడా దాదాపు ఇలాంటి కేబిన్‌నే కలిగి ఉన్నప్పటికీ.. ఇందులో టొయోటా ఇచ్చే ADAS సేఫ్టీ ఫీచర్లు ఉండవు. సీట్లన్నీ నిటారుగా ఉన్నప్పుడు హైక్రాస్ బూట్ స్పేస్ 289 లీటర్లుగా ఉంటుంది, ఇది సాధారణ బ్యాగులకు సరిపోతుంది. క్రిస్టాలో ఇది దాదాపు 300 లీటర్ల వరకు ఉంటుంది. రైడింగ్ విషయానికొస్తే.. సిటీ రోడ్లపై హైక్రాస్ చాలా స్మూత్‌గా సాగుతుంది, అదే గుంతలున్న కఠినమైన రోడ్లపై, భారీ లోడ్‌తో వెళ్లడానికి క్రిస్టా బాగా కలిసివస్తుంది.
ధరలు, వెయిటింగ్ పీరియడ్.. బుకింగ్ అమౌంట్ వివరాలు
డీలర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, త్వరగా డెలివరీ కావాలనుకునే వారికి ఇన్విక్టో మంచి ఆప్షన్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో హైక్రాస్ కావాలంటే దాదాపు 3 నుంచి 4 నెలలు వేచి చూడాలి, పుణేలో ఈ నిరీక్షణ సమయం మరింత ఎక్కువ. ఇన్విక్టో అయితే నెల రోజుల్లోపే డెలివరీ అవుతోంది, హైదరాబాద్, బెంగళూరులలో ఇంకా త్వరగానే ఇస్తున్నారు. క్రిస్టా సగటున ఒక నెల రోజుల్లో లభిస్తుండగా, ఢిల్లీలో 3 నెలల వరకు సమయం పడుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ లేదా షోరూమ్ బుకింగ్ టోకెన్ అమౌంట్ వచ్చేసి టొయోటా వాహనాలకు ₹50,000 కాగా, ఇన్విక్టోకు ₹25,000గా ఉంది.
| మోడల్ | ఎక్స్‌షోరూమ్ ధర (లక్షల్లో ₹) | మెట్రో నగరాల్లో ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ |
|---|---|---|
| టొయోటా ఇన్నోవా హైక్రాస్ | 18.7–31.8 | ఢిల్లీ/ముంబై/బెంగళూరు/హైదరాబాద్‌లలో 3–4 నెలలు |
| మారుతి సుజుకి ఇన్విక్టో | 25.0–28.7 | హైదరాబాద్: 1.5–2 వారాలు; బెంగళూరు: 2–3 వారాలు; ఢిల్లీ/ముంబై: 1 నెల వరకు |
| టొయోటా ఇన్నోవా క్రిస్టా డీజెల్ | 19.95–26.96 | సాధారణంగా 1 నెల; ఢిల్లీలో 3 నెలల వరకు |
ఎవరు ఏ కారు బుక్ చేసుకోవాలి?
మంచి మైలేజ్, ప్రశాంతమైన సైలెంట్ క్యాబిన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని కోరుకునే సిటీ ఫ్యామిలీలకు ఇన్నోవా హైక్రాస్ పర్ఫెక్ట్ ఛాయిస్. ADAS ఫీచర్లు కావాలనుకుంటేనే ZX(O) వేరియంట్ వైపు వెళ్లొచ్చు. ఇక లాంగ్ డ్రైవ్‌లు, ట్రావెల్స్ వ్యాపారం, కొండ ప్రాంతాల్లో తిరిగేవారికి క్రిస్టాలోని టాప్-నాచ్ టార్క్, గట్టితనం బాగా ఉపయోగపడతాయి (మాన్యువల్ గేర్‌బాక్స్ ఓకే అనుకుంటే). లాంగ్ వెయిటింగ్ పీరియడ్ భరించలేక, త్వరగా కారు కావాలనుకునే వారు ADAS ఫీచర్లు, టొయోటా బ్యాడ్జింగ్ విషయంలో రాజీపడి మారుతి ఇన్విక్టోను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications
