స్కూటర్ల నుంచి బస్సుల వరకు.. రూ.4,000 కోట్ల పెట్టుబడి.. లక్షన్నర కార్ల తయారీ లక్ష్యంగా వియత్నం కంపెనీ
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లోకి అత్యంత వ్యూహాత్మకంగా అడుగుపెడుతోంది. కేవలం కార్లను అమ్మి వెళ్ళిపోవడానికి కాకుండా, ఇక్కడ ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. ఇటీవల డ్రైవ్‌స్పార్క్ రివ్యూస్ ఎడిటర్ ప్రోమీత్ ఘోష్ వియత్నాంలోని విన్‌ఫాస్ట్ ప్రధాన తయారీ కేంద్రమైన హై ఫాంగ్‌ను సందర్శించారు. అక్కడ ఆయన చూసిన రోబోటిక్ టెక్నాలజీ, అత్యాధునిక తయారీ విధానం విన్‌ఫాస్ట్ అంతర్జాతీయ స్థాయిని చాటి చెబుతున్నాయి. సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌ను కేవలం 21 నెలల్లోనే నిర్మించారంటే, ఆ సంస్థ వేగం, పట్టుదల ఏంటో అర్థం చేసుకోవచ్చు.
భారతదేశంలో విన్‌ఫాస్ట్ భారీ పెట్టుబడి
విన్‌ఫాస్ట్ సంస్థ తమిళనాడులోని తూత్తుకుడిలో సుమారు 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,000 కోట్లు) పెట్టుబడితో ఒక భారీ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. మొదట్లో ఏటా 50,000 వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, డిమాండ్‌ను బట్టి దీన్ని 1,50,000 వాహనాల వరకు పెంచే అవకాశం ఉంది. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, తెలంగాణ ప్రభుత్వంతో కూడా విన్‌ఫాస్ట్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్మార్ట్ అర్బన్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ టాక్సీ ఫ్లీట్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.

అత్యాధునిక కార్లు
భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ తన VF 6, VF 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో ఎంట్రీ ఇస్తోంది. ఈ కార్లను ప్రపంచ ప్రసిద్ధ ఇటాలియన్ డిజైన్ సంస్థ టొరినో డిజైన్ రూపొందించింది. ఇవి చూడటానికి అత్యంత విలాసవంతంగా ఉండటమే కాకుండా, పర్ఫార్మెన్స్ లోనూ అదరగొడుతున్నాయి. వీటిలో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌లను వాడారు. ఇవి సింగిల్ ఛార్జ్‌పై 510 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. కేవలం 25 నిమిషాల్లోనే 10 నుండి 70 శాతం వరకు ఛార్జింగ్ ఎక్కేలా 100 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేస్తాయి. లెవెల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండటం విశేషం.
మొబిలిటీ-యాజ్-ఏ-సర్వీస్ (MaaS), విస్తరణ
విన్‌ఫాస్ట్ కేవలం కార్ల తయారీతో ఆగిపోవడం లేదు. తన మాతృసంస్థ విన్‌గ్రూప్ (Vingroup) సహకారంతో భారతదేశంలో ఒక పూర్తిస్థాయి ఈవీ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనుకుంటోంది. గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ ద్వారా ఎలక్ట్రిక్ టాక్సీలను ప్రవేశపెట్టడం, స్కూటర్లు, ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందుబాటులోకి తేవడం వీరి ప్లాన్. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 డీలర్‌షిప్‌లను ప్రారంభించిన విన్‌ఫాస్ట్, త్వరలోనే ఆ సంఖ్యను 75కి చేర్చాలని చూస్తోంది. సర్వీస్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం క్యాస్ట్రోల్, మై టీవీఎస్ వంటి సంస్థలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

భారతదేశంలోని విపరీతమైన వేడి, గుంతల రోడ్లు, ఇక్కడి డ్రైవింగ్ అలవాట్లకు అనుగుణంగా తమ వాహనాలను విన్‌ఫాస్ట్ రీ-ఇంజనీరింగ్ చేస్తోంది. స్థానికంగానే తయారీ చేపట్టడం వల్ల ధరలను కూడా పోటీగా ఉంచే అవకాశం ఉంది. అలాగే ఇక్కడి నుంచే ఇతర దేశాలకు వాహనాలను ఎగుమతి చేసే ప్లాన్ కూడా ఉంది. విన్‌ఫాస్ట్ రాకతో భారత ఈవీ మార్కెట్లో పోటీ పెరగడమే కాకుండా, వినియోగదారులకు అత్యుత్తమ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. విన్‌ఫాస్ట్ చూపుతున్న ఈ వేగం, పెట్టుబడులు చూస్తుంటే వారు ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు రాణించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications








