ఈ కొత్త కారుని చూసి వణికిపోతున్న దేశీయ కంపెనీలు.. సేఫ్టీలో టాటాకు సవాలు! క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టింది
వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటోంది. కొత్త బ్రాండ్ అయినప్పటికీ, ఆధునిక టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీపై స్పష్టమైన దృష్టి, భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం కారణంగా భారతీయ వినియోగదారుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే విన్‌ఫాస్ట్‌కు చెందిన VF 7 ఎలక్ట్రిక్ SUV తాజాగా ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. ఈ SUVను భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) పరీక్షించగా, అత్యున్నతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇది ప్రయాణికుల భద్రత విషయంలో ఈ కారు ఎంత బలంగా డిజైన్ చేయబడిందో స్పష్టంగా సూచిస్తోంది.
భారత్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందడం అంటే చిన్న విషయం కాదు. కఠినమైన క్రాష్ టెస్టులు, ప్రయాణికుల రక్షణ, పిల్లల భద్రత, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటి అనేక అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన కార్లకే ఈ రేటింగ్ లభిస్తుంది. VF7 అన్ని ప్రమాణాలను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా, విన్‌ఫాస్ట్ భద్రత విషయంలో రాజీ పడలేదని నిరూపించింది. ఈ రేటింగ్‌తో విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో స్థానం మరింత బలపరుచుకుంటుంది.

విన్‌ఫాస్ట్ VF 7 ఎంత బలమైన కారో భారత్ NCAP విడుదల చేసిన వివరాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ SUV పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్(AOP) విభాగంలో మొత్తం 32 పాయింట్లలో 28.54 పాయింట్లు సాధించగా, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో 49 పాయింట్లలో 45.25 పాయింట్లు నమోదు చేసింది. ఈ స్కోర్లు డ్రైవర్‌తో పాటు ప్రయాణించే పెద్దలు, పిల్లలు ఇద్దరికీ VF 7 అత్యున్నత స్థాయి రక్షణను అందిస్తుంది.
ఫ్రంటల్ ఇంపాక్ట్ పరీక్షలలో VF 7 అద్భుతమైన ప్రదర్శనను చూపించింది. డ్రైవర్, ముందు సీటులో కూర్చున్న ప్రయాణీకుల తల, మెడ, కాళ్ల రక్షణకు గరిష్టంగా 4 పాయింట్లు సాధించింది. ఇది భారత్ NCAP స్కేల్‌లో సాధ్యమైన అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంటే, ముందు నుంచి జరిగే ఢీకొన్న ప్రమాదాల్లో ప్రయాణికులకు గాయాలు తగ్గించేలా ఈ కారు బలంగా డిజైన్ చేయబడిందని అర్థం.

సైడ్ ఇంపాక్ట్ పరీక్షలలో కూడా VF 7 తన సేఫ్టీ స్టాండర్డ్స్‌ను మరోసారి రుజువు చేసింది. వయోజన ప్రయాణీకుల రక్షణ 16 పాయింట్లకు పూర్తి 16 పాయింట్లు, పిల్లల రక్షణ 8 పాయింట్లకు 8 పాయింట్లు సాధించింది. అంటే, పక్క నుంచి ఢీకొనే ప్రమాదాల్లో SUV అత్యుత్తమ రక్షణను అందిస్తుంది. అంతేకాదు, అత్యంత కఠినంగా పరిగణించబడే పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్లో VF 7 మంచి ఫలితాలను నమోదు చేసింది.
ఈ పరీక్షలో తల గాయం అంచనా విలువలు వరుసగా 109, 131గా నమోదయ్యాయి. ఇవి భారత్ NCAP నిర్దేశించిన క్రిటికల్ లిమిట్ 700 కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. దీని అర్థం, అత్యంత ప్రమాదకరమైన క్రాష్ పరిస్థితుల్లో కూడా VF 7 ప్రయాణికుల తలకు సమర్థవంతమైన రక్షణను అందించగలదని స్పష్టంగా తెలుస్తోంది.

ఈ కారులో అందించిన సేఫ్టీ ఫీచర్స్‌ను చూసినట్లయితే, కారులో మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉండటం వల్ల, డ్రైవర్‌తో పాటు ప్రయాణించే ప్రతి వ్యక్తికి అధిక స్థాయి రక్షణ లభిస్తుంది. ఈ SUVలో ఆధునిక స్మార్ట్ ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్రైవర్ లేన్ మారుస్తున్నప్పుడు సహాయం చేసే ఆటో లేన్ ఛేంజింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








