చౌక ధరకే సరికొత్త ఫియస్టాను విడుదల చేసిన ఫోర్డ్
ఫోర్డ్ ఫియస్టా యాంబీన్టే వేరియంట్ ఇటు పెట్రోల్ వెర్షన్‌లోనూ అటు డీజిల్ వెర్షన్‌లోనూ లభ్యమవుతుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 1500 సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గ్లోబల్ మోడల్ ఫియస్టాను భారత్‌లో తొలిసారిగా జులై 2011లో కంపెనీ విడుదల చేసింది. అప్పట్లో ఈ కారు ప్రారంభ ధరలు రూ.8.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.10.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.
మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో విడుదలైన గ్లోబల్ ఫియస్టా అధిక ధర కలిగి ఉన్న కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించినంతగా సాగలేదు. అందుకే దీనిపై గడచిన మాసాల్లో భారీ డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించింది. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉండటంతో వేరే మార్గం లేక ఫోర్డ్ ఇండియా ఫియస్టా సెడాన్ ధరను భారీగా తగ్గిస్తూ, పాత మోడళ్లను ఈ కొత్త వేరియంట్‌తో రీప్లేస్ చేస్తూ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హమ్ మాట్లాడుతూ.. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ స్పందిస్తుందని, భారత్‌లో వినియోగదారుల అవసరాలను అందుకునేందుకు కట్టుబడి ఉంటుందని అన్నారు. రూ. 6.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి రూ.10.30 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్న హోండా సిటీ, హ్యూందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా తమ గ్లోబల్ ఫియస్టా నిలుస్తుందని ఆయన చెప్పారు.
గడచిన నెలలో గ్లోబల్ ఫియస్టాలో కంపెనీ ఓ సరికొత్త ఆటోమేటిక్ వెర్షన్‌నురూ.8.99 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్) విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









