వచ్చీ రాగానే టాప్ గేర్.. విన్ ఫాస్ట్ స్పీడ్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే.. బిత్తరపోయి చూస్తున్న హ్యుందాయ్, కియా
భారత ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త కంపెనీ పెను సంచలనం సృష్టించింది. కేవలం మూడు నెలల క్రితమే దేశీ మార్కెట్లోకి అడుగుపెట్టిన వియత్నాం దిగ్గజం విన్ ఫాస్ట్ (VinFast), తన దూకుడుతో దిగ్గజ సంస్థలైన హ్యుందాయ్, కియా, బీఎమ్‌డబ్ల్యూలను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2025 డిసెంబర్ నాటికి టాప్-4 ఈవీ తయారీదారుగా ఎదిగి, భారత మార్కెట్లో తనదైన ముద్ర వేసింది.
డిసెంబర్ సేల్స్‌లో సరికొత్త రికార్డు
వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం (డిసెంబర్ 29, 2025 వరకు), విన్ ఫాస్ట్ డిసెంబర్ నెలలో 321 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా, దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. ఈ సేల్స్ కేవలం ప్రీమియం మోడళ్లయిన VF6, VF7 ద్వారానే వచ్చాయి.

ఇదే సమయంలో దేశంలో ఎంతో కాలంగా ఉన్న హ్యుందాయ్ (238 యూనిట్లు), కియా (272 యూనిట్లు), లగ్జరీ కార్ల దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ (300 యూనిట్లు) విన్ ఫాస్ట్ కంటే వెనుకబడిపోయాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ 5,231 యూనిట్లతో మొదటి స్థానంలో ఉండగా, జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (3,054), మహీంద్రా (2,600) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
విన్ ఫాస్ట్ సక్సెస్ సీక్రెట్
అదిరిపోయే మోడళ్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విన్ ఫాస్ట్ కార్లు విదేశీ టెక్నాలజీతో, మేక్ ఇన్ ఇండియా సపోర్ట్ తో వస్తున్నాయి.
VinFast VF6: ఇది 16.49 లక్షల రూపాయల ప్రారంభ ధరతో లభిస్తోంది. ఇందులో 59.6 kWh బ్యాటరీ ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 468 కి.మీ రేంజ్ ఇస్తుంది. 201 bhp పవర్‌తో ఈ కారు పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది.

VinFast VF7: ఇది మరింత ప్రీమియం మోడల్. దీని ధర రూ. 20.89 లక్షల నుంచి 25.49 లక్షల వరకు ఉంది. ఇది ఏకంగా 532 కి.మీ రేంజ్ (70 kWh బ్యాటరీ) ఇస్తుంది.విన్ ఫాస్ట్ తన తదుపరి అస్త్రాన్ని ఫిబ్రవరి 2026లో ప్రయోగించబోతోంది. అదే లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఇది 7-సీటర్ వాహనంగా వస్తోంది.
దీనిలో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ మీద 450 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇది నేరుగా BYD ఇ-మాక్స్ 7, కియా కారెన్స్ ఈవీలతో తలపడనుంది. దీని ధర సుమారు రూ.19.90 లక్షల నుంచి రూ.23.90 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

బడ్జెట్ ఈవీగా VF3
సామాన్యుల కోసం విన్ ఫాస్ట్ VF3 అనే మైక్రో-ఎస్‌యూవీని కూడా సిద్ధం చేస్తోంది. దీని ధర రూ. 7.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇది ఎంజీ కామెట్ ఈవీ, టాటా టియాగో ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో విన్ ఫాస్ట్ తన భారీ ప్లాంట్‌ను 400 ఎకరాల్లో నిర్మించింది. దీని కోసం కంపెనీ సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16,000 కోట్లు) పెట్టుబడి పెట్టింది.
తాజాగా మరో 200 హెక్టార్ల భూమిని కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇక్కడ ఏడాదికి 1.5 లక్షల కార్లను తయారు చేయడమే కాకుండా, 2026 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఉత్పత్తి చేయాలని విన్ ఫాస్ట్ ప్లాన్ చేస్తోంది. స్థానికంగా తయారీ జరపడం వల్ల విన్ ఫాస్ట్ కార్లపై ట్యాక్స్ తగ్గి, కస్టమర్లకు తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు అందుతున్నాయి.


Click it and Unblock the Notifications








