ఇక ఆ రూమర్లకు ఫుల్‌స్టాప్..సింగిల్ చార్జ్‌తో 543 కిమీ.. మార్కెట్లోకి టయొటా ఫస్ట్ ఈవీ కార్
భారత ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్లో గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్న ఒక పెద్ద సంచలనానికి తెరపడింది. ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా (Toyota Urban Cruiser eBella) ను అసలు ఇండియాలో లాంచ్ చేయడం లేదని, బుకింగ్స్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు చెక్కర్లు కొట్టాయి.
అయితే ఆ వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధమేనని నిరూపిస్తూ.. టయోటా కంపెనీ శుక్రవారం రోజున ఈ అందాల సుందరి ధరను అధికారికంగా ప్రకటించి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. మారుతి సుజుకీ భాగస్వామ్యంతో వస్తోన్న ఈ సరికొత్త ఈవీ కార్ విశేషాలు మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ అందిస్తున్నాం.

మారుతి ఇవిటారా ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కారును రద్దు చేస్తున్నారంటూ వచ్చిన రూమర్లను పటాపంచలు చేస్తూ టయోటా ఈ కారు ధరను వెల్లడించింది. ప్రస్తుతం భారత మార్కెట్లోకి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాప్-ఎండ్ సింగిల్ వేరియంట్ గ్రేడ్ E3 (Grade E3)ను మాత్రమే కంపెనీ ప్రవేశపెట్టింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 23.60 లక్షలుగా నిర్ణయించింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా కారును రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో గ్లోబల్‌గా డిజైన్ చేశారు. ఒకటి 49 kWh కాగా, మరొకటి భారీ 61 kWh బ్యాటరీ ప్యాక్. ప్రస్తుతం ఇండియాలో లాంచ్ అయిన గ్రేడ్ E3 వేరియంట్‌లో పవర్‌ఫుల్ 61 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 174 bhp గరిష్ట పవర్, 193 Nm టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 543 కిలోమీటర్ల దూరం (ARAI Certified Range) నాన్‌స్టాప్‌గా ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది.

దీనివల్ల లాంగ్ జర్నీలు చేసేటప్పుడు చార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ అస్సలు ఉండదు. ఇకపోతే, 440 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే చిన్న 49 kWh బ్యాటరీ ప్యాక్ ధరను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. ఈ ఈవీ కారు చూడటానికి మారుతి ఇ విటారా సీల్టౌట్ ను పోలి ఉన్నప్పటికీ, డిజైన్‌లో టయోటా తన మార్క్ చూపించింది. దీనికి సరికొత్త హామర్హెడ్ (Hammerhead) ఫ్రంట్ డిజైన్ శైలిని ఇచ్చారు.
ఎయిర్ వెంట్స్ ఉండేలా కండలు తిరిగిన ఫ్రంట్ బంపర్, ఈవీ కార్లకు మాత్రమే ఉండే క్లోజ్డ్ గ్లోస్-బ్లాక్ గ్రిల్ దీనికి అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. 3D డిజైన్ తో ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు (LED DRLs), 18-ఇంచ్ అలాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్ లాంప్స్ దీని రోడ్ ప్రజెన్స్‌ను ప్రీమియంగా మారుస్తాయి. ఇది 5 మోనోటోన్, 4 డ్యూయల్-టోన్ రంగులలో లభిస్తుంది.

ఇక కారు లోపలికి వెళ్తే లగ్జరీ ప్రపంచం కనిపిస్తుంది. బ్లాక్ అండ్ టాన్ డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్‌తో పాటు 10.25 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఎండ కాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 12-కలర్ యాంబియంట్ లైటింగ్, థియేటర్ లాంటి సౌండ్ ఇచ్చే ప్రీమియం JBL సౌండ్ సిస్టమ్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సేఫ్టీ విషయంలో టయోటా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ కారు అన్ని వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 4 వీల్స్ కి డిస్క్ బ్రేక్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. వీటికి తోడు 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడ్వాన్స్‌డ్ లెవెల్ 2 ADAS (Level 2 ADAS) సేఫ్టీ ఫీచర్లను జోడించారు. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా, కస్టమర్ల నమ్మకం కోసం 8 ఏళ్ల బ్యాటరీ వారంటీతో పాటు వినూత్నమైన బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ (BaaS) రెంటల్ ప్రోగ్రామ్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications