ఇన్నోవా హైక్రాస్లో చీపెస్ట్ వేరియంట్.. మధ్యతరగతి వారికి అందుబాటులోకి రానున్న హైబ్రిడ్ మోడల్
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) కార్లకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకమైన ఇంజన్ పవర్, అద్భుతమైన రీసేల్ వాల్యూ కారణంగా టయోటా బండ్లకు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. మీరు కూడా టయోటా కంపెనీకి చెందిన సరికొత్త ఎస్‌యూవీ (SUV) లేదా ఎమ్‌పీవీ (MPV) కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీకోసం కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది.
ఇండియన్ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు టయోటా త్వరలోనే మూడు పవర్‌ఫుల్ మోడళ్లను రంగంలోకి దించబోతోంది. ఇందులో మోస్ట్ పాపులర్ ఇన్నోవా హైక్రాస్ చౌకైన వేరియంట్‌తో పాటు, నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్, సరికొత్త హైలక్స్ కార్లు ఉన్నాయి.

అందుబాటు ధరలో టయోటా ఇన్నోవా హైక్రాస్
లీక్ అయిన నివేదికల ప్రకారం.. టయోటా కంపెనీ ప్రస్తుతం తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఎమ్‌పీవీ అయిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) మరింత చౌకైన, అఫోర్డబుల్ హైబ్రిడ్ వెర్షన్‌ను తయారు చేసే పనిలో బిజీగా ఉంది. దేశంలో కఠినంగా మారుతున్న ఎమిషన్ నిబంధనల కారణంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డీజిల్ ఇంజన్ ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) మోడల్‌ను మార్చి 2027 నాటికి కంపెనీ పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.
దాని స్థానాన్ని భర్తీ చేయడం కోసమే ఈ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ హైక్రాస్ మోడల్‌ను కంపెనీ తీసుకురాబోతోంది. దీనిని ముఖ్యంగా ట్రావెల్ బిజినెస్ చేసే ఫ్లీట్ ఆపరేటర్లు, తక్కువ బడ్జెట్ లో పెద్ద ఫ్యామిలీ కార్ కావాలనుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.
పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజన్, ధర వివరాలు
ఈ సరికొత్త బడ్జెట్ ఇన్నోవా హైక్రాస్ మోడల్‌లో ప్రస్తుత వెర్షన్ లో ఉన్న 2.0 లీటర్ల స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 182 హార్స్‌పవర్ పవర్ ను ఉత్పత్తి చేయడమే కాకుండా, లీటరుకు భారీ మైలేజ్ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది.
ఈ కొత్త వేరియంట్‌లో పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా జోడించే యోచనలో టయోటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారును 2027 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉండగా, దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 24 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

నెక్స్ట్ జనరేషన్ టయోటా హైలక్స్ (Toyota Hilux)
ఆఫ్-రోడింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 9వ జనరేషన్ టయోటా హైలక్స్ పికప్ ఎస్‌యూవీ త్వరలోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ మోడల్.. మునుపటి కంటే చాలా షార్ప్, బోల్డ్, అగ్రెసివ్ లుక్‌తో అలరిస్తోంది.
ఇండియన్ వెర్షన్ లో 2.8 లీటర్ల పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్‌తో పాటు కొత్తగా 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను కంపెనీ జోడించబోతోంది. దీని కేబిన్ లోపల లగ్జరీ ఫీచర్లకు కొదవ లేదు. ఇందులో డ్యుయల్ 12.3 ఇంచుల పెద్ద స్క్రీన్లు, అడ్వాన్స్‌డ్ అదాస్ (ADAS) లెవెల్-2 సేఫ్టీ ఫీచర్లు, అధునాతన ఆఫ్-రోడ్ టెక్నాలజీని అందించనున్నారు. దీని ధర రూ.32 లక్షల నుండి రూ. 45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది.
సరికొత్త లుక్‌తో రాబోతున్న టయోటా ఫార్చ్యూనర్
భారతదేశంలో స్టేటస్ సింబల్‌గా మారిన 7-సీటర్ లగ్జరీ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) సరికొత్త నెక్స్ట్ జనరేషన్ అవతారంలో రాబోతోంది. ఇటీవల కాలంలో ఈ కారుకు సంబంధించిన పలు టెస్టింగ్ మోడళ్లు రోడ్లపై కనిపించాయి.
కొత్త ఫార్చ్యూనర్ డిజైన్ చాలా వరకు కొత్త హైలక్స్ ఎస్‌యూవీ నుంచి ప్రేరణ పొంది రూపొందిస్తున్నారు. ఇందులో స్లిమ్ గా ఉండే సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, భారీ ఫ్రంట్ గ్రిల్, సరికొత్త బంపర్ డిజైన్ కారుకు అదిరిపోయే రూపాన్ని ఇస్తాయి. అలాగే కారు ఇంటీరియర్ లో 12.3 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి మోడరన్ ఫీచర్లను జోడించబోతున్నారు.
ఫార్చ్యూనర్ ఇంజన్ పవర్, లాంచ్ టైమ్‌లైన్
కొత్త జనరేషన్ ఫార్చ్యూనర్ ఇంజన్ విషయానికి వస్తే టయోటా పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఇందులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నమ్మకమైన 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజన్లనే కొనసాగించనున్నారు. అయితే డీజిల్ వేరియంట్ లో మైలేజ్, పికప్ పెంచడం కోసం 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ సపోర్ట్‌ను కూడా ఇవ్వనున్నారు.
నివేదికల ప్రకారం.. ఈ నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ కారు ఈ 2026 సంవత్సరం చివరలో అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనుండగా.. భారత మార్కెట్లో 2026 ఎండింగ్ లేదా 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 38 లక్షల నుంచి మొదలై టాప్ ఎండ్ మోడల్ రూ.60 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications