పెళ్లిళ్లకు వెళ్లాలన్నా, టూర్లకు వెళ్లాలన్నా రెండు కుటుంబాలకు సరిపోతుంది..మారుతి, టాటాల నుంచి కొత్త కార్లు
భారతదేశంలోని రోడ్ల మీద ఇప్పటి వరకు కింగ్ అంటే టయోటా ఇన్నోవా అనే ఎవరిని అడిగినా చెబుతారు. ఎన్నో ఏళ్లుగా 7 సీటర్ ఎంపీవీ సెగ్మెంట్‌లో ఇన్నోవాకు ఎదురు లేదనే చెప్పాలి. కానీ, ఇన్నోవా ఏకాధిపత్యానికి బ్రేక్ వేసేందుకు దిగ్గజ కంపెనీలు నడుం బిగించాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ తమ సరికొత్త ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ టెక్నాలజీతో ఇన్నోవాను ఢీకొట్టేందుకు వస్తున్న ఆ మూడు మోడళ్ల వివరాలు తెలుసుకుందాం.
మారుతి సుజుకి YMC:
మారుతి సుజుకి తన మొట్టమొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి ప్రస్తుతం YMC అనే కోడ్ నేమ్ పెట్టారు. ఇది కేవలం సీఎన్జీ లేదా పెట్రోల్ కారు కాదు, పూర్తిగా బ్యాటరీతో నడిచే అద్భుతం. దాదాపు 4.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారును ఈ-విటారా ప్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తున్నారు.

ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు (49 kWh, 61.1 kWh) ఉండబోతున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. లోపల సోఫా లాంటి సీట్లు, లగ్జరీ క్యాబిన్ దీని ప్రత్యేకత. ఇది వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని అందించడమే మారుతి లక్ష్యం.
టాటా మోటార్స్ 7 సీటర్ ఎంపీవీ:
టాటా మోటార్స్ నుంచి రాబోయే ఈ కొత్త ఎంపీవీ ఇన్నోవా హైక్రాస్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది చూడటానికి టాటా సియెర్రా (Sierra) ఎస్‌యూవీలాగే స్టైలిష్‌గా ఉండబోతోంది. ఇందులో కేవలం సీట్లు మాత్రమే కాదు, టెక్నాలజీ కూడా అదిరిపోతుంది. ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, అడాస్ (ADAS) లెవెల్ 2 సెక్యూరిటీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రావచ్చు. మూడో వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏసీ వెంట్లతో పాటు ఎక్కువ లెగ్ స్పేస్ కూడా అందించబోతున్నారు. ఇది 2027 నాటికి రోడ్ల మీద కనిపించే అవకాశం ఉంది.
ఎంజీ డారియన్ (MG Darion):
చైనా దిగ్గజం ఎంజీ మోటార్స్ నుంచి వస్తున్న డారియన్ నిజంగా ఒక భారీ ఎంపీవీ. దీని పొడవు సుమారు 5 మీటర్లు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో వెనుక సీట్లకు వెళ్లేందుకు స్లైడింగ్ డోర్లు (Sliding Doors) ఉంటాయి. అంటే కార్ల పార్కింగ్ ఇరుగ్గా ఉన్నా సరే, సులభంగా దిగవచ్చు.

ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఇది 125 కిలోమీటర్లు వెళ్తుంది, ఇక ఫుల్ ట్యాంక్ పెట్రోల్, ఛార్జింగ్‌తో కలిపి 1,000 కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్‌కు వెళ్లవచ్చు. లోపల 12.8 ఇంచ్ భారీ టచ్ స్క్రీన్, 360 డిగ్రీల కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది లగ్జరీ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications