కార్ కొనేవాళ్లు కాస్త ఆగండి.. ఇండియన్ మార్కెట్లోకి త్వరలోనే 5 పవర్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీల ఎంట్రీ
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్లపై రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ కార్లను సొంతం చేసుకోవడానికి కస్టమర్లు పోటీ పడుతున్నారు. వినియోగదారుల క్రేజ్‌ను గమనించిన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, ఎంజీ వంటి దిగ్గజ కంపెనీలు సరికొత్త మోడళ్లను రంగంలోకి దించడానికి సిద్ధమయ్యాయి.
ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో భారతీయ మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో కూడిన 5 అద్బుతమైన ఎస్‌యూవీ కార్లు రాబోతున్నాయి. వీటిలో ప్యూర్ ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వంటి మోడ్రన్ ఇంజన్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. వచ్చే కొన్ని నెలల్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేసే వారి కోసం, ఈ 5 అద్భుతమైన ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.

ఎంజీ హెక్టార్ హాక్
ఎంజీ మోటార్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఎంజీ హెక్టార్ హాక్ అనే సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కారు మార్కెట్లోకి ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ప్యూర్ ఎలక్ట్రిక్ అనే రెండు ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
దీని ఈవీ వేరియంట్‌లో ఏకంగా 56.7 kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చనున్నారు. ఇది సింగిల్ ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రారంభంలో దీనిని 5-సీటర్ ఆప్షన్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చి, ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్ ను బట్టి 7-సీటర్ మోడల్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

న్యూ-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా
ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా.. ఇప్పుడు సరికొత్త రూపంలో అలరించడానికి సిద్ధమవుతోంది. హ్యుందాయ్ సంస్థ ఈ కారును సరికొత్త K3 ప్లాట్‌ఫారమ్ పై మరింత పటిష్టంగా తయారు చేస్తోంది. ఈ న్యూ-జనరేషన్ కారును 2027 ప్రారంభంలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
లాంగ్ జర్నీలో అలసట లేకుండా ఉండేందుకు ఇందులో జీరో-గ్రావిటీ సీట్లు, మెరుగైన ప్రయాణ అనుభూతి కోసం మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్, లుక్ పరంగా కారుకు స్పోర్టీ టచ్ ఇచ్చేలా 19-ఇంచుల భారీ అలాయ్ వీల్స్‌ను అందించనున్నారు. ఇంజన్ పరంగా చూస్తే ఇందులో పాత మోడల్ తరహాలోనే 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా రానుంది.

కియా సెల్టోస్ హైబ్రిడ్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా, రాబోయే 2027 సంవత్సరం ప్రారంభంలో తమ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ సెల్టోస్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను లాంచ్ చేయనుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1.5-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌కు అదనంగా డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్, అడ్వాన్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ సెటప్‌ను జత చేయనున్నారు. ఈ సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల పెట్రోల్ ఖర్చు భారీగా తగ్గడమే కాకుండా, కారు లీటరు పెట్రోల్‌కు ఏకంగా 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. మైలేజ్ ప్రియులకు ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.
రెనాల్డ్ డస్టర్ హైబ్రిడ్
ఒకప్పుడు భారతీయ రోడ్లపై సంచలనం సృష్టించిన డస్టర్ కారు, సరికొత్త రూపంలో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ కానుకగా న్యూ-జనరేషన్ రెనాల్డ్ డస్టర్‌ను స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో కంపెనీ లాంచ్ చేయనుంది. ఇందులో 1.8-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తున్నారు.
ఈ హైబ్రిడ్ ఇంజన్ల కాంబినేషన్ ద్వారా కారుకు ఏకంగా 160bhp పవర్ లభిస్తుంది. దీనికి మల్టీ-మోడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది మార్కెట్లోకి వస్తే మారుతి గ్రాండ్ విటారా, టొయోటా హైరైడర్ వంటి టాప్ కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్
హోండా కార్స్ ఇండియా మార్కెట్లో తమ ఉనికిని చాటుకోవడానికి ఎలివేట్ ఎస్‌యూవీలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకువస్తోంది. ఇటీవల ఈ కారును రహదారులపై టెస్టింగ్ చేస్తుండగా ఆటోమొబైల్ వర్గాలు గుర్తించాయి. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ కారులో సరికొత్తగా రీ-డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ బంపర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పెద్ద సైజ్ టచ్‌స్క్రీన్, సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లను జోడిస్తున్నారు.
ప్రయాణికుల భద్రతను మరింత పెంచడం కోసం హ్యుందాయ్, కియా కార్ల తరహాలోనే అడ్వాన్స్‌డ్ అడాస్ సేఫ్టీ సూట్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇందులో ఇస్తున్నారు. అయితే ఇంజన్ లో ఎలాంటి మార్పులు లేకుండా పాత 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తోనే ఇది రానుంది.


Click it and Unblock the Notifications