స్విఫ్ట్ కంటే తక్కువ ధరకే 7-సీటర్.. ఈ 3 కార్లు చూడండి.. పెద్ద ఫ్యామిలీకి తక్కువ ఖర్చులో పెద్దవి కొనచ్చు
భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం కారణంగా, పెద్ద కుటుంబాలకు సరిపోయే వాహనాలపై ఎప్పుడూ ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా 7-సీటర్ కార్లు ఈ విభాగంలో అత్యంత ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒకే కారులో మొత్తం కుటుంబం సౌకర్యంగా ప్రయాణించగలగడం, లాంగ్ డ్రైవ్‌లకు అనువుగా ఉండటం, అలాగే స్పేస్ పరంగా మెరుగ్గా ఉండటం వంటి కారణాలతో ఇవి చాలా మంది మొదటి ఎంపికగా మారాయి. అయితే చాలామందిలో ఒక అపోహ ఉంది, 7-సీటర్ కార్లు అంటే ఖరీదైనవే, సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండవని. కానీ వాస్తవానికి ఇది పూర్తిగా నిజం కాదు. ప్రస్తుతం అనేక కంపెనీలు తక్కువ ధరలోనే 7-సీటర్ కార్లను అందిస్తున్నాయి. కొన్ని మోడళ్ల ధరలు మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కంటే కూడా తక్కువగా ఉండటం. ఈ కథణంలో కొన్ని కార్లను చూద్దాం.
Nissan Gravite: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ భారత మార్కెట్లో తన స్థానం బలోపేతం చేసుకునే దిశగా తీసుకొచ్చిన తాజా మోడల్ గ్రావైట్. ఇది 7-సీటర్ సెగ్మెంట్‌లోకి వస్తూనే కూడా ఎంతో ఆకర్షణీయమైన బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండటం. ప్రస్తుతం దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 5.65 లక్షల నుంచే ప్రారంభమవుతోంది. ఈ ధర మారుతి స్విఫ్ట్ కంటే కూడా తక్కువ.

ఇంజిన్ విషయానికి వస్తే, నిస్సాన్ గ్రావైట్ 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ నగర ప్రయాణాలకు సరిపడే పనితీరు ఇవ్వడంతో పాటు, మైలేజ్ పరంగా కూడా సంతృప్తికరంగా ఉంటుంది. అదనంగా, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌లను కూడా అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టు ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకునే స్వేచ్ఛ పొందుతున్నారు.
Renault Triber: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ 7-సీటర్ కార్లలో ఒకటి ట్రైబర్. ప్రస్తుతం ఈ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 5.76 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. ఈ ధరను పరిశీలిస్తే, ఇది మధ్యతరగతి కుటుంబాలకు సులభంగా అందుబాటులో ఉండే 7-సీటర్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

ఇంజిన్ విషయానికి వస్తే, రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ నగర డ్రైవింగ్‌కు సరిపడే శక్తిని అందించడంతో పాటు, మంచి మైలేజ్‌ను కూడా ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఉండటం వల్ల, వినియోగదారులు తమ డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఫీచర్లు కూడా డజన్ల కొద్ది ఉన్నాయి.
Mahindra Bolero: భారతీయ ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన మహీంద్రా తయారుచేసిన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ వాహనాలలో బొలెరో ఒకటి. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ. 8 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఈ ధరలోనే ఒక బలమైన, దీర్ఘకాలిక ఉపయోగానికి అనువైన 7-సీటర్ SUV లభించడం దీని ప్రత్యేకతగా చెప్పాలి. ఇంజిన్ విషయానికి వస్తే, ఈ వాహనం 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది.

ఈ ఇంజన్ శక్తివంతమైన పనితీరును అందించడంలో ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా లోడుతో ప్రయాణించినా, గిరిజన ప్రాంతాలు లేదా గ్రామీణ రోడ్లపై డ్రైవ్ చేసినా, ఇది తడబడకుండా మంచి టార్క్‌ను అందిస్తుంది. అయితే, ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించడం గమనించదగ్గ విషయం. డ్రైవింగ్‌పై పూర్తి నియంత్రణ కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఫీచర్ల పరంగా కూడా ఇప్పుడు ఈ కారు గతంతో పోలిస్తే మంచి అప్‌డేట్స్ పొందింది.


Click it and Unblock the Notifications








