బస్సులు, రైళ్లు అవసరం లేదు.. పెద్ద ఫ్యామిలీలు పెట్రోల్ ఖర్చు లేకుండా టూర్లు ఎంజాయ్ చేయొచ్చు
ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై 7 సీటర్ కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద ఫ్యామిలీలు అయినా, స్నేహితులతో కలిసి ట్రిప్పులకు వెళ్లడానికైనా పెద్ద కార్లనే అందరూ ఇష్టపడుతున్నారు. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఈ పెద్ద కార్ల యజమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ 7 సీటర్ల వైపు మళ్లింది. టాటా, మారుతి, టయోటా వంటి దిగ్గజ కంపెనీలు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకట్టుకునేలా భారీ రేంజ్ ఇచ్చే ఈవీలను రెడీ చేస్తున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు దూసుకుపోయే ఆ 5 అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. టాటా సఫారీ ఈవీ:
టాటా మోటార్స్ తన ప్రతిష్టాత్మకమైన సఫారీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకువస్తోంది. ఈ కారు ఈ ఏడాది దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సఫారీ ఈవీ కేవలం చూడటానికే కాదు, పెర్ఫార్మెన్స్‌లో కూడా రాజసం చూపిస్తుంది. ఇందులో అమర్చబోయే భారీ బ్యాటరీ ప్యాక్ సహాయంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 627 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని సమాచారం. డిజైన్ పరంగా ప్రస్తుత సఫారీని పోలి ఉన్నా, క్లోజ్డ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ ఈవీ కలర్స్‌తో ఇది కొత్త లుక్‌ను సంతరించుకోనుంది. లోపల పనోరమిక్ సన్‌రూఫ్, వెంట్లేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి.

2. మారుతి సుజుకి YMC:
మారుతి సుజుకి ఎట్టకేలకు ఎలక్ట్రిక్ మార్కెట్లోకి భారీ ఎంట్రీ ఇస్తోంది. YMC అనే కోడ్ నేమ్‌తో తయారవుతున్న ఈ 7-సీటర్ ఎమ్‌పీవీ (MPV), మారుతి ఎర్టిగా కంటే పెద్దదిగా ఉండబోతోంది. ఇది 61 kWh బ్యాటరీతో రానుందని, సుమారు 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని టాక్. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును మారుతి తీర్చిదిద్దుతోంది. 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో హైలైట్ కానున్నాయి. 2026 చివరి నాటికి ఈ కారు మన ముందుకు రానుంది.
3. టాటా అవిన్యా X:
టాటా కేవలం ఉన్న కార్లనే ఈవీలుగా మార్చడం లేదు, అసలు సరికొత్త కాన్సెప్ట్‌తో అవిన్యా సిరీస్‌ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాబోతున్న అవిన్యా X ఒక ప్రీమియం క్రాసోవర్. దీని పొడవు సుమారు 5 మీటర్లు ఉంటుంది. ఇది 5, 6, 7 సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు డిజైన్ చూస్తే భవిష్యత్తు నుంచి వచ్చిన కారులా అనిపిస్తుంది. టాటా తన ప్రత్యేక ఈవీ షోరూమ్‌ల ద్వారానే వీటిని విక్రయించనుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం కారు మాత్రమే కాదు, విలాసవంతమైన ప్రయాణానికి ఒక కేరాఫ్ అడ్రస్ కానుంది.

4. విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ7 (VinFast VF MPV7):
వియత్నాంకు చెందిన ప్రసిద్ధ ఈవీ కంపెనీ విన్‌ఫాస్ట్ భారత్‌లో అడుగుపెడుతోంది. తన మొదటి 7-సీటర్ ఎమ్‌పీవీగా వీఎఫ్ ఎంపీవీ7ను లాంచ్ చేస్తోంది. ఇందులో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది సుమారు 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మొదట్లో దీనిని టాక్సీ, ఫ్లీట్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బేసిక్ వెర్షన్‌లో తీసుకురానున్నారు. తక్కువ ధరలో ఎక్కువ స్పేస్, మెరుగైన రేంజ్ కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది. కమర్షియల్ రంగంలో ఈ కారు విప్లవం సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
5. టయోటా 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ:
మారుతి, టయోటా మధ్య ఉన్న ఒప్పందంలో భాగంగా, మారుతి YMC మోడల్‌ను టయోటా తనదైన స్టైల్‌లో మార్కెట్లోకి తీసుకురానుంది. లోపల ఫీచర్లు, ఇంజన్ సామర్థ్యం మారుతి కారులాగే ఉన్నప్పటికీ, బయటి డిజైన్ మాత్రం టయోటా సిగ్నేచర్ లుక్‌లో ఉంటుంది. టయోటా కంపెనీ అంటేనే నమ్మకం, నాణ్యతకు మారుపేరు. కాబట్టి, భారీ ఫ్యామిలీ ఈవీ కావాలనుకునే వారు టయోటా వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది కూడా 2026-27 మధ్య కాలంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications