ఫోక్స్‌వ్యాగన్ నుంచి సర్‌ప్రైజ్ రెడీ.. టైగన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్! లాంచ్‌కు ముందే హైప్
భారతదేశంలోని మధ్య తరహా SUV మార్కెట్‌లో పోటీ రోజురోజుకు పెరుగుతున్న వేళ, ఆ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకోవడానికి ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) సిద్ధమవుతోంది. ఇప్పటికే తక్కువ ధర, బలమైన నిర్మాణం, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవంతో మంచి పేరు తెచ్చుకున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Taigun) ఇప్పుడు కొత్త రూపంతో మరోసారి మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అధికారికంగా విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 9న లాంచ్‌కు సిద్ధమవుతున్న ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికే తన చాకన్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించడం గమనించదగ్గ విషయం. దీని ద్వారా, ఈ కొత్త మోడల్‌పై కంపెనీకి ఉన్న నమ్మకం, అలాగే మార్కెట్‌లో దాని కోసం ఉన్న డిమాండ్ స్పష్టమవుతోంది.
2021లో భారత మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌కు ఇది మొదటి పెద్ద అప్‌డేట్ కావడం ప్రత్యేకత. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్ పరంగా గణనీయమైన మార్పులు చేయబడ్డాయి. కొత్త స్టైలింగ్ ఎలిమెంట్స్, మరింత అగ్రెసివ్ లుక్, ఆధునిక టచ్ కలిపి ఈ SUVను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇది కేవలం బయట లుక్‌లో మాత్రమే మార్పులు కాదు; లోపల కూడా అనేక కొత్త ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీ ఇచ్చారు.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ మరింత స్పోర్టీగా, ప్రీమియంగా కనిపిస్తోంది. ముందుభాగంలో కొత్త బంపర్‌ను డిజైన్ చేశారు. ఇది కొంచెం బయటికి పొడుచుకు వచ్చిన "చిన్" స్టైల్‌తో ఉండటంతో SUVకి అగ్రెసివ్ లుక్ వస్తోంది. బంపర్‌పై పెద్ద నిలువు స్లాట్‌లు, క్రోమ్ టచ్‌లు ఉండటం దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అలాగే కొత్త హెడ్‌ల్యాంప్‌లు LED ఎలిమెంట్‌తో కనెక్ట్ అయి ఉండటం, మధ్యలో వెలిగే ఫోక్స్‌వ్యాగన్ లోగో ఉంటుంది.
ఈ డిజైన్‌లో చాలా భాగం GT ట్రిమ్ నుంచి ఇన్‌స్పైర్ అయినట్టు కనిపిస్తోంది. కొన్ని చోట్ల క్రోమ్‌ను గ్లాస్-బ్లాక్ ఫినిషింగ్‌తో మార్చడం వల్ల మరింత స్పోర్టీ ఫీల్ వచ్చింది. ముఖ్యంగా 2026 GT వేరియంట్‌లో బ్లాక్ ఫ్రంట్ డిఫ్యూజర్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ORVM హౌసింగ్, రూఫ్ రైల్స్ కలిసి ఒక స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. అదనంగా ఫ్రంట్ గ్రిల్, డోర్లపై ఎరుపు రంగులో 'GT' బ్యాడ్జ్‌లు ఉంటాయి.

ఇక నాన్-GT వేరియంట్లలో మాత్రం కొంచెం సాఫ్ట్, ప్రీమియం లుక్‌పై దృష్టి పెట్టారు. ఇందులో సిల్వర్ ఫ్రంట్ డిఫ్యూజర్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ రూఫ్ రైల్స్ వంటి అంశాలు కనిపిస్తాయి. ఇవి ఈ వేరియంట్‌ను క్లాసిక్, ఎలిగెంట్‌గా చూపించేలా రూపొందించబడ్డాయి.ఈ ఫేస్‌లిఫ్ట్‌కు నలుపు రంగు లోయర్-బాడీ క్లాడింగ్, వీల్ ఆర్చ్‌లు జోడించడం వల్ల మరింత మస్కులర్ లుక్ వచ్చింది.
వెనుక భాగాన్ని కంపెనీ ఇంకా పూర్తిగా బయటపెట్టకపోయినా, సవరించిన LED టెయిల్ ల్యాంప్‌లు, వెలిగే వోక్స్‌వ్యాగన్ లోగో వంటి ఆధునిక ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంటీరియర్ విషయానికి వస్తే, అధికారిక చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. పనోరమిక్ సన్‌రూఫ్, మసాజింగ్ రియర్ సీట్లు, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇవ్వొచ్చని అంచనా.

అదనంగా, కూలింగ్ పనితీరును మెరుగుపరచడానికి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే పెద్ద మార్పులు ఉండవు. ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఆప్షన్‌లే కొనసాగనున్నాయి. 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ TSI ఇంజిన్, 1.5 TSI ఇంజిన్‌తో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కొనసాగనుంది.
ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.11.42 లక్షల నుంచి రూ.19.19 లక్షల మధ్య ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఇందులో కొంత పెరుగుదల ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, డిజైన్, ఫీచర్లలో పెద్ద మార్పులతో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో మళ్లీ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications








