ఇదేంటి మామ..ఒకప్పుడు 1 కారు..ఇప్పుడేమో ఏకంగా 3300 శాతం సేల్స్ గ్రోత్..చరిత్రలోనే విడ్డూరం
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) ప్రస్తుతం భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కంపెనీ అమ్మకాల గణాంకాలను గమనిస్తే.. ఒక మోడల్ ఏకంగా 3300 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఓవరాల్‌గా కంపెనీ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు.
జనవరి 2026 విక్రయాల డేటా ప్రకారం.. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన వార్షిక విక్రయాల్లో 19 శాతం క్షీణతను చవిచూసింది. గతేడాది ఇదే నెలలో 3344 కార్లను విక్రయించగా, ఈసారి మాత్రం కేవలం 2710 యూనిట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫోక్స్‌వ్యాగన్ విక్రయాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం టిగువాన్ (Tiguan) ఎస్‌యూవీ గురించి. గతేడాది జనవరి 2025లో ఈ మోడల్ కేవలం ఒక్కటంటే ఒక్క యూనిట్ మాత్రమే అమ్ముడైంది.

అయితే ఈ ఏడాది జనవరి 2026లో ఏకంగా 34 యూనిట్లు విక్రయించబడ్డాయి. సంఖ్య పరంగా ఇది తక్కువగా అనిపించవచ్చు కానీ, గణాంకాల లెక్కన చూస్తే ఇది ఏకంగా 3300 శాతం వృద్ధి. ఇలాంటి రికార్డు వృద్ధి ఏ కంపెనీకైనా గర్వకారణమే అయినా, ఇతర మోడళ్ల వైఫల్యం వల్ల కంపెనీ ఓవరాల్ గ్రాఫ్ మాత్రం కిందకే పడిపోయింది.
కంపెనీకి ప్రధాన బలంగా ఉన్న వర్టీస్ (Virtus) సెడాన్ నిలకడగా రాణిస్తోంది. ఇది జనవరి 2025లో 1795 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 1881 యూనిట్ల అమ్మకాలతో 5 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. కానీ, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న టైగూన్ (Taigun) పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.

టైగూన్ గతంలో 1548 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి కేవలం 790 యూనిట్లకే పరిమితమైంది. అంటే ఏకంగా 48 శాతం భారీ క్షీణతను చూసింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టైరాన్ (Tayron) కేవలం 5 యూనిట్లతో తన ఖాతా తెరిచింది. ఇక ఐకానిక్ మోడల్ గోల్ఫ్ (Golf) ఇంకా ఖాతా తెరవాల్సి ఉంది.
ప్రస్తుత అమ్మకాల క్షీణతను అధిగమించేందుకు ఫోక్స్‌వ్యాగన్ భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. 2026లో ఏకంగా ఐదు కొత్త మోడళ్లను భారత రోడ్లపైకి తీసుకురావాలని కంపెనీ నిశ్చయించుకుంది.
టైరాన్ R-లైన్ (Tayron R-Line): ఇది ఫోక్స్‌వ్యాగన్ నుంచి రాబోతున్న అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ. ప్రస్తుతం ఉన్న టిగువాన్ ఆల్‌స్పేస్ స్థానంలో ఇది రానుంది. స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి 2.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌తో ఇది సిద్ధమవుతోంది.

వర్టీస్ ఫేస్‌లిఫ్ట్: ఇప్పటికే సెడాన్ విభాగంలో రారాజుగా ఉన్న వర్టీస్ను మరింత స్టైలిష్‌గా మార్చబోతున్నారు. హ్యుందాయ్ వెర్నాకు గట్టి పోటీ ఇవ్వడానికి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, కొత్త లుక్‌తో ఇది రాబోతోంది.
టైగూన్ ఫేస్‌లిఫ్ట్: అమ్మకాలు తగ్గిన టైగూన్‌కు కొత్త ఊపిరి పోసేందుకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రానుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, బెటర్ ఇంటీరియర్, మరిన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి.
ID.4 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో సత్తా చాటడానికి ఫోక్స్‌వ్యాగన్ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ID.4ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇది లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో కీలక పాత్ర పోషించనుంది.
ఫోక్స్‌వ్యాగన్ టెర్రా (VW Terra): ఇది కంపెనీకి అత్యంత కీలకమైన మోడల్ కాబోతోంది. ఇది 4 మీటర్ల లోపు ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీ. టాటా నెక్సాన్, మారుతీ బ్రెజ్జా వంటి కార్లతో పోటీ పడటానికి, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో స్కోడా కైలక్ ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు.
ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు తగ్గడానికి ఒక ప్రధాన కారణం ఇంధన నిబంధనలు. ప్రస్తుతం మార్కెట్లో E20 (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్ వినియోగం పెరుగుతోంది. పాత స్టాక్ కార్లు ఈ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల కస్టమర్లు కొత్త మోడళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
దీనికి తోడు ఇతర బ్రాండ్ల నుంచి వస్తున్న గట్టి పోటీ వల్ల జర్మన్ దిగ్గజం తన మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తోంది. అయితే, రాబోయే ఐదు కొత్త మోడళ్లు కంపెనీ అదృష్టాన్ని మారుస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








