Car Sales దేశంలో ఈ కార్లకు పిచ్చ క్రేజ్.. ఫిబ్రవరిలో ఎక్కువగా వీటినే కొనేశారు.!!
భారత్‌లో క్రమంగా ప్యాసింజర్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి(February Car Sales) నెలలో దేశవ్యాప్తంగా 3,72,178 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల విక్రయాలు నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే వృద్ధి శాతం పెరిగింది. 2023లో ఫిబ్రవరిలో 3,34,245 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే సేల్ అయ్యాయి.
ఫిబ్రవరి 2024లో భారతీయ ప్యాసింజర్ వాహన విభాగం దాదాపు 11.3 శాతం అమ్మకపు వృద్ధిని సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ సేల్స్ జాబితాలో ఏ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యోయో తెలుసా.?? ఫిబ్రవరి 2024లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్ల మోడల్స్ ధరతో పాటు ఫిబ్రవరి నెలలో ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి అనే పూర్తి సమాచారం ఈ కథనంలో..

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Wagon R): ఎప్పటిలాగే, ఈ కారు ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ మోడల్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. వ్యాగన్ఆర్ ఫిబ్రవరి 2024లో 19,412 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇది గతేడాది ఫిబ్రవరి కంటే 15 శాతం ఎక్కువ. అప్పుడు 16,889 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి.
భారతీయులు ఈ కారును దాల్-బాయ్ (పొడవైన అబ్బాయి) అని పిలుస్తారు. ఈ కారులో ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ. 5.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు పెట్రోల్ మరియు CNG రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

టాటా పంచ్(Tata Punch): టాటా మోటార్స్ నుంచి చౌకైన కార్ మోడల్‌లలో టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ ఒకటి. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది. భద్రతా పరంగా అధిక ఫీచర్లను కలిగి ఉండటంతో.. ఈ మైక్రో ఎస్‌యూవీ కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.
గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. కాగా 2024 ఫిబ్రవరి నెలలో 18,438 యూనిట్ల పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. పంచ్ EV ధర రూ. 11 లక్షల బేస్ ధర నుంచి ప్రారంభం కాగా.. పెట్రోల్ మరియు CNG ఆప్షన్లలో రూ. 6.12 లక్షల ప్రారంభ ధరతో ఉంది.

మారుతి సుజుకి బాలెనో(Maruti Suzuki Baleno): భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న 3వ కార్ మోడల్ మారుతి సుజుకి బాలెనో. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు మోడల్. ఈ కారు రూ. 6.66 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంది.
కాగా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్ మోడల్ అమ్మకాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ కారు సేల్స్ పరంగా మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 2024 నాటికి, బాలెనో 17,517 యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 18,592 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.

మారుతీ సుజుకి డిజైర్ (Maruti Dzire): 2024 ఫిబ్రవరిలో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్న కారు మోడల్ మారుతి సుజుకి డిజైర్. 15,837 యూనిట్ల విక్రయాలను సాధించగా.. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది 6 శాతం వృద్ధిని సాధించింది. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ. 6.56 లక్షల నుండి రూ. 9.39 లక్షల వరకు ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

మారుతీ బ్రెజ్జా (Maruti Brezza): టాప్ 5 లో చివరి స్థానం దక్కించుకున్న కారు మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 15,765 యూనిట్ల మారుతి బ్రెజ్జా యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ కారు రెండు పెట్రోల్ మరియు CNG ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రూ. 8.34 లక్షల ప్రారంభ ధరతో దీనిని కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








