టయోటా తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్.. ఒక్క ఛార్జ్‌తో 543 కి.మీ రేంజ్.. రూ.25 వేలతో బుకింగ్
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota), భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. భారతదేశం కోసం తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారుగా టయోటా తీసుకువచ్చిన మోడల్ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella). ఈ ఎలక్ట్రిక్ SUV వాస్తవానికి మారుతి సుజుకి ఈ-విటారా (e Vitara)కు రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా ఉండటం గమనార్హం. మారుతితో ఉన్న గ్లోబల్ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, టయోటా ఈ కొత్త EVని ఇండియన్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిచయం చేసింది. కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV రెండు LFP (లిథియం ఫెరో ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి 49 kWh బ్యాటరీ, మరొకటి 61 kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండు వేరియంట్లలోనూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.
చిన్న బ్యాటరీ వేరియంట్ 142 bhp పవర్, 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ 172 bhp పవర్, అదే 189 Nm టార్క్‌ను అందిస్తుంది. దీంతో నగర ప్రయాణాలతో పాటు హైవే డ్రైవ్‌లకు కూడా ఈ EV సరిపడే పనితీరును అందిస్తుందని టయోటా చెబుతోంది. రేంజ్ విషయానికి వస్తే, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

ఈ రేంజ్ భారత EV మార్కెట్‌లో ఇది ఒక బలమైన పోటీదారుగా నిలవడానికి సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రేంజ్ ఆందోళన (range anxiety) ఉన్న వినియోగదారులకు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. ఇక బుకింగ్ వివరాల విషయానికి వస్తే, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా డిజైన్ పరంగా మొదటి చూపులోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంది. ముందుభాగంలో ఇచ్చిన సొగసైన, సెగ్మెంటెడ్ LED DRLలు, వాటికి జత చేసిన త్రిభుజాకార హెడ్‌లైట్‌లు ఈ ఎలక్ట్రిక్ SUVకి ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తున్నాయి. సాధారణ టయోటా SUVలతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ముందువైపు బంపర్‌లో ఇచ్చిన రెండు నిలువు ఎయిర్ వెంట్స్ డిజైన్‌ను మరింత స్పోర్టీగా మార్చుతాయి.

వాహనం చుట్టూ ఇచ్చిన బాడీ క్లాడింగ్ కారణంగా, ఇబెల్లా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ఉన్న వాహనంలా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌కి వస్తే, మారుతి EV మాదిరిగానే వెనుక డోర్ హ్యాండిల్స్‌ను C-పిల్లర్ లోపల దాచడం ద్వారా క్లీన్, మోడర్న్ లుక్‌ను టయోటా అందించింది. వెనుక ఉన్న సెగ్మెంటెడ్ ఎఫెక్ట్ టెయిల్ లైట్లు కార్ డిజైన్‌కు మంచి ఫినిషింగ్ టచ్‌ను ఇస్తాయి, ముఖ్యంగా రాత్రి సమయంలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఎక్స్‌టీరియర్ భాగం ఎంత ఆకర్షణీయంగా ఉందో, లోపలి భాగం కూడా అంతే ప్రీమియం టచ్‌తో రూపొందించబడింది. అయితే, టయోటా నుండి వచ్చిన ఇతర రీబ్యాడ్జ్ చేయబడిన మారుతి కార్ల మాదిరిగానే, ఇంటీరియర్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. మొత్తంగా చూస్తే, అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా క్యాబిన్ మారుతి ఈ-విటారాను తలపించే విధంగానే ఉంటుంది. అయినప్పటికీ, మెటీరియల్ క్వాలిటీ, ఫినిషింగ్, లేఅవుట్ పరంగా ఇది ఒక అప్‌మార్కెట్ ఫీల్‌ను ఇస్తుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV ఆధునిక టెక్నాలజీతో నిండిపోయి ఉంది. ఇందులో 10.1-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12-కలర్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ కారును మరింత లగ్జరీ అనుభూతిని ఇచ్చే EVగా మార్చుతున్నాయి.


Click it and Unblock the Notifications








