ఇది బైక్ కాదు కాలేజీ కుర్రాళ్లకు అదో ఎమోషన్.. 5 లక్షల మంది కొన్నారంటే రేంజ్ ఏంటో అర్థం అవుతుంది
టూ వీలర్ వెహికల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), ఈ ఏడాది సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆ కంపెనీకి చెందిన గంభీరమైన స్పోర్ట్స్ బైక్ 'టీవీఎస్ అపాచీ' (TVS Apache) అప్రతిహతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. 21 ఏళ్ల తన ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, ఒకే ఏడాదిలో 5 లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసి మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
టీవీఎస్ మోటార్ కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 2026 (FY2026) ఒక చిరస్మరణీయమైన ఏడాదిగా నిలిచిపోతుంది. ఒకవైపు జూపిటర్ స్కూటర్లు రికార్డు స్థాయిలో 2.30 మిలియన్ల విక్రయాలతో దూసుకెళ్లగా, మరోవైపు అపాచీ సిరీస్ బైకులు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. మొత్తం మీద టీవీఎస్ కంపెనీ 4.24 మిలియన్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో అపాచీ వాటా అత్యంత కీలకంగా మారింది.

సియామ్ (SIAM) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అపాచీ సిరీస్ ఈ ఏడాది 5,71,376 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది (FY2025) విక్రయించిన 4,46,218 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 28 శాతం పెరుగుదల. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 1.44 లక్షల అదనపు బైకులను కంపెనీ విక్రయించగలిగింది. టీవీఎస్ మొత్తం బైకుల అమ్మకాల్లో అపాచీ వాటా ఇప్పుడు 40 శాతానికి చేరింది. యువతలో ఉన్న క్రేజ్ కారణంగానే ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
టీవీఎస్ అపాచీ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో 5 లక్షల మార్కును దాటడం విశేషం. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అపాచీ బ్రాండ్ మొత్తం 7 మిలియన్ల (70 లక్షలు) యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్ల కాలంలోనే 4.38 మిలియన్ల బైకులు అమ్ముడయ్యాయంటే, ఈ బ్రాండ్ మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అపాచీ ప్రయాణాన్ని గమనిస్తే.. 2015లో కేవలం 1.98 లక్షల యూనిట్లు అమ్ముడవ్వగా, 2018 నాటికి అది 3.99 లక్షలకు చేరింది. 2020 నుంచి 2022 వరకు కరోనా, చిప్ కొరత కారణంగా అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల (డిగ్రోత్) కనిపించినప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంది. 2023లో 3.49 లక్షలు, 2024లో 3.78 లక్షలు, 2025లో 4.46 లక్షల యూనిట్ల సేల్స్ జరిగాయి. ఇప్పుడు 2026లో ఏకంగా 5.71 లక్షల విక్రయాలతో ఆల్ టైమ్ హై రికార్డును సెట్ చేసింది.
అపాచీ విజయంలో దాని వైవిధ్యభరితమైన మోడల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో RTR 160 2V, RTR 160 4V, RTR 165, RTR 180, RTR 200 4V వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ.1,11,400 నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ రూ. 1,48,600 వరకు ఉంటుంది. విభిన్న బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా మోడల్స్ ఉండటంతో అన్ని వర్గాల యువత అపాచీ వైపు మొగ్గు చూపుతున్నారు.

భారత మార్కెట్లో అపాచీకి ప్రధానంగా బజాజ్ పల్సర్, యమహా MT-15, కేటీఎం డ్యూక్ 200, సుజుకి జెిక్సర్ మరియు హీరో ఎక్స్‌ట్రీమ్ వంటి బైకుల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ, టీవీఎస్ అందిస్తున్న రేసింగ్ టెక్నాలజీ, మైలేజీ, స్టైలిష్ లుక్స్ అపాచీని రేసులో ముందుంచుతున్నాయి. అపాచీతో పాటు టీవీఎస్ రైడర్ (4.26 లక్షల యూనిట్లు), రోనిన్ (80 వేల యూనిట్లు) కూడా మంచి అమ్మకాలతో కంపెనీకి లాభాలను తెచ్చిపెట్టాయి.
ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని టీవీఎస్ తన అపాచీ బ్రేడ్ లో మరిన్ని అప్‌డేటెడ్ ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రేసింగ్ డీఎన్‌ఏను మరింత బలోపేతం చేస్తూ, కొత్త కలర్ ఆప్షన్లు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను జోడించనుంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, స్పోర్ట్స్ బైక్ ల పట్ల క్రేజ్ తగ్గకపోవడం అపాచీ వంటి బ్రాండ్లకు వరంగా మారింది.


Click it and Unblock the Notifications








