పెద్ద కుటుంబాలకు పండగే.. కి.మీకు రూ.1.50 ఖర్చుతో కొత్త 7-సీటర్ EV.. 30 నిమిషాల్లో ఛార్జ్, 500KM రేంజ్
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్న విన్‌ఫాస్ట్ (VinFast), ఇప్పుడు భారత మార్కెట్లో కూడా తన ప్రభావాన్ని విస్తరించేందుకు దూసుకెళ్తోంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ఇటీవలే భారతదేశంలో అడుగుపెట్టినప్పటికీ, తక్కువ సమయంలోనే వినియోగదారుల దృష్టిని ఆకర్షించగలిగింది. ఇప్పటికే కంపెనీ తన లైనప్‌లో భాగంగా VinFast VF 6, VinFast VF 7 వంటి ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ రెండు మోడళ్లతో SUV సెగ్మెంట్‌లో స్థిరపడే ప్రయత్నం చేసిన విన్‌ఫాస్ట్, ఇప్పుడు కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మరో కీలక మోడల్‌ను పరిచయం చేసింది. అదే విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 (VinFast VF MPV 7).
ఈరోజు (ఏప్రిల్ 15) అధికారికంగా విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ MPV, కంపెనీ భారత వ్యూహంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు. మూడు వరుసల సీటింగ్ అమరికతో రూపొందించిన ఈ వాహనం, పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. మొత్తం 7 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా ఇందులో విస్తృతమైన క్యాబిన్ స్పేస్‌ను అందించారు. డిజైన్ పరంగా చూస్తే, ఈ MPV ఆధునిక లుక్స్‌తో పాటు ప్రాక్టికాలిటీని కూడా కలగలిపినట్లు కనిపిస్తోంది.

VinFast VF MPV 7 భారత మార్కెట్లో ప్రీమియం 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీగా ప్రవేశించింది. దీన్ని రూ. 24.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించడం గమనార్హం. డిజైన్ విషయానికి వస్తే, ఈ కొత్త MPV బాక్సీ స్టైలింగ్‌తో ప్రాక్టికాలిటీని ముందుకు తీసుకువస్తూనే, ఆధునిక లుక్‌ను కూడా కలిపింది. ముందు విన్‌ఫాస్ట్ లోగోతో కలిసిపోయే సన్నని OLED లైట్ బార్‌లు, అలాగే LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు వాహనానికి స్పోర్టీ టచ్‌ను ఇస్తాయి.
పక్కవైపు 19-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, వెనుక కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు ఇవ్వడం వల్ల మొత్తం డిజైన్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో కూడా కంపెనీ సౌకర్యం, స్టైల్‌పై దృష్టి పెట్టింది. క్యాబిన్ నలుపు-గోధుమ కలర్ కాంబినేషన్ లేదా పూర్తిగా నలుపు థీమ్‌లో అందుబాటులో ఉంటుంది. అన్ని సీట్లకు లెదరెట్ అప్హోల్స్టరీ ఇవ్వడం, ప్రతి ప్రయాణికుడికి త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ అందించడం వంటి అంశాలు భద్రత, కంఫర్ట్‌ను పెంచుతాయి.

డాష్‌బోర్డ్‌లో ప్రధాన ఆకర్షణగా 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ స్క్రీన్ ద్వారా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సమాచారం, అలాగే క్లైమేట్ కంట్రోల్ వంటి ఫంక్షన్లను నియంత్రించవచ్చు. అదనంగా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కూడా ఇందులో చేర్చారు. VinFast VF MPV 7 పనితీరు పరంగా కూడా ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.
ఇందులో 60.13 kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీకి ముందు యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ జతచేయబడింది. ఈ మోటార్ గరిష్టంగా 204 hp శక్తి, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు, ఇది నగర డ్రైవింగ్‌తో పాటు హైవే ప్రయాణాల్లో కూడా స్మూత్, పవర్‌ఫుల్ అనుభవాన్ని అందిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఈ EV వెనుకబడదు.

కంపెనీ ప్రకారం, ఇది 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 9 సెకన్లలోపు చేరుకోగలదు. పూర్తి ఛార్జ్‌పై ARAI ధృవీకరించిన 517 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. డ్రైవింగ్ అవసరాలను బట్టి ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. చార్జింగ్ విషయానికొస్తే, 80kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని 10% నుంచి 70% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
VinFast VF MPV 7 ఇప్పటికే మార్కెట్లో మంచి స్పందనను అందుకుంటోంది. దీనికోసం బుకింగ్‌లు జరగుతున్నాయి. ఆసక్తిగల వినియోగదారులు విన్‌ఫాస్ట్ అధికారిక డీలర్‌షిప్‌లు లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ.21,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇక రన్నింగ్ కాస్ట్ విషయానికి వస్తే, అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. కానీ అంచనాల ప్రకారం, ఈ కారును ఒక కిలోమీటరు నడపడానికి ఖర్చు సుమారు రూ. 1.50 వరకు మాత్రమే ఉండొచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








