వచ్చే ఆర్థిక సంవత్సరంలో చిన్న అంబాసిడర్ విడుదల!
మాంద్యంలో కూరుకుపోయిన హిందుస్థాన్ మోటార్స్ (సికె బిర్లా గ్రూప్ కంపెనీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఓ చిన్న కారును విడుదల చేసేందుకు స్ననాహాలు చేస్తుంది. భారత మార్కెట్లో చిన్న కార్లకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో, అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉన్న కారును అభివృద్ధి చేస్తోంది.
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ చిన్న కారును విడుదల చేస్తామని కంపెనీ ఎండీ సీఈవో ఉత్తమ్ బోస్ తెలిపారు. ఈ చిన్న అంబాసిడర్ సెడాన్ వేరియంట్‌లోనే ఉంటుందని, అయితే రెగ్యులర్ వెర్షన్ అంబాసిడర్ కన్నా తక్కువ ధరకే దీనిని అందిస్తామని ఆయన వివరించారు. దీని పొడవును నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేస్తున్న నేపథ్యంలో, ఈ కారుపై ఎక్సైజ్ సుంకం తగ్గుతుంది, ఫలితంగా తక్కువ ధరకే ఈ కారును ఆఫర్ చేసే ఆస్కారం ఉంటుంది. ఈ చిన్న కారు పేరును ఇంకా ఖరారు చేయలేదు.
ఆధునిక కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన బిఎస్4 వెర్షన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడిన కొత్త అంబాసిడర్ ఎన్‌కోర్ కమర్షియల్ లాంచ్ సందర్భంగా ఉత్తమ్ బోస్ ఈ వివరాలు తెలిపారు. రూ.4.98 లక్షల ధర కలిగిన (ఎక్స్-షోరూమ్) ఈ అంబాసిడర్ ఎన్‌కోర్‌కు ట్యాక్సీ సెగ్మెంట్ నుంచి మంచి ఆదరణ లభించగలదని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటికే ఈ కారుకు 450 బుకింగ్స్ వచ్చాయని, నెలకు 2,000 కార్లు విక్రయించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications









