లీటరుకు 20 కిమీ మైలేజ్..అదిరిపోయే స్పేస్..మారుతి ఎర్టిగా పని అయిపోయినట్లేనా ?
భారతదేశంలో పెద్ద ఫ్యామిలీలకు ఎప్పుడూ మొదటి ఛాయిస్ 7-సీటర్ కార్లే. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో తక్కువ ధరకు వచ్చే ఎంబీవీ (MPV) కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు మారుతి సుజుకి ఎర్టిగా తిరుగులేని మహారాజుగా వెలుగొందుతోంది. అయితే, ఇప్పుడు ఎర్టిగా సామ్రాజ్యాన్ని గడగడలాడించడానికి టయోటా తన అమ్ములపొది నుంచి ఒక పవర్‌ఫుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. అదే టయోటా రూమియన్ (Toyota Rumion). ఈ కారులో తాజాగా అత్యంత తక్కువ ధరకే లభించే E (ఈ) వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లు చూస్తుంటే, ఇకపై మారుతి కార్ల వైపు ఎవరూ చూడరేమో అనిపిస్తోంది.
ధర వింటే షాక్ అవ్వాల్సిందే
టయోటాకిర్లోస్కర్ మోటార్ తన రూమియన్ మోడల్‌లో ఈ కొత్త బేస్ వేరియంట్‌ను కేవలం రూ.9.55 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. అంతకుముందు వరకు S వేరియంట్ తక్కువ ధరలో ఉండేది, కానీ ఇప్పుడు దానికంటే తక్కువ ధరకే E వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చి టయోటా పెద్ద సంచలనమే సృష్టించింది. దీనివల్ల ఇప్పుడు రూమియన్ లైనప్‌లో E, S, G, V అనే నాలుగు వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో టయోటా బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

అదే పవర్.. అదే నమ్మకం!
ధర తగ్గించినప్పటికీ, కారు పవర్ విషయంలో టయోటా ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. ఇది 103 పీఎస్ (PS) శక్తిని, 139 ఎన్ఎమ్ (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. మైలేజీ విషయంలోనూ ఈ కారు అదరగొడుతోంది. లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ బేస్ వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదా సీఎన్‌జీ (CNG) ఆప్షన్ అందుబాటులో లేవని గమనించాలి.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
బేస్ వేరియంట్ అయినప్పటికీ, బయట నుంచి చూస్తే ఈ కారు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ముందు భాగంలో క్రోమ్ గ్రిల్, వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, హాలోజన్ హెడ్ ల్యాంప్స్ దీనికి అందాన్ని ఇస్తున్నాయి. చక్రాల విషయానికి వస్తే, 15-అంగుళాల స్టీల్ వీల్స్‌కు వెండి రంగు మూతలను ఇచ్చారు. లోపల క్యాబిన్ విషయానికి వస్తే, బీజ్ మరియు బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో కారు చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ధర తగ్గించడం కోసం ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తొలగించారు, కానీ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌ను కొనసాగించారు. ఏసీ కంట్రోల్స్ బటన్ల ద్వారా నియంత్రించుకునేలా ఇచ్చారు.

కుటుంబ ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్
ఈ కారులో ఏడుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. సీట్ల అమరిక విషయంలో టయోటా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రెండో వరుస సీట్లను 60:40 నిష్పత్తిలో విడదీయవచ్చు. అలాగే, ఒక్క టచ్‌తో సీట్లను వాల్చుకునే వెసులుబాటు ఉంది. క్యాబిన్ లోపల మూడు వరుసలలో ప్రయాణించే వారందరికీ అడ్జస్ట్ చేసుకోదగ్గ హెడ్‌రెస్ట్‌లు ఇచ్చారు. ముందు వరుసలో 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, స్మార్ట్‌ఫోన్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన స్టోరేజ్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ కారును తీర్చిదిద్దారు.
భారతదేశంలో పెద్ద ఎస్‌యూవీ లేదా ఎంబీవీ కార్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు మారుతి ఎర్టిగా ఈ రేసులో ముందున్నా, ఇప్పుడు టయోటా రూమియన్ E వేరియంట్ దానికి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. టయోటా ఇచ్చే సర్వీస్ క్వాలిటీ, కారు మన్నిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం రూ.9.55 లక్షలకే 7-సీటర్ టయోటా కారు రావడం అనేది ఒక అద్భుతమే. ఇది ఖచ్చితంగా మార్కెట్ సమీకరణాలను మారుస్తుంది.


Click it and Unblock the Notifications








