రూ.5 లక్షల లోపు ఎలక్ట్రిక్ కారు.. చిన్నదే కానీ పవర్ మాత్రం గట్టిది! మిడిల్‌క్లాస్‌కు అదిరిపోయే EV
ప్రస్తుతం భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఇంకా ఎక్కువ మంది వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కార్లపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు సాధారణ మధ్యతరగతి కొనుగోలుదారులకు కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నాయి. దీనివల్ల దేశంలో ఈవీ కార్ల అమ్మకాలు ఆశించిన స్థాయికి చేరుకోవడం లేదు. ఇదే పరిస్థితిని గమనించిన అనేక ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ఇప్పుడు తక్కువ ధరల్లో కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడంపై దృష్టి పెట్టాయి. తక్కువ ధరతో పాటు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, నగర ప్రయాణాలకు సరిపోయే సైజుతో కార్లను అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి.
ఈ జాబితాలో వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్(VinFast) కూడా ఉంది. ప్రపంచ మార్కెట్‌లో తన స్థానం బలపరచుకోవాలని చూస్తున్న ఈ సంస్థ ఇప్పటికే భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత సంవత్సరం VF6, VF7 వంటి ఎలక్ట్రిక్ SUVలను ప్రదర్శించి భారత ఆటోమొబైల్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టిన విన్‌ఫాస్ట్, ఇప్పుడు మరింత సరసమైన ధర కలిగిన చిన్న ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి సిద్ధమవుతుంది.

గత కొన్నేళ్లుగా విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌ను అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా భారతీయ వినియోగదారులు ఎక్కువ మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, తక్కువ ధర వంటి అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో కంపెనీ అర్థం చేసుకుంది. అందుకే సాధారణ కుటుంబాలు కూడా సులభంగా కొనగలిగే ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వీఎఫ్3 (VF3).
VinFast VF3 ఇప్పటికే విదేశీ మార్కెట్లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సైజులో కనిపించినప్పటికీ, డిజైన్ మాత్రం పూర్తి SUV తరహాలో ఉంటుంది. బాక్సీ స్టైల్ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, కాంపాక్ట్ బాడీ కారణంగా నగరాల్లో డ్రైవింగ్ చేయడానికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే భారతీయ నగరాల్లో చిన్న ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉండటంతో, VF3 వంటి మోడల్‌కు డిమాండ్ ఉండనుంది.

ఈ కారులో ఆధునిక డిజిటల్ ఫీచర్లు, కనెక్టెడ్ టెక్నాలజీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. అలాగే రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్‌ను అందించేలా బ్యాటరీ సెటప్‌ను రూపొందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులు, చిన్న కుటుంబాలు లక్ష్యంగా ఈ కారును కంపెనీ తీసుకురావచ్చని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, VF3 కారును 2026లో భారత మార్కెట్‌లో విడుదల చేయచ్చు.
VinFast VF3 ఎలక్ట్రిక్ కారులో 18.6 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనితో పాటు 43.5 hp పవర్‌ను ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటార్‌ను కంపెనీ అందిస్తోంది. చిన్న సైజ్ అర్బన్ ఎలక్ట్రిక్ కారుగా రూపొందించిన ఈ మోడల్, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

ఈ బ్యాటరీ, మోటార్ సెటప్‌తో VF3 సుమారు 215 కిలోమీటర్ల వరకు ధృవీకరించబడిన రేంజ్‌ను అందిస్తుంది. ఇక VinFast భారత మార్కెట్ కోసం BaaSపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఒకవేళ VF3ను BaaS స్కీమ్‌తో భారతదేశంలో విడుదల చేస్తే, దీని ప్రారంభ ధర రూ.5 లక్షల కంటే కూడా తక్కువగా ఉండొచ్చని సమాచారం. అదే జరిగితే, ఇది భారత మార్కెట్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి కానుంది.


Click it and Unblock the Notifications