అక్టోబర్ 5న విడుదల కానున్న అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివి
హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన 'అశోక్ లేలాండ్ స్టైల్' (Ashok Leyland Stile) ఎమ్‌పివి, అక్టోబర్ 5, 2013న వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నిస్సాన్ ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఈ కొత్త ఎమ్‌పివిని గడచిన జులై నెలలో అశోక్ లేలాండ్ ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.
నిస్సాన్ ఇవాలియా, అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిల బేసిక్ డిజైన్‌లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో మాత్రం కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇవాలియాతో పోల్చుకుంటే, స్టైల్‌లో కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్, విభిన్నమైన ఫ్రంట్ బంపర్ అండ్ గ్రిల్, బ్లాక్-గ్రే ఇంటీరియర్స్ (మ్యాచింగ్ అప్‌హోలెస్ట్రీతో) వంటి మార్పులు ఉన్నాయి.

అయితే, యాంత్రిక పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిలో ఉపయోగించిన ఇంజన్‌నే అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. నిస్సాన్ నుంచి పాపులర్ అయిన 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివిలో ఉపయోగించనున్నారు. ఇది 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన అశోక్ లేలాండ్ స్టైల్ లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది.
చెన్నైలో ఉన్న నిస్సాన్ ప్లాంటులోనే స్టైల్ ఎమ్‌పివిని కూడా ఉత్పత్తి చేయనున్నారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, నిస్సాన్ ఇవాలియా ధర కన్నా అశోక్ లేలాండ్ స్టైల్ ధర సుమారు రూ.50,000 వరకు తక్కువగా ఉండొచ్చని అంచనా. నిస్సాన్‌తో కలిసి అశోక్ లేలాండ్ ఇప్పటికే అందిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనం దోస్త్ ఎల్‌సివి ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఓ ప్యాసింజర్ క్యారీయర్‌ను కూడా తయారు చేస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








