పెద్ద ఫ్యామిలీలు ఉన్నోళ్లకు పండగే.. మార్కెట్లోకి రాబోతున్న టాప్ క్లాస్ 7 సీటర్ కార్లు ఇవే
భారతదేశంలో పెద్ద కుటుంబం ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, లగ్జరీ ఫీచర్లు ఉన్న పెద్ద కార్లను కొనడానికే ఇష్టపడతారు. అందుకే ఇండియన్ మార్కెట్లో 7 సీటర్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ట్రెండ్‌ను గమనించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి.
ఈ ఏడాది మొదటి సగభాగంలో మహీంద్రా XUV 7XO, విన్‌ఫాస్ట్ VF MPV 7, నిస్సాన్ గ్రావైట్, మెర్సిడెస్ వి-క్లాస్ వంటి క్రేజీ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో కూడా మరికొన్ని టాప్ కంపెనీలు తమ సరికొత్త 7 సీటర్ కార్లను లాంచ్ చేయడానికి అన్నీ సిద్ధం చేశాయి. వాటిలో ముఖ్యమైన కార్ల వివరాలను తెలుసుకుందాం.

ఎంజీ 520 (MG 520)
ఎంజీ మోటార్స్ కంపెనీ త్వరలోనే సరికొత్త త్రీ-రో (Three-row) ఎస్‌యూవీ ఎంజీ 520ని పరిచయం చేయబోతోంది. ఈ కారు జూలై 16వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది నేరుగా మహీంద్రా XUV 7XO మోడల్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి వస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన వులింగ్ స్టార్‌లైట్ 560 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కారును తయారు చేశారు.
అంతర్జాతీయంగా ఇది 5, 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, మన దేశంలో మాత్రం కేవలం 7 సీటర్ వెర్షన్‌ను మాత్రమే తీసుకురానున్నారు. ఈ కారును ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV), ప్యూర్ ఎలక్ట్రిక్ (EV) అనే రెండు ఆప్షన్లలో కంపెనీ అందించబోతోంది. ముందుగా హైబ్రిడ్ వేరియంట్ మార్కెట్లోకి వస్తుంది, ఆ తర్వాత కొన్ని నెలలకు ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల కానుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ (Mahindra Scorpio N Facelift)
దేశీయ దిగ్గజం మహీంద్రా కంపెనీ తన మోస్ట్ పాపులర్ మోడల్ అయిన స్కార్పియో-ఎన్ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ మునుపటి లాగే 6, 7 సీటర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఎక్స్‌టీరియర్ పరంగా చాలా మార్పులు చేశారు. కొత్త డిజైన్ ఉన్న ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, స్టైలిష్ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్, సరికొత్త రేడియేటర్ గ్రిల్, కొత్త అలాయ్ వీల్స్ ఇందులో మనకు కనిపిస్తాయి.
కారు లోపల క్యాబిన్ విషయానికి వస్తే, కొత్త డ్యాష్‌బోర్డ్, హారిజాంటల్ ఏసీ వెంట్స్, పెద్దదైన 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చనున్నారు. అయితే ఇంజన్, మెకానికల్ సెటప్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

కియా కార్నివాల్ హైబ్రిడ్ (Kia Carnival Hybrid)
ప్రముఖ కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా (Kia), తన లగ్జరీ కార్నివాల్ మోడల్‌ను సరికొత్త హైబ్రిడ్ వేరియంట్‌తో ఇండియాలో లాంచ్ చేయడానికి రెడీ అయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (Q3) చివరి నాటికి ఈ లగ్జరీ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ కార్నివాల్ హైబ్రిడ్‌లో 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్‌ను ఇవ్వబోతున్నారు. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా రానుంది. ఇది కారు ఫ్రంట్ వీల్స్‌కు పవర్‌ను అందిస్తుంది. సౌత్ కొరియాలో ఈ లగ్జరీ కారు లీటరుకు ఏకంగా 14 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

కియా సోరెంటో హైబ్రిడ్ (Kia Sorento Hybrid)
కియా కంపెనీ నుంచి రాబోతున్న మరో అద్భుతమైన 7 సీటర్ కారు కియా సోరెంటో. ఈ సోరెంటో హైబ్రిడ్ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా నేరుగా మన భారతదేశంలోనే లోకల్‌గా మాన్యుఫ్యాక్చరింగ్ చేయనున్నారు. భారతీయ కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా చాలా తక్కువ ధరలోనే దీనిని అందించడానికి కంపెనీ సరికొత్త ప్లాన్ చేస్తోంది.
ఇందుకోసం 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌కు బదులుగా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆధారిత హైబ్రిడ్ సిస్టమ్‌ను ఇందులో వాడబోతున్నట్లు సమాచారం. ఈ కారుతో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్‌గా వస్తుంది. అంతేకాకుండా కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టు ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) లేదా ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications