కార్లకు కంపెనీ ఇచ్చిన సన్‌షేడ్స్, నెట్స్ వాడుతున్నారా?.. అయితే మీకు రూ.5,000 చలాన్ గ్యారెంటీ
సోషల్ మీడియాలో తరచూ కార్ల యజమానులకు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య కార్ కర్టెన్స్ విషయంలో పెద్ద ఎత్తున గొడవలు జరగడం మనం చూస్తుంటాం.. 'ఈ కర్టెన్స్ ను కారు కంపెనీ వాళ్లే ఇన్-బిల్ట్‌గా ఇచ్చారు.. దీనికి చలాన్ ఎలా వేస్తారు?' అని డ్రైవర్లు వాదిస్తుంటారు.. కానీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కారు గ్లాసులకు ఎలాంటి సన్‌షేడ్స్, నల్లటి ఫిల్మ్‌లు వాడటం చట్టవిరుద్ధం.. మరి కంపెనీలు ఇచ్చే సన్‌షేడ్స్ వాడుతున్నా సరే ఎందుకు ఫైన్ వేస్తారు?, సుప్రీం కోర్టు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం
కారు విండో పరదాలపై ట్రాఫిక్ పోలీసుల నిఘా
రోడ్డుపై వెళ్లేటప్పుడు కార్ల విండో గ్లాసులకు ఉండే సన్‌షేడ్స్ విషయంలో వాహనదారులకు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య తరచూ తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతుంటాయి. చాలా మంది కార్ల యజమానులు.. ఈ పరదాలను తాము విడిగా మార్కెట్లో కొనలేదని, కారు కొనేటప్పుడే కంపెనీ వాళ్లు ఇన్-బిల్ట్‌గా అమర్చి ఇచ్చారని వాదిస్తుంటారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం రూల్స్ ఒప్పుకోవంటూ జరిమానా విధిస్తారు. కారు కంపెనీలు ఇచ్చిన యాక్సెసరీస్ వాడినా కూడా చలాన్ ఎందుకు పడుతుందో పూర్తి రూల్స్ తెలుసుకోవడం చాలా అవసరం.

కారు గ్లాసుల విజిబిలిటీపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
నిజానికి, కార్ల గ్లాసుల విషయంలో 2012 సంవత్సరంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా కారు లోపల ఎవరు ఉన్నారనేది బయటకు స్పష్టంగా కనిపించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ రూల్ ప్రకారం.. కారు ముందు భాగం (విండ్‌షీల్డ్), వెనుక వైపు ఉండే అద్దాల గుండా కనీసం 70 శాతం వెలుతురు లోపలికి రావాలి. అలాగే కారుకు ఇరువైపులా ఉండే సైడ్ గ్లాసుల నుంచి కనీసం 50 శాతం వెలుతురు లోపలికి రావాలి. ఈ విజిబిలిటీని అడ్డుకునేలా కారు గ్లాసులకు నల్లటి ఫిల్మ్‌లు అంటించడం, జాలీలు పెట్టడం లేదా క్లాత్ సన్‌షేడ్స్ కట్టడం పూర్తిగా చట్టవిరుద్ధం.

కంపెనీలు విండో సన్‌షేడ్స్ ఎందుకు ఇస్తాయి?
కారు గ్లాసులకు సన్‌షేడ్స్ పెట్టడం చట్టప్రకారం నేరమైతే.. మరి కార్ల కంపెనీలు తమ ప్రీమియం మోడల్స్ లో ఇన్-బిల్ట్ సన్‌షేడ్స్ ఎందుకు ఇస్తాయనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. కంపెనీలు ఈ సన్‌షేడ్స్ కారు నడుపుతున్నప్పుడు వాడుకోవడానికి ఇవ్వవు.
కారును ఎండలో లేదా ఓపెన్ పార్కింగ్‌లో నిలిపి ఉంచినప్పుడు, లోపల పెద్ద మొత్తంలో వేడి పుట్టకుండా ఉండేందుకు, కారు సీట్లు పాడవకుండా ఉండేందుకు వీటిని వాడుకోవచ్చు. అలాగే కారు ఆపి ఉన్నప్పుడు ప్రైవసీ కోరుకునే వారు వీటిని పైకి లాక్కోవచ్చు. అంతే తప్ప కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు వీటిని ఉపయోగిస్తే చలాన్ పడటం గ్యారెంటీ.

కార్ల కంపెనీలపై కేసు వేయవచ్చా?
కంపెనీ ఇచ్చిన వస్తువులకే పోలీసులు ఫైన్ వేస్తున్నప్పుడు.. వినియోగదారులను తప్పుదోవ పట్టించినందుకు కార్ల కంపెనీలపై కోర్టులో కేసు వేయవచ్చా? అనే సందేహం చాలా మందికి రావచ్చు. కానీ అలా కేసు వేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనం కారు కొనుగోలు చేసే సమయంలో సంతకం చేసే బుక్‌లెట్లు, నిబంధనల పత్రాలలో కంపెనీలు ఈ విషయాలను ముందే చిన్న అక్షరాలతో స్పష్టంగా పేర్కొంటాయి. రన్నింగ్ కారులో వీటి వాడకం వల్ల జరిగే పరిణామాలకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ముందే రాసి ఉంటుంది కాబట్టి లీగల్‌గా కంపెనీలను ఏమీ చేయలేము.
ఆ ఒక్క కేటగిరీ వారికి మాత్రమే మినహాయింపు
భారతదేశంలో ఈ కారు గ్లాసుల నిబంధన నుంచి కేవలం ఒకే ఒక్క కేటగిరీ వారికి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అత్యున్నత స్థాయి జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత పొందిన వీఐపీల (VIPs) వాహనాలకు మాత్రమే నల్లటి అద్దాలు లేదా విండో సన్‌షేడ్స్ వాడుకోవడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంది. వారి ప్రాణ రక్షణ కోసం ఈ మినహాయింపు ఇచ్చారు. వీరు మినహా దేశంలోని ఏ సాధారణ పౌరుడైనా సరే నడుస్తున్న కారులో సన్‌షేడ్స్ వాడితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. ఈ చలాన్ మొత్తం వివిధ రాష్ట్రాల నిబంధనలను బట్టి రూ.500 నుంచి గరిష్టంగా రూ.5,000 వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications