ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. చుట్టుపక్కల ఊర్లన్నీ చుట్టేసి రావచ్చు.. అందుకే యూత్ దీని వెంట పడుతున్నారు
పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఛార్జింగ్ టైమ్, రేంజ్ గురించి ఇంకా సందేహాలు ఉన్నాయి... ఈ రెండింటి మధ్య ఇరుక్కున్నవారికి ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. జపాన్ దిగ్గజం Yamaha నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో నెమ్మదిగా కానీ స్ట్రాంగ్‌గా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోని ఈ మోడల్... ఇప్పుడు అమ్మకాలలో డబుల్ స్పీడ్ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైల్, రేంజ్, బ్రాండ్ నేమ్ ఇలా అన్నీ కలిపి చూస్తే ఇది మిడ్‌రేంజ్ EV సెగ్మెంట్‌లో గేమ్ చెంజర్ అవుతుందా అన్న చర్చ మొదలైంది.
ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతం భారతదేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రారంభంలో ఈ రంగంలో స్టార్టప్‌లు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఇప్పుడు ప్రధాన పారిశ్రామిక దిగ్గజాలు కూడా రంగంలోకి దిగాయి. బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు ఇప్పటికే EV మార్కెట్‌ను శాసిస్తుండగా, జపాన్ దిగ్గజం యమహా కూడా ఈ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. యమహా మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ప్రస్తుతం భారతీయ రహదారులపై సంచలనం సృష్టిస్తోంది. అమ్మకాల పరంగా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ స్కూటర్ గురించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.

యమహా మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పుడు భారీగా అంచనాలు ఉన్నాయి. కానీ నెలలో కేవలం 92 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఆ సంఖ్య రెండవ నెల నాటికి ప్రత్యేకంగా మార్చి 2026 నాటికి అమ్మకాలు 232 యూనిట్లకు పెరిగింది. ఇది అమ్మకాలలో రెండింతలకు పైగా పెరుగుదలను సూచిస్తుంది. ప్రస్తుతం, ఈ స్కూటర్ సెలక్ట్ చేసిన కొన్ని నగరాల్లోని బ్లూ స్క్వేర్ ప్రీమియం షోరూమ్‌ల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో అందుబాటులోకి వస్తే, అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
యమహా EC-06 ఒక అగ్రశ్రేణి వాహనంగా నిలుస్తుంది, ఇది చూడటానికి అందంగా ఉండటమే కాకుండా పనితీరులో కూడా రాణిస్తుంది. ఇది 4 kWh ఫిక్స్‌డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనికి 4.5 kW ఎలక్ట్రిక్ మోటార్ జత చేయబడింది. ఫలితంగా ఈ స్కూటర్ గరిష్టంగా 8.98 bhp అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ధైర్యంగా చెబుతోంది. ఈ రేంజ్ రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు లేదా నగర ప్రయాణ అవసరాలకు సరిపోతుంది. అంతేకాకుండా దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.

ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిని సాధారణ ప్లగ్-ఇన్ సిస్టమ్‌ను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. 4 kWh బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 9 గంటల సమయం పడుతుంది. మీరు రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెడితే, ఉదయానికల్లా మీ వాహనం ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్కూటర్ మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. రైడర్ల సౌలభ్యం కోసం ముఖ్యంగా ఇరుకైన పార్కింగ్ స్థలాల నుంచి వాహనాన్ని బయటకు తీయడానికి వీలుగా రివర్స్ మోడ్ కూడా చేర్చారు.
యమహా EC-06 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.67 లక్షలు. ఈ ధర కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ, ఈ స్కూటర్‌లో పొందుపరిచిన విశేషాలు ఆ ధరకు పూర్తి న్యాయం చేస్తాయి. LED హెడ్‌లైట్లు, టెయిల్ ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన టర్న్ ఇండికేటర్లు వీటితో పాటు రంగుల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ స్కూటర్‌కు ఒక ప్రీమియం లుక్ ఇస్తాయి. సీటు కింద 24.5 లీటర్ల విశాలమైన స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ ఉంది, ఇందులో హెల్మెట్ లేదా ఇతర వ్యక్తిగత వస్తువులను సులభంగా భద్రపరచవచ్చు. డిజిటల్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ స్కూటర్‌లో ఇన్ బిల్డ్ టెలిమాటిక్స్ యూనిట్‌తో పాటు SIM-ఆధారిత కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.

ఈ స్కూటర్ తయారీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. భారతీయ EV స్టార్టప్ అయిన River India అభివృద్ధి చేసిన ప్లాట్‌ఫారమ్‌పై Yamaha, EC-06 మోడల్‌ను రూపొందించింది. River India ఉత్పత్తులతో డిజైన్ పరంగా కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, యమహా తనదైన ప్రత్యేక శైలి అంశాలను జోడించి, ఈ స్కూటర్ ఆకర్షణను మరింత పెంచింది. ప్రస్తుతం Yamaha EC-06 మార్కెట్లో Bajaj Chetak, TVS iQube, Ather Rizta వంటి బలమైన పోటీదారులతో నేరుగా తలపడుతోంది. రాబోయే రోజుల్లో దీని అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications