బడ్జెట్ రెడీ చేస్కోండి బాసూ.. మైలేజ్, లుక్స్‌లో కిర్రాక్ అనిపించేలా మార్కెట్లోకి 4 కొత్త సబ్ కాంపాక్ట్ SUVలు
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం సబ్-4 మీటర్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అదిరిపోయే లుక్స్ లభిస్తుండటంతో సగటు మధ్యతరగతి వినియోగదారుడు ఈ కార్ల వైపే మొగ్గు చూపుతున్నాడు. కార్ల తయారీ కంపెనీలకు కూడా భారీగా లాభాలను తెచ్చిపెడుతున్న సెగ్మెంట్ ఇదే.
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత ముదరనుంది. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్‌ను ఏలుతున్న టాప్-4 ఎస్‌యూవీలు పూర్తిగా సరికొత్త రంగు, రూపు మార్చుకుని నెక్ట్స్ జెనరేషన్ అవతారంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కాస్త బడ్జెట్ సిద్ధం చేసుకుని వీటి మీద ఓ లుక్కేయండి.

1. న్యూ-జెనరేషన్ మారుతి సుజుకి బ్రెజ్జా (New Maruti Brezza)
సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎప్పటి నుంచో రారాజుగా వెలుగుతున్న మారుతి సుజుకి బ్రెజ్జా.. అందరికంటే ముందే సరికొత్త మార్పులతో మార్కెట్లోకి రానుంది. తాజా నివేదికల ప్రకారం ఆల్-న్యూ బ్రెజ్జా 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలోనే రోడ్లపైకి రానుంది. ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పరంగా భారీ మార్పులను సొంతం చేసుకోబోతోంది.
ముఖ్యంగా ఇందులో మారుతి సుజుకి సొంతంగా డెవలప్ చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్(Strong Hybrid) ఇంజిన్ టెక్నాలజీని వాడనున్నారు. ఇదే టెక్నాలజీని మారుతి ఫ్రాంక్స్ నెక్ట్స్ మోడల్‌లోనూ ప్రవేశపెడుతున్నారు. ఈ హైబ్రిడ్ ఇంజిన్ వల్ల కారు పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా, లీటరుకు ఊహించని రేంజ్‌లో మైలేజ్ ఇస్తుందని వెబ్‌సైట్ల సమాచారం. బడ్జెట్ అండ్ మైలేజ్ చూసుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

2. నెక్ట్స్-జెనరేషన్ టాటా నెక్సాన్ (Next-Gen Tata Nexon)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న, అత్యంత సురక్షితమైన (5-స్టార్ సేఫ్టీ రేటింగ్) ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఒకటి. ఈ పాపులర్ కారు కూడా 2027 లో సరికొత్త నెక్ట్స్-జెనరేషన్ మోడల్‌గా రూపాంతరం చెందనుంది. ప్రస్తుతమున్న ప్లాట్‌ఫామ్‌ను మరింత అడ్వాన్స్‌డ్‌గా మార్చి ఈ సరికొత్త కారును డిజైన్ చేస్తున్నారు.
టాటా మోటార్స్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రాబోతున్న ఈ నెక్సాన్.. మునుపటి కంటే చాలా స్పోర్టీగా, అగ్రెసివ్‌గా కనిపించనుంది. కారు లోపల సరికొత్త టెక్నాలజీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లను జోడించనున్నారు. సేఫ్టీ, స్టైల్స్ కోరుకునే వారికి ఈ కారు మళ్లీ మైండ్ బ్లాక్ చేయడం ఖాయం.

3. న్యూ-జెనరేషన్ కియా సోనెట్ (New Kia Sonet)
ఫీచర్ల పరంగా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకునే కియా సోనెట్.. తన నెక్ట్స్ జెనరేషన్ మోడల్ కోసం ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియను కూడా మొదలుపెట్టేసింది. ఈ సరికొత్త సోనెట్ కారు 2027 చివరి నాటికి అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల లీకైన టెస్టింగ్ ఫోటోల ప్రకారం.. కొత్త సోనెట్ లుక్ కియా పెద్ద ఎస్‌యూవీ అయిన సెల్టోస్ (Seltos) నుంచి ప్రేరణ పొందింది.
దీని ఫ్రంట్ ప్రొఫైల్‌లో పెద్ద గ్రిల్, కొత్త స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. కారు లోపల విలాసవంతమైన ఫీచర్లు, మరిన్ని ఏఐ ఆధారిత ఫీచర్లు రానున్నాయి. అయితే, దీని ఇంజిన్ ఆప్షన్లలో (పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్) పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని టాక్.

4. న్యూ-జెనరేషన్ మహింద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (New Mahindra XUV 3XO)
మహింద్రా ఇటీవల లాంచ్ చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ మార్కెట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే, కంపెనీ ఇక్కడితో ఆగకుండా దీని నెక్ట్స్ జనరేషన్ మోడల్‌పై అప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది. గతంలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన విజన్ ఎక్స్ (Vision X) కాన్సెప్ట్ కారు ఆధారంగా ఈ నెక్ట్స్ జెన్ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ రూపుదిద్దుకోనుంది.
మహింద్రాకు చెందిన సరికొత్త 'NU_IQ' ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును నిర్మిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిపై పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ (EV), హైబ్రిడ్ మోడళ్లను కూడా సులభంగా తయారు చేయవచ్చు. ఈ నెక్ట్స్-జెన్ కారు 2027 లేదా 2028 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ 4 సరికొత్త కార్లలో కేవలం లుక్స్ మాత్రమే కాకుండా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, మెరుగైన భద్రతా ప్రమాణాలను స్టాండర్డ్‌గా ఇవ్వడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్ కావాలనుకునే వారు ఈ కార్ల లాంచ్ కోసం మరికొంత కాలం వేచి చూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications