టాటాకు సవాలు విసిరిన ఎలక్ట్రిక్ కారును కొనడానికి పోటీ పడుతున్నారు! డిమాండ్ ఊహించని స్థాయిలో!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ, ఎక్కువ మంది వినియోగదారులు ఈవీ వైపు మళ్లుతున్నారు. సాధారణంగా ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది టాటా మోటార్స్ (Tata Motors). ఎందుకంటే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో ఇప్పటికీ టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఒక ప్రత్యేక మోడల్ స్థాయిలో చూస్తే, ఈ కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రిక్ కార్ మోడల్‌గా ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) నిలుస్తోంది. ఎంజీ విండ్సర్ (MG Motor) తీసుకువచ్చిన ఈ మోడల్, తన ప్రత్యేక డిజైన్, ఆధునిక ఫీచర్లు, అలాగే వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరతో విపరీతమైన ఆదరణను సంపాదించింది.
ఫ్యామిలీ యూజ్‌కు సరిపడే స్పేస్, కంఫర్ట్,ఎలక్ట్రిక్ డ్రైవింగ్ సౌలభ్యం కలిపి ఈ కారును విభిన్న వర్గాల వినియోగదారులకు ఆకర్షణీయంగా మార్చాయి. 2026 మార్చి నెలలో మాత్రమే సుమారు 4,530 యూనిట్ల ఎంజీ విండ్సర్ ఈవీ కార్లు భారతదేశంలో అమ్ముడయ్యాయి. ఒకే నెలలో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం అంటే ఆ మోడల్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్పేస్తుంది.

ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, విండ్సర్ ఈవీ తన స్థానం నిలబెట్టుకోవడమే కాకుండా మరింత ముందుకు దూసుకుపోతుండటం విశేషం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొత్తం కంపెనీ స్థాయిలో టాటా మోటార్స్ ముందుండగా, ఒకే మోడల్ స్థాయిలో మాత్రం ఎంజీ మోటార్స్ విండ్సర్ ఈవీ ముందంజలో ఉంది. అంటే వినియోగదారులు కేవలం బ్రాండ్‌ను మాత్రమే కాకుండా, ప్రతి మోడల్ అందించే విలువను కూడా బాగా పరిశీలిస్తున్నారని అర్థం.
ఒకప్పుడు ఫ్యూయల్ కార్లపై ఆధారపడిన ఈ కంపెనీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు సేల్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2026 మార్చిలో ఎంజీ మోటార్ మొత్తం 6,528 కార్లను విక్రయించింది. ఈ అమ్మకాలలో భారీ భాగం ఎలక్ట్రిక్ కార్లదే. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో మూడు ఫ్యూయల్ కార్ మోడళ్లు, మూడు ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను విక్రయిస్తున్నప్పటికీ, మొత్తం 6,528 యూనిట్లలో 5,623 యూనిట్లు కేవలం ఎలక్ట్రిక్ కార్లే కావడం విశేషం.

ఫ్యూయల్ కార్ల అమ్మకాలు కేవలం 905 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ లెక్కన వినియోగదారులు ఎంజీ బ్రాండ్‌ను ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా చూడడం ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే కంపెనీ మొత్తం అమ్మకాలు 31.69% పెరిగాయి. అయితే ఈ వృద్ధిలో అసలు పాత్ర పోషించింది ఎలక్ట్రిక్ సెగ్మెంట్. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఏకంగా 54.39% పెరగడం, మార్కెట్లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
మరోవైపు, ఫ్యూయల్ కార్ల అమ్మకాలు మాత్రం 31.18% తగ్గడం గమనార్హం. అంటే, వినియోగదారులు సంప్రదాయ ఇంధన కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్నారని చెప్పొచ్చు. ఈ భారీ మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటి MG Windsor EV. 2024లో విడుదలైనప్పటి నుండి ఈ మోడల్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్‌గా నిలుస్తోంది.

విండ్సర్ ఈవీ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 18.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అయితే BAS ఆప్షన్‌లో కేవలం రూ. 9.99 లక్షల ధరతోనే కొనుగోలు చేయవచ్చు. ప్రతి కిలోమీటరుకు రూ. 3.50 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 38 kWh, 52.9 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది పూర్తి ఛార్జ్‌పై 332 నుంచి 449 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications








