కారు కొనేవారు కాస్త ఆగండి.. చిన్న కారు నుంచి 7-సీటర్ వరకూ.. దూసుకొస్తున్న విన్‌ఫాస్ట్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇటీవల భారత మార్కెట్లో తన అడుగులు బలంగా వేస్తోంది. ఈ కంపెనీ సెప్టెంబర్ 2025లో అధికారికంగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త ఊపుని తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేలా VF6, VF7 అనే రెండు ఆధునిక ఎలక్ట్రిక్ SUVలును కూడా విడుదల చేసింది. ఈ మోడళ్ల ద్వారా విన్ ఫాస్ట్ భారత EV మార్కెట్లో తన సీరియస్ ఉద్దేశాలను స్పష్టంగా చూపించింది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను అందించేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, త్వరలోనే లిమో గ్రీన్, VF3, VF5 వంటి కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి విన్ ఫాస్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.
Limo Green: విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్‌ను ఈ ఫిబ్రవరిలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీని ధర రూ. 22 లక్షల నుంచి రూ. 26 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయానికి అందుబాటులో ఉన్న ఈ వాహనం, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. ఇందులో 7 సీట్లు ఉండటం వల్ల కుటుంబ సభ్యులు అందరూ సౌకర్యంగా కూర్చుని ప్రయాణించవచ్చు.

కొత్త లిమో గ్రీన్ MPVలో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 450 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందించగలదు. క్యాబిన్‌లో 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు అందించడం ద్వారా, లిమో గ్రీన్‌ను ఒక సురక్షితమైన ఎలక్ట్రిక్ MPVగా విన్‌ఫాస్ట్ రూపొందించింది.
Vinfast VF3: విన్‌ఫాస్ట్ వీఎఫ్3 ఈ సంవత్సరం మే నెలలో భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.50 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది తొలి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారి లక్ష్యంగా రూపొందించబడింది. ఆధునికమైన డిజైన్‌తో పాటు యువతను ఆకట్టుకునే కలర్స్ ఎంపికల్లో ఇది లభిస్తుంది.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, VF3లో 18.64 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 215 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందించగలదు. ఇందులో 4-సీట్ల లేఅవుట్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ AC వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం బహుళ ఎయిర్‌బ్యాగులు, రియర్ వ్యూ కెమెరా ఇవ్వడం వల్ల, ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు భద్రతను కూడా ఇస్తుంది.
Vinfast VF5: విన్‌ఫాస్ట్ వీఎఫ్5 కూడా ఈ ఏడాది మే నెలలోనే విడుదల కానుంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఇది ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయానికి అందుబాటులో ఉండటంతో, డిజైన్, టెక్నాలజీ పరంగా మంచి గుర్తింపు సంపాదించింది. స్పోర్టీ లుక్‌తో పాటు ఆధునిక స్టైలింగ్‌తో యువతతో పాటు ఫ్యామిలీ యూజర్లను కూడా ఆకట్టుకునేలా రూపొందించారు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త VF5లో 29.6 kWh, 37.23 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. ఇవి పూర్తిగా ఛార్జ్ చేస్తే 269 కిలోమీటర్ల నుంచి 326 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలవు. ఇందులో 5-సీట్ల లేఅవుట్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








