ఇప్పుడున్న కారు కాదు.. రాబోయేది వేరే లెవల్! కొత్త కారు కొనాలనుకునే వారు కాస్త ఆగండి!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు సెడాన్ కార్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోండా (honda), ప్రస్తుతం SUV విభాగంలో కూడా తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న పోటీ, కొత్త కంపెనీల ఎంట్రీ, వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు వంటి అంశాల కారణంగా హోండా అమ్మకాలపై కొంత ప్రభావం పడినప్పటికీ, కంపెనీ తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్ చేస్తూ మార్కెట్లో పోటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రజాదరణ పొందిన మోడళ్లకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను తీసుకురావడం ద్వారా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే హోండా ఇటీవల తన ప్రముఖ సెడాన్ కారు సిటీకి అప్‌డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
కొత్త డిజైన్ ఎలిమెంట్లు, మెరుగైన ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో వచ్చిన ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. దాని ప్రభావం అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. మే 2025తో పోలిస్తే మే 2026లో హోండా సిటీ అమ్మకాలు సుమారు 150 శాతం పెరగడం కంపెనీకి భారీ ఊరటనిచ్చింది. సెడాన్ సెగ్మెంట్‌లో ఇంకా హోండా సిటీకి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు మరోసారి నిరూపించాయి.

ఇప్పుడు హోండా దృష్టి తన SUV శ్రేణిలో అత్యంత కీలకమైన మోడల్ అయిన ఎలివేట్ (Elevate)పై పడింది. భారత మార్కెట్లో ఎలివేట్ ప్రవేశించినప్పటి నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. అయితే ప్రస్తుతం ఈ విభాగంలో పోటీ మరింత తీవ్రంగా మారడంతో, వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా ఎలివేట్‌ను కూడా కొత్త రూపంలో తీసుకురావాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ భారతీయ రహదారులపై పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కనిపించింది. ఈ విషయాన్ని మోటర్‌బీమ్ వెల్లడించింది. టెస్ట్ మ్యూల్ పూర్తిగా కేమోఫ్లాజ్‌తో కప్పబడి ఉండటంతో డిజైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే ముందు భాగంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్ సెటప్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా క్యాబిన్‌లో కూడా కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు, మరింత అధునాతన భద్రతా సదుపాయాలు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం హోండా ఎలివేట్ 1.5-లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ ఇంజిన్‌ను రానున్న ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం భారత మార్కెట్లో హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఎలివేట్‌లో కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందిస్తే వినియోగదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మెరుగైన మైలేజ్, తక్కువ ఇంధన వ్యయం కోరుకునే కస్టమర్లకు ఇది మంచి ఎంపికగా మారుతుంది. అయితే హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ప్రవేశపెడుతుందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు.

ఫీచర్ల పరంగా ఈ కారులో అధునాతనమైనవి ఉండే అవకాశం ఉంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా ఈ కారులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ADAS సేఫ్టీ ప్యాకేజీలో అదనపు ఫీచర్ల వంటి వివిధ కొత్త ఫీచర్లను అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12 లక్షలుగా నిర్ణయించవచ్చు.


Click it and Unblock the Notifications